మనసే నా సామ్రాజ్యం.
అక్కడ నాకు ఎంత మహదానందం దొరుకుతుందంటే…
దాతలు కనికరించడం వల్లనో, లేక స్వతస్సిద్ధంగానో
సృష్టిలో లభించే ఆనందాలన్నీ దాని ముందు దిగదుడుపే.
అందరూ కోరుకునేవే నేను కోరుకున్నప్పటికీ
నా మనసు అలాంటివి అడక్కూడదని నిషేధిస్తుంది.
రాజుల ఆడంబరాలూ, అంతులేని సంపదలూ…
యుద్ధంలో జయించడానికి సైన్యాలూ…
నా బాధలు ఉపశమించడానికి కపటోపాయాలూ…
కళ్ళ తనివి తీరడానికి అందమైన ఆకృతులూ…
వీటి వేటికీ నే బానిసని కాలేను.
కావలసినవన్నీ నామనసు నాకిస్తుంటే, ఎందుకవి?
బాగా ఉన్నవాళ్లు ఎలా బాధపడతారో తరచు చూస్తున్నాను
తొందరగా పైకి ఎగబ్రాకిన వాళ్ళు అంత తొందరగానూ దిగజారతారు
ఎవరైతే ఉన్నతస్థితి చేరుకుంటారో
వాళ్లకెప్పుడూ ప్రమాదం పొంచే ఉంటుంది.
నానాబాధలూ పడి సంపాదించి, భయంతో కాపాడుకుంటారు.
అలాంటి బాధలు నా మనసు భరించలేదు.
నాకున్నదాంతో, సంతృప్తిగా బ్రతుకుతాను,
నాకు కావలసినదానికంటే ఎక్కువకోరుకోను
అధికారానికీ, దర్పానికీ నే తలవంచలేను
నాకేమిటి కావాలో నా మనసు అందిస్తుంది.
నామనసు నాకివ్వగలిగినదానితో సంతృప్తిపడి
నేను రాజాలా బ్రతుకుతాను.
కొందరికి చాలా ఉంటుంది, అయినా ఇంకా కావాలి;
నాకేం లేదు, కానీ, నాకు లేనిదంటూ ఏమీ లేదు;
వాళ్ళకు ఎంతున్నా దరిద్రులే
నాకు దాచడానికి ఏమీ లేకున్నా ఆస్తిపరుడినే;
వాళ్లు పేద, నేను ధనికుడిని; వాళ్లు అడుగుతారు, నేను ఇస్తాను;
వాళ్ళకి లేమి, నాకు మిగులు; వాళ్లు విచారిస్తారు, నేను జీవిస్తాను.
ఒకరి నష్టానికి నేను ఆనందించను,
ఎవరికైనా లాభిస్తే నేను బాధపడను;
ప్రాపంచిక విషయాలు నా మనసును ఊగిసలాడించవు
నా స్థితి ఎప్పుడూ ఒక్కలాగే నిలకడగా ఉంటుంది.
శత్రువులవల్లభయం లేదు; స్నేహితుల్ని పొగిడే పనిలేదు
జీవితమంటే విరక్తీ లేదు; చావంటే భయమూ లేదు.
కొందరు తమ సుఖాన్ని కామంతో కొలుస్తారు
కొందరు తమజ్ఞానాన్ని తమ రచనావైదుష్యంతో అంచనా వేస్తారు
కొందరికి తమ సంపదపైనే నమ్మకం
కొందరి నైపుణ్యమంతా వారి కుటిలత్వం లోనే.
కానీ, నాకు ప్రశాంత చిత్తాన్ని కలిగి ఉండడంలోనే
అన్నిటినీ మించిన ఆనందం దొరుకుతుంది.
నా ఆరోగ్యమే నా సంపద, తిరుగులేని సౌఖ్యం.
నిర్మలమైన నా మనసే నాకు రక్షణ కవచం.
లంచాలతో సంతోషపెట్ట ప్రయత్నించను;
మోసం చేసి శత్రుత్వాన్ని కొనితెచ్చుకోను;
ఇలాగే జీవిస్తాను, ఇలాగే మరణిస్తాను.
