అనువాదలహరి

జీవితం ఒక వరం … కోలరిడ్జ్

ఆత్మహత్య చేసుకోదలచుకున్న వ్యక్తి వాదన:

.

నేను పుట్టబోయే ముందు, అసలు నాకు పుట్టాలని ఉందో

లేదో అడగలేదు; అలా జరిగి ఉండవలసింది కాదు.

జీవించడమే ప్రశ్న అయినపుడు, ఆ ప్రయత్నం చెయ్యడానికి

పంపించే వస్తువుకి  ఇష్టం ఉండాలి; లేదు అంటే అర్థం? చావడమే.

.

ప్రకృతి సమాధానం:

.

ఎలా పంపేనో అలా వెనక్కితిరిగిరావడం లేదూ?

శరీరం వల్ల కొత్తగా వచ్చిన నష్టం ఏముంది?

ముందు నువ్వేమిటో ఆలోచించుకో.

గతంలో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేసుకో!

నీకు అమాయకత్వాన్నిచ్చేను, భవిష్యత్తుమీద ఆశని ఇచ్చాను

ఆరోగ్యాన్ని, మేధస్సునీ, ఎన్నో అవకాశాలనూ ఇచ్చాను.

నాకు నువ్వు తిరిగి ఇచ్చినదేమిటీ? నేరమూ, సోమరితనం, నిరాశా?

ఒక సారి లెక్కలేసుకుని చూడు ; తనిఖీ చేసుకో, తైపార వేసుకో!

అప్పుడు దమ్ముంటే— చావడానికి ప్రయత్నించు!

.

Samuel Taylor Coleridge (1772-1834)
Samuel Taylor Coleridge (1772-1834) (Photo credit: Wikipedia)

సామ్యూల్ టేలర్ కోలరిడ్జ్

(21 October 1772 – 25 July 1834)

English Poet, Philosopher

(కోలరిడ్జ్ అపారమైన మేధా సంపత్తి ఉన్న వ్యక్తేగాక  ఇంగ్లీషులో రొమాంటిక్ మూవ్ మెంట్ గా పిలవబడే ఒక భావ విప్లవ ఉద్యమానికి వర్డ్స్ వర్త్ తో కలిసి రూపకల్పన చేసినవాడు. అతని మేధస్సుకి దీటైన (బ్రిటిష్ రాయల్ సొసైటీ సభ్యులకి అనేక సాహిత్య ఉపన్యాసాలిచ్చిన మేధావి) సాహిత్య కృషిని మిగల్చలేకపోయినా, ప్రకృతిని అంతవరకు చూడని ఒకకోణం లో ఆవిష్కరించిన వ్యక్తి.

ఈ కవితలో ఎంత సున్నితంగా, ఆత్మహత్యని నిరసించాడో గమనించండి. ప్రకృతి మనకు ఒక మనిషిగా  బ్రతకగలిగే అవకాశాన్నేగనక ఇచ్చి ఉండకపోతే, మనం ఏ రాయి, రప్పలా అచేతనంగా పడిఉండే వాళ్లమో తెలీదు. ప్రాణం ఇచ్చి, జ్ఞానేంద్రియాలిచ్చి, ప్రకృతిని అనేకవన్నెలలో చూసి ఆనందించగల బుద్ధివిశేషాన్నిచ్చి పంపితే, వ్యక్తి తనకిచ్చిన సంపదని గుర్తించలేక, లేనిదానికోసం వగస్తూ, నిరాశతో జీవితాన్ని అంతంచేసుకో జూస్తున్నాడంటే ఎంత హాస్యాస్పదం? మనిషి తన బలాన్ని అవగాహన చేసుకుని ఇటువంటి అపురూపమైన అవకాశం దొరికినందుకు ఆనందిస్తూ జీవితానికి ఒక పూర్ణతని సాధించాలని కవిభావన.)

.

The Suicide’s Argument

Ere the birth of my life, if I wished it or no
No question was asked me–it could not be so !
If the life was the question, a thing sent to try
And to live on be YES; what can NO be ? to die.

NATURE’S ANSWER

Is’t returned, as ’twas sent? Is’t no worse for the wear?
Think first, what you ARE! Call to mind what you WERE!
I gave you innocence, I gave you hope,
Gave health, and genius, and an ample scope,
Return you me guilt, lethargy, despair ?
Make out the invent’ry ; inspect, compare !
Then die–if die you dare !
.

Samuel Taylor Coleridge

4 thoughts on “జీవితం ఒక వరం … కోలరిడ్జ్”

 1. ఒక సారి లెక్కలేసుకుని చూడు ; తనిఖీ చేసుకో, తైపార వేసుకో!

  అప్పుడు దమ్ముంటే— చావడానికి ప్రయత్నించు!

  మంచి కవిత, అనువాదం. ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తికి సూటి ప్రశ్న.

  మెచ్చుకోండి

  1. శర్మగారూ,
   ప్రకృతిలో మనం ఒక అంతర్భాగమనీ, వంతులవారీగానో, ఒక నియమితమైన ఆవృత్తాలలోనో జీవ జడపదార్థాలుగా మారుతామనీ, అలా జీవపదార్థంగా, అందులో మనిషిగా శరీరం ఉన్నప్పుడు మిగతా చరాచర ప్రకృతికంటే మనం ఎంత advantageలో ఉన్నామో సున్నితంగా వ్రాసిన కవిత. మేధస్సు ఎక్కువవుతున్న కొద్దీ బహుశా వాళ్ళలో విమర్శకుడుకూడా అంత ఎక్కువగా ఎదుగుతాడు. ఒకరకంగా ఇది మౌలికమైన క్రియాత్మక కవిత్వానికి ప్రతిబంధకంగా నిలుస్తుంది.కోలరిడ్జ్ విషయం లో బహుశా అలాగే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. అతని అనారోగ్యమూ, నల్లమందుకి బానిస అవడం కూడ మనకి అతని నుండి అద్భుతమైన కావ్యాలు పొందలేకపోడానికి ఒక కారణం. ఆ మేరకు మనం దురదృష్టవంతులమే.
   అభివాదములతో

   మెచ్చుకోండి

  1. భాస్కర్ గారూ,
   ఆత్మహత్యలు, స్థలకాలాదులతో నిమిత్తంలేకుండా ఉండేవే. అదొక బలహీనత. మానసిక పరిణతలేక ఒక సారీ, జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేక ఒక సారీ, కేవలం క్షణికావేశంలో మరోసారీ జరిగే ప్రక్రియ. దీనికిప్పుడు ఒక కొత్త కోణం తయారైంది. ఒక లక్ష్యం పేరుతో తాము ఆత్మహత్యచేసుకుంటూ మరికొంతమందిని చంపడం. పేరు ఏదైనా, క్రియ ఒకటే. కాకపోతే జీవితానికి ఇచ్చే అర్థం లోనే మార్పులు.
   అభివాదములతో

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: