మబ్బులు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి

.
మబ్బుల్ని వర్ణించాలంటే
అబ్బో, నేను తొందరగా మాటాడవలసిందే,
లేకపోతే, అవి లిప్తపాటులో
వాటి ఆవతారాల్ని మార్చేస్తాయి.
ఒకసారి ధరించిన రంగు, రూపు, తీరు, క్రమం
మరోసారి అనుకరించమన్నా అనుకరించకపోడమే
వాటి ప్రత్యేకత
జ్ఞాపకాలు మోసుకెళ్ళవలసిన బాదరబందీ లేదేమో
అవి వాస్తవాలమీంచి అలవోకగా తేలి పోతుంటాయి
అయినా, అవి దేనికి సాక్షిగా నిలబడగలవు గనుక?
ఏదైనా జరిగిందంటే చాలు, ఇట్టే చెల్లాచెదరైపోతుంటాయి
మబ్బుల్తో పోల్చి చూస్తే
జీవితమే గట్టిపునాది మీద
స్థిరంగాఉంది; శాశ్వతంగా అనొచ్చేమో
మబ్బుల్ని మినహాయిస్తే,
చివరికి రాయైనా తోబుట్టువులా కనిపిస్తుంది
వాటిమీద ఆధారపడొచ్చు.
ఈ మబ్బులుమాత్రం, అబ్బే, పారిపోయే దాయాదులు.
మనుషులకి బతకాలనుంటే, బతకనీ,
తర్వాత, ఒకరి తర్వాత ఒకర్ని చావనీ.
మబ్బులకేం లెక్క
క్రింద వాళ్ళు ఏం చేసుకుంటారో
ఎలా పోతారో?
అందుకనే అవి సగర్వంగా
మన జీవితాల మీంచి తేలిపోతుంటాయి,
అయినా ఆ ప్రయాణం ఎప్పటికీ కడతేరదు.
నువ్వూ, నేనూ లేనంతమాత్రాన్న అవి కనిపించకుండా పోనక్కరలేదు
మనం ఉన్నాం కదా అని, అవి కనిపించనవసరమూ లేదు.
.
జిస్వావా షింబోర్స్కా ,
పోలిష్ కవయిత్రి
ఈ నెల 1 వ తేదీన నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసిన షింబోర్స్కా, పోలండుకు చెందిన కవయిత్రీ, అనువాదకురాలూ, వ్యాసకర్తా. ఈమెకు 1996 లో సాహిత్యం లో నోబెలు పురస్కారంలభించింది. ఆమె కవిత్వం లో ప్రధాన విషయం యుధ్ధం, ఉగ్రవాదం (తీవ్రవాదం). దానికి కారణం ఆమెను వెన్నాడిన రెండవ ప్రపంచ సంగ్రామపు భయంకర నీడలే. 16 ఏళ్ల వయసులో ఆమె చదువు చిత్రమైన పరిస్థితుల్లో రహస్య స్థలాల్లో, నిబధ్ధతగల విద్యా వాలంటీర్ల సహకరం వల్ల జరిగింది. వక్రోక్తి (Irony) ఆమె ప్రత్యేకత. ఆమె ఫ్రెంచి సాహిత్యాన్ని పోలిష్ లోకి అనువదించింది.
పైన ఉదహరించిన కవితలో, ఒక పక్క జీవితము గట్టిపునాదిమీద ఉంది అంటూనే, మనుషులు ఎన్ని తరాలు గతించినా, మబ్బులుమాత్రం కొనసాగుతూనే ఉంటాయి అన్న సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. (మనుషులు ఆకారాలు మారుతుంటారు …. మబ్బులు ఆకారాలు మారుతుంటాయి; ఒకసారి వచ్చిన రంగు రూపు, ఆకారం తిరిగిపొందలేకపోవడం మొదలైనవి మనుషులకీ మబ్బులకీ సమానమే; చివరకి మనుషుల ప్రయాణమూ కడతేరదు… మబ్బుల ప్రయాణమూ కడతేరదు)

కొద్దిగా వివరించ ప్రార్ధన
మెచ్చుకోండిమెచ్చుకోండి
బాగుందండి, మనిషి మబ్బుల భాష్యాలు చక్కగా ఉన్నాయి. దాదాపు ఒక ఏడాది క్రితం తెలిసింది నాకు ఈ కవయిత్రిని గూర్చి మెహెర్ గారి వలన http://loveforletters.blogspot.com/2009/04/wislawa-szymborska.html – ఈ లింక్ నిన్నో మొన్ననో మరొకచోట ఉటంకించాను కానీ మీరు చూసి ఉండరన్న ఉద్దేశంతో ఇస్తున్నాను. అపుడు కొన్ని చదివాను. ఈ వారంగా అడపా దడపా మళ్ళీ చూస్తున్నాను, అఫ్సర్ గారి అక్షరం బ్లాగులో చూస్తుండండి, ఆయన త్వరలో పూర్తి అనువాదాలు తెస్తారు – http://afsartelugu.blogspot.com/2012/02/blog-post.html
అలాగే మరొక విన్నపం. స్థానిక అమెరికన్ మిత్రులొకరు నాకు కవితలిష్టమని మరొక కవయిత్రి ని పరిచయం చేశారు, http://www.forughfarrokhzad.org/selectedworks/selectedworks1.asp#Another%20Birth అనువదించగలరేమో చూడండి. కవితలు రాసే అలవాటున్నా, అనువాదాల్లోకి ఒదిగేంత పరిజ్ఞానం లేదండీ నాకు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఉషారాణి గారూ,
మంచి లింకులు, మెహెర్ గారిదీ, Forugh Farrokhzadదీ అందించినందుకు కృతజ్ఞతలు. ఈ మధ్యనే పెర్షియన్ పోయెట్రీ ఇన్ ఇంగ్లిష్ అని Facebookలో చూసేను. అందులో చాలా మంచికవితలు కొన్ని కనిపించేయి.
నాకు మొన్న 1 వతేదీన అఫ్సరు తన బ్లాగులో రాసిన అనువాదాలుద్వారానే మొదటిసారి షింబోర్స్కా గురించి తెలిసింది. తర్వాత ఆమె కవితలు నెట్ లో వెతికేను. మీరిచ్చిన Forugh Farrokhzad బ్లాగు లింకులోని పెర్షియన్ కవిత చదివేను. ప్రయత్నిస్తాను.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
శర్మగారూ,
శుభోదయం.
మబ్బులకి ఒక ఆకారం ఉండదు. అవిక్షణభంగురాలు. సృష్టిలో జరిగే వేటికీ సాక్ష్యాలుగా నిలబడలేవు. (ఫలానా అప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, క్రీస్తుపూర్వం ఫలానా సంవత్సరం లో సూర్యగ్రహణం వచ్చింది ఇలా కొన్ని సంఘటనలను మనం ఆ సంఘటన జరిగిపోయిన తర్వాత మనం చూడలేకపోయినా చెప్పగలం లెక్కలుగట్టి). ఎక్కడ ఏది జరిగినా ముందు చెల్లాచెదరైపోతాయి. (ఒక తుఫాను రావడమో, ఒక అగ్నిపర్వతం పేలడమో ఇలా).
మనకి మానవ జీవితమే స్థిరంగా కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. శిలలలా శాశ్వతమనే భ్రమ కలిగిస్తుంది.
కానీ చిత్రమేమిటంటే, కాలమనే పెద్ద కాన్వాసు తీసుకుని చూస్తే, మనుషులముఖాలు, ఆకారాలు, రంగులూ, రూపులూ అన్నీ ఒక్కలా ఉండవు. మబ్బులంత వైవిధ్యం ఉంటుంది అందులో. వాళ్ళూ దేనికీ సాక్ష్యాలుగా నిలబడలేరు. మహా అయితే మనం అవశేషాలబట్టి ఒక Intelligent guess చెయ్యగలమేమో!. అంతే!. మబ్బులు పుడతాయి, వ్యాపిస్తాయి, వర్షిస్తాయి, నశిస్తాయి. మనుషులూ అంతే. రెండూ ఒక్కలాంటి జీవిత భ్రమణం కలిగి ఉన్నవే. అవి గాలిలో ఉంటాయి. మనం భూమిమీద ఉంటాము. (స్థిరమైన పునాది).
కాని చివరన మిగిలే సత్యం,మనిషి భూమిమీద అంతరించిపోయినా, మబ్బులుమాత్రం వాటి యాత్ర కొనసాగిస్తూనే ఉంటాయి.
ఇది నాకు కలిగిన భావన మాత్రమే.
అభివాదములతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి
Interesting poem.. Thanks for sharing!
మీ అనువాదం కూడా బాగుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you for the compliment.
with best regards
మెచ్చుకోండిమెచ్చుకోండి