మా సరివి చెట్టు … తోరు దత్
(ఈరోజు తోరు దత్ 157వ జయంతి సందర్భంగా)
గరుకు గరుకుగా, గంట్లుబడి మచ్చలుదేరిన మా సరివిచెట్టుని
ఒక పెద్ద కొండచిలవలా, నక్షత్రాల పొలిమేరలదాకా
పెనవేసుకుందొక లత. మరోచెట్టయితే
దాని ధృతరాష్ట్రకౌగిలికి ఈపాటికి మరణించేది.
రోజల్లా పులుగులకీ,తుమ్మెదలకీ ఆశ్రయమిస్తూ,
ఈ మహాకాయిమాత్రం గొప్పగా మెడలో ధరించింది హారంలా.
రాత్రిపూట మగాళ్ళంతా మంచినిద్రలో ఉన్నప్పుడు
తోటల్లా తియ్యగా పరుచుకుంటూ సాగే
ఈ చెట్టు మీది నల్లపిట్టపాటకి అంతుండదు.
రోజూ ఉదయాన్నే నా గది కిటికీలు తెరవగానే
ఆనందంతో నా కళ్ళు ముందు చూసేది ఆ చెట్టునే.
దాని పై కొమ్మమీద అప్పుడప్పుడు,
ముఖ్యంగా చలికాలంలో, బూడిదరంగు కొండముచ్చొకటి
ఒంటరిగా కూచుని సూర్యోదయాన్ని తిలకిస్తుంటుంది
కింది కొమ్మల్లో దాని పిల్లలు గెంతుతూ ఆడుకుంటుంటే.
ఆన్నిదిక్కులనుండి కోకిలలు సూర్యోదయాన్ని స్వాగతిస్తుంటాయి.
అలా నిద్రబోతూనే మా గోవులమంద మేతకి దారితీస్తుంటుంది.
ఆ పెద్ద చెరువులో, గట్టునున్న మహావృక్షపు ఛాయలో,
తెల్లతామరలు మంచుపువ్వుల్లా విచ్చుకుంటాయి.
ప్రియ సహచరులారా! నాకీ సరుగుడు చెట్టంటే
ఇంత ప్రాణప్రదమవడానికి దాని విభవం కారణం కాదు,
కాలంకరిగినా జ్ఞాపకాలు కరిగిపోలేదు
దానిక్రింద మనం ఎంతగా ఆడుకున్నామని!
ఒకర్నొకరు ఎంత గాఢంగా అభిమానించుకున్నామని!
అదిగో, అందుకూ… మీకోసం… అదంటే నాకిష్టం.
మీ ముఖాలతో కలగలిసి అదిగూడ నాస్మృతిలో మెదుల్తుంది
నులివెచ్చని కన్నీరుతో నా కళ్ళు మసకబారేదాకా.
అలలు చెలియలకట్టపై తల బాదుకుంటున్నట్లు
ఎవరిదా వినీ వినిపించని శోకనిస్వనం నా చెవి తాకుతున్నది?
ఓహ్! అది ఆ సరివీ విషణ్ణ వేదనే
విధి అనుకూలిస్తే అజ్ఞాత తీరాలకు చేరవేస్తుంది…
ఎక్కడో … దూరతీరాలలో… సముద్రశాఖలమధ్యా
జలసంధులమీదుగా, తేలియాడుతూ వచ్చిన ఈ రోదనని నే విన్నాను…
తర్కానికి లొంగకపోవచ్చు… కాని విశ్వాసనేత్రానికి గోచరమే!
వెన్నెల్లో, కలలులేని గాఢసుషుప్తిలో
నేల పరవశంతో నిద్దరోతున్నప్పుడు,
ప్రాచీన ఫ్రాన్సు ఇటలీ రేవుతీరాలలో,
జలపురుషుడు తన గుహలో కునుకు తీస్తున్నప్పుడు,
కెరటాలు ఒడ్డుని విలాసంగా ముద్దాడుతున్నపుడు విన్నాను.
ఆ సంగీతం నా చెవిని పడిన ప్రతిసారీ,
నా అంతర్నేత్రం ముందు ఒక ఉదాత్తమైన ఆకారం కదలాడుతుంది…
నా సరివి చెట్టా! అది నీదే. అచ్చం మా ఇంటివాతావరణంలో
నేను ఆనందంగాగడిపినక్షణాలలోనువ్వున్నతీరుగానే కనిపిస్తావు!
ఓ నా సరివిరాజమా! నాప్రాణంకన్నా మిన్నయై
భగవంతునిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న నాసహోదరులకు
ప్రీతిపాత్రమైన నీ గౌరవార్థం
నీకో గీతాన్ని అంకితంచేద్దామనుకుంటున్నాను.
నా రోజులుకూడ నిండుకున్నతర్వాత బర్రొడేల్ లోని
చిరంజీవులైన వృక్షాలతోబాటు నిన్నుకూడ లెక్కింతురుగాక!
వాటి విశాలమైన శాఖలచాయల్లో కదలాడడానికి
భయం, ఆశనిరాశలు, మృత్యువూ, సమాధులూ,
నిరంతరం వెన్నాడే కాలమూ వెనకంజ వేస్తాయి.
నా కవిత బలహీనమైనా,
అది నీ అందాన్ని పదేపదే సంతరించుకుని
నా ప్రేమ నిన్నెవరూ ఉపేక్షించకుండా రక్షించుగాక!
.
