ఏదో ఒకరోజు … ఫరూవే ఫరుక్జాద్, పెర్షియన్ కవయిత్రి
ఏదో ఒకరోజు నన్ను మృత్యువు సమీపిస్తుంది
అది వెలుగులు విరజిమ్మే ఆమని ఉషోదయం కావచ్చు
లేదా, సుదూర శీతల సాయం సంధ్య కావచ్చు
లేదా, మంచుతెరలలో కరడుగట్టిన నిశ్శబ్ద హిమ నిశీధి కావచ్చు…
.
ఆ రోజు
నా చేతులు పాలిపోయిన కాగితంపై వాలిపోతాయి…
లయబద్ధమైన నా ఆలోచనా విహంగాలు పంజరం వదిలి ఎగిరిపోతాయి
ఈ చిట్టచివరి కవిత ప్రతిస్పందనలు మనసుకి అందక
ఇక ఏ బాధా, విచారమూ, ఆగ్రహమూ… ఉండవు.
.
ఈ నేల నా పేరు పదేపదే పిలుస్తుంటే,
వాళ్ళు నన్ను సమాధిచెయ్యడానికి వస్తారు…
ఓహ్, కనీసం ఏ అర్థరాత్రో …
నా ఏకాంతస్థలిపై అభిమానులు
ఒక తెల్లగులాబీ ఉంచకపోతారా!
.
రోజులు చూస్తుండగానే వారాలైపోతాయి,
వారాలు అంతత్వరగానే నెలలయిపోతాయి.
నువ్వు వాచీలోకి కళ్ళు రిక్కించి చూస్తుంటావు,
నా ఉత్తరం కోసం, పిలుపుకోసం వృధాగా ఎదురుచూస్తూ…
.
కానీ,
నీకూ, నీ గుండె చప్పుళ్ళకీ దూరంగా,
నేలతల్లి నోరులేని చేతుల్లో,
నా ఈ జడ శరీరం నిర్వికారంగా నిద్రిస్తుంటుంది.
.
అప్పటినుండి,
ఎండా, గాలీ, వానా,
నా సమాధి మీది శీతలఫలకాన్ని శుభ్రపరుస్తూ ఉంటాయి.
.
చివరకి,
ఈ పేరుప్రతిష్టలూ, పునర్జన్మల ఊహలనుండి
విముక్తి పొందుతాను… శాశ్వతంగా.
.
