విన్నపం … డాంటే గేబ్రియల్ రోజెటీ

.
సుందరీ!
అతిశయించిన నీ కన్నుల్లో అలసట ఛాయలు కనబడుతున్నై;
‘ఇకపై, మగవాని మనసు చదివేసిన పుస్తకమే’ నని ఆలోచించినందుకు
ఎవరో దెబ్బలాడినట్టు
వాటిలో మేమెరిగిన మెరుగులు చిన్నబుచ్చుకున్నాయి.
.
సుందరీ!
ఎత్తిన నీ ముఖంలో కనిపించే ఒంటరితనం భరింపరానిది;
నిజమైన ఒంటరితనం పదిమందిలోనున్నా వెంటాడుతుంది.
నా మనసులోమాట చెప్పడం వల్ల అది పెరగదూ, తరగదు గదా?
నన్ను చెప్పనీ?
.
సుందరీ!
నా మనసులోని ఆలోచనలేమిటో నువ్వు ఆమాత్రం పసిగట్టలేవూ?
బహుశా నువ్వు వాటిని ఉపేక్షించదగినవిగా భావిస్తునా వేమో!
చెప్పకపోవడమే మంచిదని అనుకుంటున్నావేమో కూడా!
.
ఓహ్! అయితే, నువ్వొకటి మాత్రం తెలుసుకో!
నా మాట ఇంత బలహీనంగా వినిపించినా,
నా ప్రేమ చాలా గాఢమైనది.
సుందరీ! నిలు! అలా లేచి వెళిపోకు!
సుందరీ! ఒక్క సారి నా మాట విను!
ఇదొక్కటి గుర్తుంచుకో!
నీకు మగవాళ్ళగురించి ఎన్ని కథలు తెలిసినా,
తెలియని కథ ఇంకొకటి ఉందని గుర్తుంచుకో!
.
సుందరీ!
అరుణరేఖలు ఆకాశాన్ని తాకకముందు
చీకటి చాలసేపు ఆవరించి ఉంటుంది.
చిలకపచ్చనిమైదానాలు చేరుకునేలోపు
ఎన్నో మైళ్ళ ఎడారులు ఒంటరిగా నడవవలసి ఉంటుంది.
అంతేకాదు,
సందేహానికీ సందేహాకీ మధ్య మృత్యువు తొంగిచూస్తూ,
అదే శరణ్యమని గుసగుసలాడుతుంది.
.
సుందరీ!
నా ఆలోచనలు నిన్ను ఆమాత్రం సాహసించడానికి పురికొల్పడం లేదా?
నేను నీ చీకటులు తొలగించి, కొత్త వేకువకు తెర తీస్తాను;
సుందరీ!
చలివేంద్రాన్నై, సేదదీర్చి
నీ మనసుకి ప్రశాంతత చేకూర్చుతాను.
.
డాంటే గేబ్రియల్ రోజెటీ
ఇంగ్లీషు కవీ, చిత్రకారుడూ, అనువాదకుడూ.
యాంత్రికమైనకళను(చిత్రకళా,శిల్పకళకూడ) నిరశిస్తూ 1848 లో స్థాపించబడిన Pre-Raphaelate Brotherhood వ్యవస్థాపకుల్లో డాంటే రోజెటీ ఒకరు. అతను కవీ, చిత్రకారుడూ అనువాదకుడు కూడ. అతని కవిత్వం పై జాన్ కీట్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అతని చిత్రకళ యూరోపియన్ సింబాలిస్టు ఉద్యమాన్ని ప్రభావితం చేసింది. Pre-Raphaelate Brotherhood రూపకర్తల ఆదర్శాలు నాలుగు. చెప్పడానికి తమవైన అభిప్రాయాలు కలిగి ఉండడం, ప్రకృతిని ప్రతిబింబించ గలగడనికి వీలుగా నిశితంగా పరిశీలించడం, పాతదానిలోని మనసు రంజింపచెయ్యగలిగిన భాగాన్ని తీసుకుని, కేవలం సూత్రప్రాయాలూ, యాంత్రికంగా అలవరుచుకునే విషయాలను త్యజించడం, అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తమోత్తమమైన శిల్పాలూ, చిత్రాలూ సృష్టించడం. ఇందులో కళాకారులే వాళ్లప్రమాణాలు, ప్రతిఫలించే విలువలూ నిర్ణయించుకుంటారు.