అందరూ ఇలా నడిస్తే ఎంత బాగుణ్ణు!
.
ఎడ్వర్డ్ డైయర్,
October 1543 – May 1607
ఎలిజబెత్ I రాణి రాజసేవకుడు, కవి
.
(ఇక్కడ కవి మనసే తన సామ్రాజ్యం అని చెప్పేడు. కానీ, ఆ మనసు అన్నిటికీ అర్రులుజాచే మనసు కాదు. సంస్కారవంతమైన ఆలోచనలతో, విజ్ఞతతోకూడిన ఆలోచనలతో అదుపులో ఉంచుకున్న మనసు. పోతనగారు భాగవతంలో “సంతుష్టుడీ మూడుజగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషిగాకుంట సంసార హేతువు, సంతసంబున ముక్తిసతియు దొరకు..” అని అన్నారు. దేశకాలావధులతో సంబంధంలేకుండా, సుఖమయ జీవితానికి విజ్ఞులు చెప్పే చిట్కా ఒక్కటే : ఉన్నదానిలో సంతృప్తి, లేనిదానికై వగవకపోవడం, ఇతరుల కలిమికి అసూయపడకపోవడం. కవి ఇదే విషయాన్ని ఎంతో చక్కగా చెప్పేడు. )
అమ్మా జ్యోతిర్మయీ,
ఇందులో గమ్మత్తు ఇది సుమారు 500 సం వత్సరాల క్రిందటి కవిత. ఆలోచనలన్నీ మన శతక వాజ్ఞ్మయం చెప్పిన నీతిసూక్తులకు దగ్గరగా ఉంది. మతం నేటికంటే ప్రబలంగా రాజ్యం చేసిన రోజుల్లో కూడా వ్యక్తి ప్రవర్తనకే, నడవడికే ఎక్కువ ప్రాథాన్యత ఉండేది. ఇప్పుడు మతం, నైతిక ప్రవర్తనా రెండూ దేనికదే. మనవాళ్ళంటుంటారే … తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అని… అలా తయ్యారయ్యాయి. నైతిక ప్రవర్తన మార్గదర్శకులుగా ఉండవలసిన ఉద్యోగాలన్నిటిలోనూ చాలా దిగువస్థాయిలో ఉండడం మన దురదృష్టం. చక్రం పైకి వెళ్తుందని ఆశించి నిరీక్షిస్తూ, మనవంతు కృషి మౌనంగా చేసుకుంటూ పోవడమే.
ఆశీస్సులతో
అందరూ ఇలా ఉంటే ఎంత బావుణ్ణు..కలగా మిగిలిపోతుందేమో ఇది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అమ్మా జ్యోతిర్మయీ,
ఇందులో గమ్మత్తు ఇది సుమారు 500 సం వత్సరాల క్రిందటి కవిత. ఆలోచనలన్నీ మన శతక వాజ్ఞ్మయం చెప్పిన నీతిసూక్తులకు దగ్గరగా ఉంది. మతం నేటికంటే ప్రబలంగా రాజ్యం చేసిన రోజుల్లో కూడా వ్యక్తి ప్రవర్తనకే, నడవడికే ఎక్కువ ప్రాథాన్యత ఉండేది. ఇప్పుడు మతం, నైతిక ప్రవర్తనా రెండూ దేనికదే. మనవాళ్ళంటుంటారే … తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అని… అలా తయ్యారయ్యాయి. నైతిక ప్రవర్తన మార్గదర్శకులుగా ఉండవలసిన ఉద్యోగాలన్నిటిలోనూ చాలా దిగువస్థాయిలో ఉండడం మన దురదృష్టం. చక్రం పైకి వెళ్తుందని ఆశించి నిరీక్షిస్తూ, మనవంతు కృషి మౌనంగా చేసుకుంటూ పోవడమే.
ఆశీస్సులతో
మెచ్చుకోండిమెచ్చుకోండి