ఏకాంత స్తుతి … అలెగ్జాండర్ పోప్

.
వంశపారంపర్యంగా వచ్చే ఆ నాలుగుమూరల నేలకే
తన కోరికలూ, కష్టమూ పరిమితమై,
తను పుట్టిన నేలమీది గాలి పీలుస్తూ,
ఏవడు సంతృప్తిచెందుతాడో,
ఎవని పసులు పాలతో సమృధ్ధిగా,
ఎవని పొలాలు పంటలతో సుభిక్షంగా,
ఎవని “జీవాలు” ఉన్నితో పుష్కలంగా ఉంటాయో;
ఎవని వృక్షాలు వేసవిలో నీడనూ,
చలికాలంలో చితుకుల్నీ నిరాటంకంగా అందిస్తాయో,
వాడే సుఖజీవి.
ఎవనికి,
వాని ఎరుకలేకనే
గంటలూ, రోజులూ, వత్సరాలూ దొర్లిపోతుంటాయో;
ప్రశాంత చిత్తమూ,
ఆరోగ్యవంతమైన శరీరమూ,
చీకూ చింతాలేని ఉదయాలూ,
కలతనిదురలేని రాత్రులూ ఉంటాయో;
చదువూ, సుఖమూ మిళితమై
అందరినీ అలరించగల అమాయకత్వమూ,
సాలోచనాత్మకమైన వినోదమూ, ఉల్లాసమూ ఉండగలవో
వాడు ధన్యుడు!
ఎవరికీ తెలియకుండా,
ఎవరిదృష్టీ పడకుండా,
నన్నిలా బతకనీండి;
ఎవరి విషాదాశృలూ నాకై రాలకుండా,
నన్ను మరణించనీండి;
నేనెక్కడున్నానో తెలియబరిచే ఏ శిలాఫలకం లేకుండా
ఈ ప్రపంచం నుండి జారుకో నీండి.
.
—————————————————————————————–
(గమనిక: జీవాలు అన్నమాట ఉత్తరాంధ్ర జిల్లాలలో గొర్రెలకూ, మేకలకూ వాడతారు)
——————————————————————————————
.
