అనువాదలహరి

సానెట్ CXVI … Shakespeare

[Marriage అన్న మాటకి పెళ్ళి/ వివాహం అన్న లౌకిక మైన అర్థాలే గాక, అంతకంటె ఉదాత్తమైన ‘కలయిక’ అన్న తాత్త్విక భావన ఉంది. ఈ కలయిక శారీరకమైనదేగాక, మానసికమైనది. ఇక్కడ అభిప్రాయాల కలబోత తర్వాత ఏకీకరణ ఉంటుంది. కలిసి ప్రవహించడం ఉంటుంది. అంతేగాని ఒకరి అభిప్రాయం ఎల్లప్పుడూ చెల్లాలన్న పట్టుదల, one-upmanship ల గొడవ కాదు. అది ఒక అపూర్వమైన స్నేహం. స్నేహం అంటే నెయ్యి అని అర్థం ఉంది.  అది వేడికి  కరుగుతుంది, చల్లదనానికి గడ్డకడుతుంది. కోర్కె రగిలినప్పుడు జ్వలించినట్టే, అనురాగం కలిగినప్పుడు ఆర్ద్రీభూతమవుతుంది. షేక్స్పియర్ ఈ సానెట్ ద్వారా అటువంటి మనసుల కలయిక ఎలా ఉంటుందో (ఉండాలో)  చెప్పాడు .

సంసారభారాన్ని సమంగా మోసే క్రమంలో, ఉద్యోగశ్రమలో ఉన్న ఒత్తిడులలో, మౌలికమైన అవసరాలకు దూరమవుతూ, ఈ ‘కలయిక’ పరమార్థాన్ని మరిచిపోయి,  ఏకాంత వాసానికి మొగ్గుతున్న యువతరం ఒక్కసారి వెనుదిరిగి తమని తాము ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. త్యాగమూ, ప్రేమా, రాజీ … వైవాహిక బంధంలోని 3 ముళ్ళు అని గుర్తెరిగి ప్రర్తించగలిగితే, తమ వ్యక్తిత్వాలని ఉదాత్తం చేసుకోడం తో పాటు, సమాజాన్ని కూడా  ఉధ్ధరించినవాళ్ళవుతారు.]

.

నిజమైన మనసులకలయికకి అవరోధాలుకలిగించడం

నేనంగీకరించను; అవకాశము దొరికినప్పుడు మారేదీ

తీసెయ్యాలనుకున్నప్పుడు తీసిపారేసేదీ ప్రేమకాదు.

ఓహ్! ప్రేమ  ధృవంక్షత్రంలా స్థిరమైనది.

తుఫానులకు జడవక ధైర్యంగా నిలదొక్కుకుంటుంది.

దారితప్పిన నౌకలకు అది దిక్సూచి;

దాని ఔన్నత్యం వెలకట్టగలమేమో గాని, దానివిలువ అమూల్యం;

గులాబివన్నె పెదవులూ, చెక్కిళ్ళూ కాలం కోడవలికోతకు బలి అవొచ్చు

అంతమాత్రం చేత, ప్రేమ కాలాన్ని మురిపించే హాస్యగాడు కాదు

కాలానికున్న సమయమనగా ఎంత?* ఈ నాలుగు గంటల్లోనో, వారాల్లోనో

ప్రేమ మారిపోదు. అది కాలాంతం దాకా చెక్కుచెదరక నిలిచి ఉంటుంది.

నేనే గనక తప్పని ఎవరైనా ఋజువు చేస్తే,

నే నెన్నడూ రాయనట్టే; మనిషెన్నడూ ప్రేమించనట్టే.**

.

(*    ఇక్కడ కవి కాలానికే కాలం చెల్లిపోతుందని చెబుతున్నాడు.

**   తను రాయడం నిజమే గనక, పరోక్షంగా తను చెప్పినవి నిజమని తెలియజేస్తున్నాడు)

షేక్స్పియర్

.

Let me not to the marriage of true minds

Admit impediments. Love is not love


Which alters when it alteration finds,


Or bends with the remover to remove:


O no! it is an ever-fixed mark


That looks on tempests and is never shaken;


It is the star to every wandering bark,


Whose worth’s unknown, although his height be taken


Love’s not Time’s fool, though rosy lips and cheeks


Within his bending sickle’s compass come:


Love alters not with his brief hours and weeks,


But bears it out even to the edge of doom.


If this be error and upon me proved,


I never writ, nor no man ever loved.

.

William Shakespeare

%d bloggers like this: