సానెట్ LXVI: రాత్రి వరద భీభత్సం… ఛార్లెట్ స్మిత్

.
శిలలతో నిండిన సముద్రపుటొడ్డున
రాత్రి-వరద భీభత్సం సృష్టిస్తోంది:
అలుపులేక పోటెత్తిన తన కెరటాలక్రింద
సమాధికాబడ్డవాటికోసం
రంపపుపళ్ళలాంటి కొండకొనలమీదా,
చలువరాయి గుహల్లోనూ
బొంగురుగొంతుతో సముద్రం శోకిస్తోంది.
తవ్విపోస్తున్న తన కరకుకెరటాలతాకిడికి
ఎత్తైనమిట్టకొనకొమ్ము మీంచి
పచ్చికతోసహా ఒక శాలిబండ దొర్లుకుంటూ
అఖాతంలోకి దబ్బుమని నిలువుగాపడింది
నిశానిశ్శబ్దశ్రవణాలపై పిడుగుపడ్డట్టు.
దానిప్రతిధ్వనులకి ఒడ్డు ఒణికింది.
మనిషిజాడలేని ఈ తుఫాను రాత్రి
ఆకాసంలో తేలుతున్న మబ్బుతెరలమాటున
చంద్రుడు కళావిహీనంగా వెలుగుతున్నాడు;
యువతా, బడలిన శరీరాలూ హాయిగా కలతలేక నిద్రిస్తుంటే,
నేనొకడినే లక్ష్యంలేకుండా తిరుగాడుతున్నాను.
నిట్టూర్పులతో ఎగసిన నా హృదయాన్ని ఉపేక్షించడమేగాక,
ఏడవడానికే మేలుకున్నకళ్ళనుకూడా తప్పించుకు తిరుగుతోంది నిద్ర!.
.
