అనువాదలహరి

దిగువన వేలాడుతున్న పొగమబ్బు… హెన్రీ డేవిడ్ థొరో

Image Courtesy: http://i.ytimg.com

[Emily Dickinson, Robert Frost, Henry David Thoreau వీళ్ళు ముగ్గురూ ప్రకృతి ఆరాధకులు. మనకు తెలియనిదీ, మన అవగాహనకు అతీతమైనదేదో ప్రకృతిలో ఉందని వీరి ప్రగాఢమైన విశ్వాసం. మనం ప్రకృతికి ప్రతిరూపాలమనీ, అందుకని, దాన్ని జాగ్రత్తగా పరిశీలించి, దాని సత్యాన్ని మనం  అవగాహన చేసుకోగలిగితే, తాత్త్వికంగా మనం ఎదగగలమని వారి అభిప్రాయం. థొరో ఒకచోట, “నాకు ప్రేమకంటే, ధనం కంటే, కీర్తికంటే సత్యాన్ని ప్రసాదించ”మంటాడు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ కిచెందిన వాల్డెన్ పాండ్  దగ్గర ఒక కుటీరం నిర్మించుకుని అతను సత్యాన్వేషణకు ప్రయత్నించాడు. అతను వాల్డెన్(Walden) కు వ్రాసిన ఒక లేఖలో “ప్రపంచం అశాశ్వతమూ, సంశయాత్మకమైనదీను. కాని, ఒక పగలు రాత్రీ మనం గనక ఆనందం తో స్వాగతించగలిగితే, పువ్వుల్లా, సువాసనలిచ్చే వనమూలికలల్లా, మనజీవితం కూడ సుగంధాల్ని విరజిమ్మగలిగితే, మనజీవితం ఆ క్షణం అమరత్వం పొందినట్లే.”

ఇప్పుడు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా కొనసాగుతున్న ప్రకృతిసంపద దోపిడీ చూస్తుంటే,  “బాబూ, మీ పిల్లలు కూడ భవిష్యత్తులో భాగమే, వాళ్ళుక్షేమగా ఉండాలంటే, మీరు దోచిపెట్టిన సొమ్ము అనుభవించడానికైనా నాలుగుకాలాలపాటు బ్రతకాలంటే, మీరు చేస్తున్న వనరుల దోపిడీ దానికి ఆ అవకాశం కల్పించదు” అన్న సత్యాన్ని  వీళ్ళకి ఎవరైనా బోధించగలుగుతారా అన్న సందేహం నాకు కలుగుతుంటుంది. ]

.

న్యూఫౌండ్ లాండ్ వాతావరణంలో

దిగువన వేలాడుతున్న పొగమబ్బు… 

అది

నీటిబుగ్గల పిచికారీ, నదుల జన్మస్థానం;

మంచు-వస్త్రం, కలలాంటి ముసుగు;

దేవతలు పరచిన చేతిరుమాలు;

గాలిలో తేలిపోయే మైదానం…

దాని గట్లంట ‘డెయిజీ’లూ, ‘వయొలెట్లూ’ పూచి,

దాని గహన జలమార్గాల్లో ఒకవంక

‘బిటెర్న్’ ల భయదసౌందర్యపు కూతలు వినిపిస్తే,

వేరొకవంక, కొంగలు మొలబంటి నీటిలో ఈదుతుంటాయి;

అది

సరస్సుల, నదుల, సముద్రాల చైతన్యం

మానవ సమూహాల్లోకి ఆరోగ్యప్రదాయిలయిన

పరిమళాల్నీ, వనమూలికల సుగంధాల్నీ మోసుకెళ్ళే వాహిక.

.

 హెన్రీ డేవిడ్ థొరో

.

Low-anchored Cloud Mist

.

Low-anchored cloud,
Newfoundland air,
Fountain-head and source of rivers,
Dew-cloth, dream-drapery,
And napkin spread by fays;
Drifting meadow of the air,
Where bloom the daisied banks and violets,
And in whose fenny labyrinth
The bittern booms and heron wades;
Spirit of lakes and seas and rivers,
Bear only perfumes and the scent
Of healing herbs to just men’s fields!

.

Henry David Thoreau

(July 12, 1817 – May 6, 1862)

American author, poet, philosopher, abolitionist, naturalist, tax resister, development critic, surveyor, historian, and leading transcendentalist.

%d bloggers like this: