అనువాదలహరి

ఈ సాయంసంధ్యకూడా … పాబ్లో నెరూడా

.

ఓహ్! ఈ సాయంసంధ్యకూడా మనకి కాకుండా పోయింది.

.

సన్నని కారుచీకటి తెరలుకమ్ముకుంటుండగా

మనిద్దరం చెట్టపట్టాలేసుకునిఉండడమెవరూ చూడలేదులే.

.

నా కిటికీలోంచి గమనించాను

దూరాన కొండకొనకొమ్ములలో సూర్యాస్తమయ వేడుక

.

ఒకోసారి, ఎండతునక నా అరచేతుల్లో నిప్పుకణికలా మండుతుంది.

.

నీకు  తెలుసు… ఇంతవిచారంలోనూ,

నా మనసు ఉగ్గపట్టుకుని నిన్ను తలుచుకుంటానని!

అవును, ఇంతకీ నువ్వపుడెక్కడున్నావు?

నీతో ఎవరెవరున్నారు?

ఏం చెబుతున్నారు?

నువ్వు దూరంగా ఉన్నావన్న బాధలో నేనున్నప్పుడే,

నీ మీద నా ప్రేమ నన్ను అమాంతం ఉక్కిరిబిక్కిరి చెయ్యాలా?

.

అసురసంధ్యవేళ చదివే పుస్తకమెప్పుడూ క్రిందపడిపోతుంది.

నా జ్ఞానం దెబ్బతిన్న కుక్కపిల్లలా నా కాళ్ళదగ్గరే ముడుచుకుపోతుంది.

.

ముఖాలు అస్పష్టం చేస్తూ నిష్క్రమిస్తున్న సంధ్యతోపాటు,

నువ్వుకూడా ఎప్పుడూ నా నుండి జారుకుంటావు.

.

పాబ్లో నెరూడా

.

(అసురసంధ్యవేళ: సూర్యాస్తయమయి, పూర్తిగా చీకటిపడీ పడని వేళని ఉత్తరాంధ్రప్రాంతంలో అసురసంధ్యవేళ అంటారు… Thanks Usha garu for the correction)

.

We Have Lost Even…

.

We have lost even this twilight.

No one saw us this evening hand in hand

While the blue night dropped out of the world.

I have seen from my window

The fiesta of sunset in the distant mountain tops.

Sometimes a piece of sun

Burned like a coin between my hands.

I remembered you with my soul clenched

In the sadness of mine that you know.

Where were you then?

Who else was there?

Saying what?

Why will the whole of love come on me suddenly

When I have sad and feel you are far away?

The book fell that is always turned to at twilight

And my cape rolled like a hurt dog at my feet.

Always, always you recede through the evenings

towards where the twilight goes erasing statues.

.

Pablo Neruda.

(July 12, 1904 – September 23, 1973)

Chilean Poet, Diplomat and Politician .

6 thoughts on “ఈ సాయంసంధ్యకూడా … పాబ్లో నెరూడా”

  1. నందకిషోర్ గారూ,
   “ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక” అన్నట్టు అందమైన వస్తువు అందరికీ సుందరంగానే కనిపించి ఎవరికి వారు స్వంతంచేసుకోవాలనిపిస్తుంది. కానీ, ఆ వస్తువు స్త్రీ ఐనపుడు, మనకున్న రాగద్వేషాలే, ఇష్టాయిష్టాలే ఆమెకీ ఉంటాయికదా. కనుక ఒక ముఖం వెలిగిస్తే, కొన్నివేల ముఖాలు కళావిహీనం కాకతప్పదు.
   అభివాదములతో

   మెచ్చుకోండి

 1. చిత్రంగా ఒక వారం వ్యవధిలో 3 అనువాదాలు చదివాను ఈ కవితకి. మొదటగా బాబాగారి బ్లాగులో http://sahitheeyanam.blogspot.com/2009/08/blog-post_26.html చదివి, మళ్ళీ ఈ మధ్యన మరొకమారు స్పందన రాసుకున్నాము నేను నా ప్రియసఖి ఒకతి. మీరు చూసే ఉన్న http://madhavauk.blogspot.com/2011/09/blog-post_26.html మరొకానువాదం కూడా బావుంది. ఇవాళ మీది. మీదైన బాణీ ఉందిక్కడ. నాకీ కవిత మహా మక్కువ అంచేత మళ్ళీ మళ్ళీ చదివా.

