నడిసముద్రంలో ఒక రాత్రి … హెర్మన్ హెస్

.
రాత్రి, కడలి అలలఊయల ఊపుతున్నప్పుడు,
మిణుకుమిణుకుమనే ఓ చుక్క మసకవెలుతురు
దాని విశాలకెరటాలపై పరుచుకున్నప్పుడు,
నా పనులన్నీ చక్కబెట్టుకుని
బంధాలు విదుల్చుకుని ఒక్కడినీ, సడిచేయకుండా
గుండెనిండాస్వచ్ఛమైన గాలిపీలుస్తూ
వేలదీపాలప్రతిబింబాలతో, చల్లగా మౌనంగా
సముద్రపుటుయ్యాలకి నన్నునేనప్పగించుకుని నిలుచుంటాను.
అపుడు నా స్నేహితులు తలపులోకొస్తారు
నా చూపులు వాళ్ళ చూపులలతో కలుసుకుంటాయి
ఒకరివెంట ఒకరిని అడుగుతాను, ఏకాంతంగా, నెమ్మదిగా:
“నీకు నేనంటే ఇంకా ఇష్టమేనా?
నా కష్టం నీకు కష్టంగానూ,
నా మృతి నీకు శోకించదగినదిగానూ కనిపిస్తాయా?
నా ప్రేమలో నీకు ఉపశమనము లభించి,
నా దుఃఖములో నీ దుఃఖపు ప్రతిధ్వని వినిపిస్తుందా?” అని.
.
అపుడు సాగరము ప్రశాంతంగా, నా కళ్ళలోకి చూస్తూ,
చప్పుడుచేయని మొలకనవ్వునవ్వి అంది: “లేదు”అని.
మరెకెక్కడనుండీ కాదని గాని ఔననిగాని,
సమాధానాలు వినిపించలేదు.
.
