
.
స్వర్గంలోని ఘంటలన్నీ మ్రోగవచ్చు
అక్కడి పక్షులన్నీ కిలకిలరవా లాలపించవచ్చు
భూమిమీది నీటిబుగ్గలన్నీ చిమ్ముతూ పైకెగయవచ్చు
అవనిమీది గాలులన్నీమధురస్వరాలనొకచోట పోగుచెయ్యొచ్చు…
ఇంతవరకు విని, ఎరిగిన
మధుర స్వరాలన్నిటికంటే మధురమైనదీ,
వీణకంటే, పక్షి పాటకంటే,
అరుణోదయవేళ
వనిలో అతిశయించే ఆనందపుహేల కంటే,
పదాలుపాడుతున్నట్టు పైకెగజిమ్మే నీటి ఊటకంటే
వివర్ణమైన వేసవి వడగాలి వేడి ఊసులకంటే
తియ్యనిది ఇంకొకటుంది…
సృష్టిలో అంత తియ్యని స్వరం ఉందని
అది మోగేదాకా తెలీదు,
స్వర్గంలో ఉంటుందని ఊహించలేము…
అది
తూరుపు శిలాగ్రాలనుండి రాగరంజితంగా
జాలువారే కిరణాల సవ్వడిలా
సంతోషాతిశయంతో మనసు నిండినపుడు,
లలితంగానే కాని బలంగా, తేలికగానే కాని స్పష్టంగా
తొణికిసలాడే ఒక కుర్రవాడి నిర్మలమైన చిరునవ్వు.
స్వాగత గీతాలెన్నడూ అంత మధురంగా విని ఉండము;
అంత గట్టిగా ఆనందం ఎప్పుడూ కేరింతలు కొట్టదు;
స్వర్గం ఇక్కడకు దిగిందేమో అని అనిపించే
ఆ బంగారు మోములో పలికే నవ్వు
కోయిలలూ, చకోరాలూ, ఒకటేమిటి మనిషి విన్నవీ కన్నవీ
మధురంగా ఆలపించే అన్నిపక్షుల ఆలాపనలూ
ఏడేళ్ళ కుర్రాడి నవ్వు తీయదనంలో
సగానికి కూడా సాటిరావు.
.

స్పందించండి