Listen to the Poem in Fatima Al Matar’s Voice:
http://www.youtube.com/watch?feature=player_embedded&v=DRkKmkFfhk0
ఓ నా వదనమా!
నువ్వూ నేనూ ఎలా పెరిగాము!
నిన్ను నాకో ముసుగులా వాడడం ఎంత త్వరగా నేర్చుకున్నానో
అంత త్వరగా నువ్వు నీ బుగ్గల నునులేతదనం విడిచావు
విశాలమైన కన్నుల్లో అమాయకత్వాన్ని కూడా విడిచిపెట్టావు
వదనమా!
నీ వెనక దాక్కోడం ఎంత హాయిగా ఉంటుందో!
నిన్ను నా వయసుని మోయనియ్యడం ఎంత తేలికగా ఉంటుందో!
నా పిచ్చి పిచ్చి ఆలోచనల్నీ, ప్రతి సంతోషాన్నీ, ఆవులింతల్నీ, ప్రతి అసహ్యాన్నీ,
నా నిరాశాలనీ, అయిష్టాల్నీ, అవమానపు నిట్టూర్పుల్నీ
నువ్వు ప్రకటించేలా చేశాను.
వదనమా! వయోభారాన్ని నీమీద మోపి,
జీవితపు భయాల్నీ, అంతులేని కన్నీళ్ళనీ
నీ మీద రుద్ది, నీకు ఎన్నో
ఆకారాలూ, పేర్లూ, వ్యక్తిత్వాలూ ఆపాదించేను.
ఇప్పుడు ఒకసారి ఫొటోలలోకి చూస్తుంటే,
మరోసారి ఫొటోలలోకి తొంగి చూస్తుంటే నాకు అనిపిస్తోంది
నీకు నిజంగా నవ్వాలని అనిపించనపుడు
నిన్ను నేను నవ్వమని అనకుండా ఉండాల్సింది;
నిన్ను చిరాకుపరిచే వెక్కిరింతల్ని నేను తుడిచి ఉండాల్సింది.
చిట్లించిన నీ కనుబొమలు ఒకసారి
అవధిలేని నీ అహంకారాన్ని నువ్వు మరిచిపోయేలా చేసాయి;
నిష్కారణమైన ఆ కనుబొమల చిట్లింతల్ని విరమించుకో.
నిన్ను కలిసిన ప్రతిసారీ,
ప్రతిబింబంగా అనుకోకుండా తారసపడినపుడూ, లేదా,
మరొకరి కనుపాపల్లోంచి నువ్వు నన్ను తేరిపారిచూసినపుడూ
నాకు నిన్ను గుర్తుపట్టడానికి ఒకటి రెండు క్షణాలుపడుతుంది.
నా ఆశలకీ,
నీ యవ్వనపు కవోష్ణరుచి ఎన్నటికీ మారదనుకునే
నా గాఢమైన అమాయకపు నమ్మకానికీ
విరుద్ధంగా, నువ్వెంత మరిపోయేవు!
వదనమా! నువ్వూ నేనూ ఎలా పెరిగాం!
ఈ పెదాలకీ, ఈ నయనాలకీ మధ్యన
నిర్విరామంగా మనం ఎన్ని కథలు చెప్పుకున్నామని!
ఎన్ని మరువలేని ప్రేమలు! ఎన్ని క్షమించరాని అబద్ధాలు!
వదనమా! నిజానికి నీకు ఇవన్నీ ఎలా చెప్పాలో మప్పింది నేనే
… నువ్వు తు.చ. తప్పకుండా అలాగే చెప్పావు.
నేను నిన్ను కపటంగా నటించమని ఆదేశించినపుడు
నాకు విధేయతతో, విశ్వాసంతో, నడుచుకున్నావు.
.
ఫాతిమా అల్ మతార్
సమకాలీన కువైటీ కవి

స్పందించండి