  మరొకలా అనుకోరనే – “కొనకొమ్ము” పునరుక్తి కాదా? కొమ్ము అన్నా కొన అనే కదా అర్థం. అలానే ‘అసలుసంధ్య’ కాదేమో మా ప్రాంతాల్లో ‘అసురసంధ్య’ అని పరిపాటి.

  మెచ్చుకోండి

  1. ఉషగారూ,
   బహుశా అది అసలుసంధ్యకి బదులు “అసురసంధ్య” యే అయి ఉంటుంది. చీకటి ముదురుతున్నకొద్దీ రాక్షసులు విజృంభిస్తారనికదా లోకవ్యవహారం. అయితే బహుశా వ్యవహారంలో భ్రష్టమయి అసలు సంధ్యాకాలం అయిఉంటుంది. అది కరెక్ట్ చేశాను. కొనకొమ్ము అన్నది పునరుక్తే. కాకపోతే చిన్న తేడా అల్లా కొన అన్నది చివర, కొమ్ము అన్నది “skewed” అన్న అర్థాన్ని సూచిస్తాయి. బహుశా, చిన్నప్పుడు నేను చదివిన భాస్కర శతక కారుడి (శ్రీ మారవి వెంకయ్య) ప్రయోగం నా Sub-consciousలో పనిచేసి ఉండవచ్చు. “కొండొకకోతి చెట్టుకొనకొమ్మన నుండగ” అని ఆయన అనువాదం.
   అభివాదములతో

   మెచ్చుకోండి

 2. మూర్తిగారికి
  నమస్తె
  అద్బుతంగా ఉంది సార్.
  ఒక సందేహం
  cape అన్న పదం గురించి
  నేను తీరం అని అన్వయించుకొన్నాను (ఎందుకు అలా చేసానో ఇప్పుడు గుర్తుకు రావటం లేదు బహుసా cape of good hope మదిలో మెదిలిందేమో)
  మీరు జ్ఞానం అన్నారు
  నీలి టోపీ అని ఎక్కడో చదివాను

  can you please throw some light on this sir

  భవదీయుడు
  బొల్లోజు బాబా

  మెచ్చుకోండి

  1. బాబాగారూ,
   capeఅన్న పదానికి మీరు చెప్పిన అర్థం ఉంది. “capa”అంటే స్పెయిన్ లో బుల్ ఫైట్స్ సందర్భంలొ పోతుల్ని ఉసిగొలపడానికి వాడే ఎర్రని వస్త్రం అనీ, (ఆంధ్రా) యూనివర్శిటీ స్నాతకోత్సవాలలో వాడే (కాకపోతే డిక్ష్ణరీలో ఇచ్చిన అర్థం లో చేతులు ఉండవు) మెడనుండి మోకాళ్లదాకా వేలాడే (నల్లని) టటువంటి ఉడుపు అనీ చాలా అర్థాలున్నాయి. అయితే ఇవి ఏవీ నాకు పైన చెప్పిన వర్ణనతో పొసగడం లేదు. మీరు గమనించే ఉంటారు:
   “The book fell that is always turned to at twilight
   And my cape rolled like a hurt dog at my feet.”
   ఈ రెండు వాక్యాలూ అంతకుముందు చెప్పిన విషయానికి ఎక్కడా పొందికగా లేవు. కనుక అతను ఈ మాటల్ని సింబాలిక్ గా ప్రయోగించేడనుకున్నాను. అప్పుడుకూడ అవి ప్రేమకి గాని, ప్రేయసికిగాని ఎక్కడా అనుబంధంగా కనిపించడం లేదు. సూర్యాస్తమయాన్ని జీవిత చరమదశకు సరిపోల్చుకుంటే, ఈ సింబాలిజం నాకు కొంతమేరకి సరిపోయింది. చరమాంకంలో నేర్చుకున్న విద్య/ లౌకిక విషయాల్లో అయిన జ్ఞానోదయం ఎందుకూ పనికిరాదనీ, అది పాదాలదగ్గరే ఉంటుందనీ (తలదాక వెళ్ళదని), చెప్పడం కోసం వాడేడని నేను భావించాను. అందుకనే జ్ఞానం అని వాడేను.
   అభివాదములతో

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: