మృత్యువుతో సంభాషణ … స్విన్ బర్న్
I
ఓ మృత్యువా! నీకభ్యంతరంలేకపోతే, నిన్నొకటడగాలని ఉంది.
మేము ఎన్నో ఆశల గూళ్ళను నిర్మించుకున్నామే.
నువ్వుతలుచుకుంటే, మా ఆత్మలు ప్రశాంతంగా ఉండడానికి
ఓ మృత్యువా! ఒక్కటంటే ఒక్కటి మాకు ప్రసాదించలేవా?
ఏ సార్వభౌమ చిహ్నాలూ అక్కరలేదు.
సూర్యుడూ, మంచు ముత్యాల మెరుపులు పొదిగిన గోపురాలూ అక్కరలేదు.
అధికారముద్రలనీ, కరవాలాలపిడులనీ ఉంచడానికి యోగ్యతలేనిదైనా సరే,
ఏదో ఒక అడవిచెక్కతో చేసినదైనా, తలమీద ఒకకప్పు, చాలు!
మార్పులూ, భయాలూ, పీడకలలూ,అపరాథభావనలనుండి విముక్తమై,
ప్రేమ శాశ్వతంగా నిద్రించేలా ఎంత హీనమైనదైనా, ఒక చిన్న ప్రియమైన గూడు;
చూసి తలుచుకుందికి, మా జీవితాలకి ఆమాత్రం విడిచిపెట్టలేవా?
ఓ మృత్యువా! నువ్వు తలుచుకోవాలిగాని.
II
ఓరి మానవా! నన్నెదిరించి వాదించడానికి నీ కెంత ధైర్యం?
నా పనితీరు ఏమిటో, నేను ఎప్పుడు ఎక్కడ
ఏమేమి సృష్టించగలనో నీకు తెలుసా? తెలీదు, పరికించి చూడు,
మానవా! నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు?
నీ జీవితసాఫల్యాలూ, నీ వంశవృక్షపు శాఖాగ్రాల నవకుసుమాలూ
నే వేసిన మొలకలు కాక మరేమిటనుకుంటున్నావు ?
ఈ భూమీ సప్తసముద్రాలూ నేను ఉఫ్ మని ఊదేనంటే
తట్టుకో లేవు. తల వాల్చవలసిందే.
నువ్వు గొప్పవాడివైతే కావచ్చు గాని, నా ముందు తల దించుకో:
కాలమూ, తిరుగులేని విస్మృతీ నిన్నక్కున జేర్చుకున్నాక,
నువ్వూ ఉండవు… నీ కనుబొమల మీద గర్వమూ ఉండదు.
మానవా! నువ్వనగా ఎంత?
III
ఓ మృత్యువా! నువ్వు చెప్పినట్టు నువ్వు శాశ్వతమైనా, కాకపోయినా,
మమ్మల్ని నువ్వు హరించినా, మేము బ్రతికిబట్టగట్టినా
ఓ మృత్యువా! నువ్వు ఉన్నావంటే, కారణం,
నీ బలం అంతా నువ్వంటే మాకున్న భీతి.
నీ శక్తి, మా భయం లోంచి పుట్టింది.
ఎవడు నీకు భయపడడో, వాడు నీ శిరసు మీది నుండి
భూమ్యాకాశాలను హరించగల కిరీటాన్ని సంగ్రహిస్తాడు.
భూమీ, సముద్రాలూ, ఆకాసమూ, చినుకులా ఆవిరిలా
మాయమైపోవచ్చు. వాటి అన్నిరూపాలూ నశించవచ్చు.
మృత్యువా! అసలు నువ్వు బ్రతికుంటావో లేదో
మాకు అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది.
.
