నోటెర్ డాం చర్చిలో నల్ల యువతి … రాబర్ట్ విలియం సెర్విస్.
ఈ రోజు నేను చర్చిలో ప్రార్థనకి హాజరైనపుడు,
ఒక నల్లజాతి యువతి నా ప్రక్కన కూర్చుంది.
ఆమె మోకాలిపై ప్రణమిల్లి
ప్రార్థనచేసిన తీరు ఎంతో ముచ్చటవేసింది.
దయాళువూ, శక్తిమంతుడూ అయిన
భగవంతుడున్నాడో లేడో గాని,
అతనిపట్ల ప్రకటించే ప్రేమ
మట్టిపెళ్ళనిసైతం వెలుగుచిందేలా చేస్తుంది.
నాకు రెండోవైపున గంజిపెట్టిన బట్టలేసుకుని కూర్చున్న
అహంకారం తొణికిసలాడుతున్న యువతి
నాతో ఇలా అంది: “ఆర్యా! ఇలాంటి విషయాలు
కొనసాగనివ్వడం అమర్యాదకాదూ?
మా వైపు, ఈ నీగ్రోలని ఎక్కడ ఎలా ఉంచాలో
బాగా తెలుసునని సగర్వంగా చెప్పగలను.
ఒక నల్లపిల్లని తెల్లవాళ్ళ ప్రక్కన కూచుని
భగవంతుని ప్రార్థించడానికి అనుమతించడమే!!!”
ఆమె గొంతులోని కాఠిన్యం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేనో సాధారణవ్యక్తిని. పసుపూ, గొధుమా,
నలుపూ, సింధూరం అన్నతేడా లేకుండా
నాకు తారసపడే వాళ్ళందరితోనూ స్నేహం చేస్తాను.
ఒద్దికగా ఉండే ఏ రంగుపిల్లతోనైనా
కాపురంచేసి పదిమందిపిల్లల్ని కనడానికిగాని,
రంగూ, జాతి భేదం లేకుండా ఏ మనిషితోనైనా
స్నేహపూర్వకంగా తాగడానికిగాని అభ్యంతరం లేదు.
మతాలు నిజమో అబధ్ధమో కావచ్చు,
దేవాలయాలు నిజమో అబధ్ధమో కావచ్చు,
కానీ, నీలో నమ్మకమంటూ ఉంటే,
అది స్వయంప్రకాశవంతమైన వెలుగులా ఉంటుంది.
నాకు భక్తిలేదని కాదు. నేను కూడా
మనఃస్ఫూర్తిగానే ప్రార్థిస్తూంటాను. కాని,
భగవంతుడు అనుగ్రహించడమంటూ జరిగితే,
నా కంటే ఆ నల్లయువతినే అనుగ్రహిస్తాడని నా నమ్మకం.
నల్లతోలుని రాత్రింబవళ్ళు ఎంతగా తోమినా, రంగుమార్చలేమన్నది నిజం కావొచ్చు; కానీ, అతని చర్మం క్రింద బహుశా నీ అంత, లేదా నీకంటేకూడా తెల్లగా ఉన్నాడేమో?
.
రాబర్ట్ విలియం సెర్విస్.
(జనవరి 16, 1874 – సెప్టెంబరు 11, 1958)
ఇంగ్లీషు కవీ రచయితా
(డబ్బు, ఉన్నతకులం, అధికారం, యవ్వనం, మేధస్సు అనే అంతర్బాహ్యవిభేదాలని మనం భగవంతుని ప్రార్థించే స్థలాల్లో సైతం వీడలేకపోవడాన్ని కవి ఎంతో సున్నితంగా చెబుతున్నాడు. ఇవి నిజమైన సంఘటనలు కానక్కరలేదు. కాని సత్యాన్ని ఆవిష్కరించడానికి మన పూర్వీకులు చేసిన పని ఇదే… ఉదాహరణతో చెప్పడం.)
English: Notre-Dame de Paris, view from Pont de l’Archevêché, snowy last day of autumn 2010 Français : Notre-Dame de Paris, vue du Pont de l’Archevêché, neige, dernier jour de l’automne 2010 (Photo credit: Wikipedia)
.
Negress In Notre Dame
When I attended Mass today A coloured maid sat down by me, And as I watched her kneel and pray, Her reverence was good to see. For whether there may be or no’ A merciful and mighty God, The love for Him is like a glow That glorifies the meanest clod.
And then a starched and snotty dame Who sat the other side of me Said: “Monsieur, is it not a shame Such things should be allowed to be? In my homeland, I’m proud to say, We know to handle niggers right, And wouldn’t let a black wench pray And worship God beside a white.”
