నాదగ్గరే గనక దేవతావస్త్రాలుంటేనా … WB Yeats

(ఈ కవితలో గొప్పదనం అలతి అలతి మాటలతో సుకుమారమైన భావనని అందించగలగడం. మొదటి నాలుగు పాదాల్లో అపురూపమైన దేవతా వస్త్రాల్నీ, వాటి రంగుల్నీ వర్ణించిన కవి, వాటిని దేనికి నియోగిస్తానంటాడు? తన ప్రేయసి పాదాలక్రింద పరచడానికి. అంటే ఆమె తనకెంత ప్రీతిపాత్రమైనదో చెప్పకనేచెబుతున్నాడు. కాని, తను పేదవాడు. అటువంటి అపురూపవస్త్రాలు తనదగ్గరలేవు. కానీ, అంతకంటే పదిలంగా తను ఆలోచనలతో, ఊహలలో రంగురంగులతో అల్లుకున్న కలలున్నాయి ఆమెకివ్వడానికి. వాటిని పరుస్తానంటున్నాడు తివాచీలా. కానీ, ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అవి దేవతా వస్త్రాల్లాగే విలువైనవీ, అపురూపమైనవీ. తను నిర్లక్ష్యంగా నడిస్తే చిరిగో, విరిగో చెల్లాచెదరైపోతాయని హెచ్చరిక చేస్తున్నాడు.
ఈ కవిత విశేష జనాదరణ పొందటమేగాక చాలా సినిమాల్లో, బి.బి.సి. రేడియో కార్యక్రమాల్లో… చాలాచోట్ల వినియోగించబడింది. ప్రేమికులమధ్య తరచుగా బట్వాడా అయ్యే ఈ కవిత చాలాసార్లు వివాహాలలో పాడబడిందికూడా.)
.
నా దగ్గరే గనక బంగారు, వెండి జలతారులతో
రచించి సింగారించిన దేవతా వస్త్రాలుండి ఉంటే
చీకటిలోని ముదురు, లేత రంగుల నీలవస్త్రాలూ
పగటిలో సగవన్నెగలిగిన ధవళ వస్త్రాలూ ఉండి ఉంటే
నీ పాదాలక్రింద పరిచి ఉండే వాడిని…
కాని, నిరుపేదనైన నాదగ్గర ఉన్నవి కలలు మాత్రమే!
నా కలల తివాచీ పరచాను నువ్వు పాదాలు మోపడానికి
నెమ్మదిగా నడువుసుమీ! నువ్వు నడిచేది నా కలలమీద!
.

విలియం బట్లర్ యేయ్ ట్స్.
.
He wishes for the cloths of heaven
.
Had I the heavens’ embroidered cloths,
Enwrought with golden and silver light,
The blue and the dim and the dark cloths
Of night and light and the half-light,
I would spread the cloths under your feet:
But I, being poor, have only my dreams;
I have spread my dreams under your feet;
Tread softly, because you tread on my dreams.
.
William Butler Yeats
(13 June 1865 – 28 January 1939)
Irish Poet and Playwright and Nobel Laureate for Literature, 1923.
This is one of his most famous poems, sweet and short. This is packed
with emotion, imagery and artistic expression.