నా భయాలు … జాన్ కీట్స్

ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు
తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను
అక్షరరూపంలో పుస్తకాలలోకి నా కలం అనువదించేదాకా
బతకనేమోనన్న భయం నన్నావహిస్తోంది.
నక్షత్రాచ్ఛాదిత నిశీధి ముఖం లోకి చూసినపుడు
దొరలాడిన మబ్బు దొంతరల శృంగారకేళీ విలాసము
తలుచుకుంటే, అదృష్టదేవత ఇంద్రజాలముచేసినా
జీవితంలో ఆ ఛాయ లనుకరించగలనని అనుకోను.
ఓ ఈక్షణిక సుందరీ!
నిన్ను మళ్ళీచూసేభాగ్యం నాకు లేదని
తలుచుకున్నప్పుడల్లా, ప్రతిఫలాపేక్షలేనిప్రేమ
సమ్మోహనశక్తిని ఆస్వాదించలేకున్నాను.
అందుకే, ఈ విశాల విశ్వసాగర తీరాన ఏకాకిగా నిలబడి
ప్రేమకీ కీర్తిప్రతిష్టలకీ కడసారి వీడ్కోలు చెబుతున్నాను.
.