Her tone so tart bewildered me, For I am just a simple man. A friend in every one I see, Though yellow, brown or black and tan. For I would father children five With any comely coloured maid, And lush with any man alive, Of any race, of any shade.
Religion may be false or true, The Churches may be wrong or right, But if there be the Faith in you It can be like a shining light. And though I lack not piety And pray my best, I’m sure that God To that black wench and not to me Would give his most approving nod.
Aye, you may scrub him day and night,
You’ll never change a nigger’s hide;
But maybe he is just as white,
(Or even more) than you…inside.
.
English: Poet and author Robert W. Service, sometimes referred to as “the Bard of the Yukon”. (Photo credit: Wikipedia)
అప్పటి పరిస్తితులు వేరు
ఇప్పటి పరిస్థితులు వేరు
జాతి మత రంగు భేదాలు ఇప్పుడు లేవని అనుకుందాం
నమ్మకాలు ప్రార్ధనలు ఎవరి ఇష్టం వారిది అనుకుందాం
ఇటువంటి అనువాదాలవల్ల ఒరిగేది ఏమి లేదని అనుకుందాం
దడాల వెంకటేశ్వర రావుగారూ,
మిగతావాటిసంగతి అటుంచితే, మీరు చెప్పినదాంట్లో ఒకటిమాత్రం అక్షరాలా నిజం. ఇలాంటి అనువాదాలవల్ల ప్రయోజనం లేదన్నది. మార్పు ఎప్పుడూ మనిషిలోనే ఉంటుంది. కవిత్వం చదవడం వల్లనో, ఒకరు చెప్పారనో మనుషులు మారుతారనుకోవడం అవివేకం. ఒకే సంఘటనకు నాలాంటివాడు నిర్లిప్తంగానో, జాలివెళ్ళబుచ్చో, పనికిమాలిన కోపం ప్రదర్శించో అనుభూతిని అక్కడికి అంతం చేసుకుంటే, కవి అయినవాడు ఒక కవితో, గీతమో, కావ్యమో రాస్తాడు. మళ్ళీ అదే కవి అలాంటిదే మరొక సంఘటన పునరావృతం అయినప్పుడు, నాలాగే నిర్లిప్తంగా ఉంటాడు. కనుక, మనలోని మార్పులకి కారణం ఎప్పుడూ మనలోపలే నివురుగప్పి ఉంటుంది తప్ప బయట ఉండదు. కొన్ని సంఘటనలు వ్యక్తుల emotionsలో కలిగించే తీవ్రత బట్టి వాళ్ళ ప్రతిస్పందన ఉంటుంది. మనకు తెలుగులో దీన్ని వివరించే సామెతలూ, పద్యాలూ ఉన్నాయి. నువ్వుల్లో నూనెలేకపోతే, తెలుకలవాడిని నిందించి ఏమి ప్రయోజనం అనీ, తివిరి ఇసుమున… అనీ ఇలా. వీటి ముఖ్యమైన తాత్పర్యం ఏమిటంటే, అసలు మార్పుకి కావలసిన మౌలిక తత్వం మనిషిలోనే ఉందని చెప్పడమే. మిగతా సంఘటనలు కేవలం ఆ లోపలి శక్తికి ఉత్ప్రేరకాలుగా పనిచెయ్యడమే. అదికూడా చాలా తక్కువ సందర్భాల్లో. అంతమాత్రం చేత ఉత్ప్రేరకాన్ని మార్పుకి కారణభూతమని చెప్పకూడదు.
ఇకపోతే, నేను ముందుగానే సెలవిచ్చినట్లు ఈ అనువాదాలు ఎవరినో మారుస్తాయన్న భ్రమతో చెయ్యడం లేదు. కేవలం నా ఆత్మానందం కోసం మాత్రమే. ఇతరులకి ఎవరికైనా లాభిస్తే అది కాకతాళీయం తప్ప ఉద్దేశించిన లక్ష్యం ఎంతమాత్రం కాదు.
ఆలోచింపచేసిన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
అభివాదములతో,
ఫణీంద్రగారూ,
మీరు ఈ రాబర్ట్ విలియం సెర్విస్ కవిత్వాన్ని చదివితే మనసు నిజంగా ఆర్ద్రమవుతుంది కొన్నిసార్లు. ఎంత సాధారణంగా ఉన్నట్టు అనిపిస్తాయో అంత ఆలోచనాత్మకంగా, సాంద్రంగా ఉంటాయి ఇతని కవితలు. అవి నిజంగా మనసుని సూటిగా తాకుతాయి.
అభివాదములతో
స్పందించండి