ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు … మార్టిన్ నీమలర్
.
ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు
నాకెందుకు అక్కరలేనివని మాట్లాడలేదు
నేను కమ్యూనిస్టుని కాదుగదా!
.
తర్వాతవాళ్ళు కార్మిక నాయకులకోసం వచ్చేరు.
నాకెందుకని ఊరుకున్నాను
నేనేమైనా కార్మికనాయకుణ్ణేమిటి?
.
ఆ తర్వాత వాళ్ళు యూదులకోసం వచ్చేరు
మనకెందుకని అడగలేదు
నేను యూదును కాదుగదా!
.
చివరికి వాళ్ళు నాకోసం వచ్చేరు
నన్ను వెనకేసుకుని రావడానికి
ఎవ్వరూ మిగల్లేదు.
.
మార్టిన్ నీమలర్
జర్మను ప్రొటెస్టెంటు పాస్టరు.
(14 జనవరి 1892 – 6 మార్చి 1984)
“వాళ్ళు ముందు కమ్యూనిస్టులకోసం వచ్చేరు” అన్నవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాటలు. ఇది నాజీలు చేసిన ఘాతుకాలకు మనసు కరిగి, జర్మను మేధావులు ఏమీ పట్టకుండా ఉండడం వల్ల జరిగిన మానవమారణహోమానికి బాధతో మార్టిన్ నీమలర్ పలికిన పలుకులు. ఇవి కేవలం ఆ కాలానికే వర్తిస్తాయనుకోవడం పొరపాటు. చరిత్ర ఇప్పటికి ఎన్నోనిదర్శనాలు ఇచ్చింది: ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత పాలకులు తమపదవిని నిలబెట్టుకుందికి ఎన్ని ఘాతుకాలు చెయ్యడానికైనా వెనుదియ్యరని. అది ప్రజాస్వామ్యమైనా, రాచరికమైనా, నియంతృత్వమైనా లేక ఇంకేరకమైన రాజ్యపాలన వ్యవస్థ అయినా. కనుక ప్రజలు వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళే అప్రమత్తులుగా ఉండాలి. ఈ కవితలో చెప్పినట్లు అధికారులు చేసే అకృత్యాలు మనకు సంబంధం లేదని ప్రతిఘటించకుండా ఊరుకుంటే, మనకి సంబంధించిన అన్యాయం జరిగినపుడు, మనకి తోడు ఎవ్వరూ మిగలరు… అవి వాళ్ళకు సంబంధించినది కాదుగా మరి!
.
[Note: The origins of this poem were traced to the January 6, 1946, speech delivered by Martin Niemöller to the representatives of the Confessing Church at Frankfurt. The text has several variants. For details visit: http://en.wikipedia.org/wiki/First_they_came%E2%80%A6]