సముద్రపొడ్డున … సారా టీజ్డేల్

.
సముద్రపొడ్డున కూచోడమన్నా,
ఈ మహానగరాలన్నా
సుతిమెత్తని పూవుల సౌకుమార్యరహస్యమన్నా,
సంగీతమన్నా,
కవితరాస్తూ గడపడమన్నా నాకు చాలా ఇష్టం.
ఆ క్షణాలు స్వర్గంలో తేలియాడినట్టుంటుంది.
.
మంచుమునిగిన కొండమీద పొడిచే తొలిచుక్కలన్నా
జ్ఞానమూ, దయా ఆమ్రేడితమైన పెద్దల పలుకులన్నా,
చిరకాలము నివురుగప్పినట్టుండి, చివరకి
కలుసుకున్నచూపుల్లో తొణికిసలాడే ప్రేమన్నా ఇష్టమే.
.
నేను అమితంగా ప్రేమించాను,
గాఢంగా ప్రేమించబడ్డాను కూడా.
కాని, ఇపుడు జీవితం పై ఆశ సన్నగిలింది.
దయచేసి నన్నీ నిశ్శబ్దానికీ, చీకటికీ విడిచిపెట్టండి
అలసిపోయిన నేను, సంతోషంగా నిష్క్రమించడానికి సిధ్ధం.
.
