భారతీయ స్త్రీలు… Shiv K Kumar, Indian Poet
.
ముమ్మారు వేగిన శీలవతులైన స్త్రీలు
మట్టిగోడలపై
కోపాన్ని ప్రకటించే కనుబొమల్ని చెక్కరు
ఊరిబావి గట్టుమీది
ఖాళీ కుండల్లా ఓపికగా
మిస్సిసిపీ నదంత పొడవైన సిగపాయలలో
ఒక్కొక్క అల్లికలోనూ ఆశలు పేనుకుంటూ
నీటిలో తమ నీడలు చూసుకుంటారు
తమ కళ్ళలోని చెమ్మకై వెదుకుతూ.
ఇసుకలో కాలిబొటనవేలితో ఆశల ఆకాశాల్ని చిత్రించుకుంటూ
మనసులోని పరివేదనల్ని అణుచుకుంటుంటారు
తమ భర్తల రాకకై ఎదురుచూస్తూ…
ఒక పక్క, పొద్దు మడతపెడుతున్న తమ నీడలు
దూరాన కొండలపై అంతరిస్తున్నా సరే.
.

షివ్ కె కుమార్
(ఈ పద్యంలోని సౌందర్యం చెప్పనలవి కానిది. ఇది ఇప్పుడు మృగ్యమైపోయిన ఒకనాటి పల్లెసీమల వాతావరణం చిత్రిస్తోంది. పరదేశం వెళ్ళిన పతికై ఎదురుచూస్తున్న భార్య మనః స్థితి వర్ణిస్తున్నాడు కవి ఇక్కడ. Triple-baked అన్న శబ్దాన్ని చాలా చమత్కారంగా వాడేడు. Double-baked Bread లా. Continent అన్నమాటకు ఇంద్రియనిగ్రహం అన్న అర్థం ఉంది.
విశ్వనాథ సత్యనారాయణగారు గ్రీష్మ ఋతువర్ణన చేస్తూ, ఎంతకీ వేడిమి చల్లారని రాత్రులవలన దంపతులు “అంతర్ బహిర్వహ్నితప్తులగుచు” బాధపడుతున్నారు అని అంటారు…
ఇక్కడ కవి విరహోత్కంఠితలని వర్ణిస్తున్నాడు చాల సుకుమారంగా. జడలు పొడుగు అని చెప్పకుండనే చెబుతూ మిస్సిస్సిపి నది అంత పొడవుగా ఉన్న జడ అల్లుకుంటూ ప్రతి అల్లికలోనూ ఆశలు పెనవేసుకున్నారనడంలో ఒక సౌందర్యం ఉంటే, నీటిలో తమ కళ్ళలోని చెమ్మకోసం ప్రతిబింబాలు చూసుకున్నారనడంలో ఎంత అందం ఉందో గమనించండి. అంటే ఎంతగా ఎదురుచూసి చూసి కళ్ళు ఎండిపోయాయో! చివరగా, సూర్యాస్తమయంతో పాటు అలా అలా పక్కకి జరిగిపోతున్న తమనీడల్ని పొద్దు “ఛాయల్ని మడతపెట్టడం” గా చెప్పడం కళ్లకు కట్టించే ఒక అపురూపమైన చిత్రణ. )
.