మబ్బులు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి

.
మబ్బుల్ని వర్ణించాలంటే
అబ్బో, నేను తొందరగా మాటాడవలసిందే,
లేకపోతే, అవి లిప్తపాటులో
వాటి ఆవతారాల్ని మార్చేస్తాయి.
ఒకసారి ధరించిన రంగు, రూపు, తీరు, క్రమం
మరోసారి అనుకరించమన్నా అనుకరించకపోడమే
వాటి ప్రత్యేకత
జ్ఞాపకాలు మోసుకెళ్ళవలసిన బాదరబందీ లేదేమో
అవి వాస్తవాలమీంచి అలవోకగా తేలి పోతుంటాయి
అయినా, అవి దేనికి సాక్షిగా నిలబడగలవు గనుక?
ఏదైనా జరిగిందంటే చాలు, ఇట్టే చెల్లాచెదరైపోతుంటాయి
మబ్బుల్తో పోల్చి చూస్తే
జీవితమే గట్టిపునాది మీద
స్థిరంగాఉంది; శాశ్వతంగా అనొచ్చేమో
మబ్బుల్ని మినహాయిస్తే,
చివరికి రాయైనా తోబుట్టువులా కనిపిస్తుంది
వాటిమీద ఆధారపడొచ్చు.
ఈ మబ్బులుమాత్రం, అబ్బే, పారిపోయే దాయాదులు.
మనుషులకి బతకాలనుంటే, బతకనీ,
తర్వాత, ఒకరి తర్వాత ఒకర్ని చావనీ.
మబ్బులకేం లెక్క
క్రింద వాళ్ళు ఏం చేసుకుంటారో
ఎలా పోతారో?
అందుకనే అవి సగర్వంగా
మన జీవితాల మీంచి తేలిపోతుంటాయి,
అయినా ఆ ప్రయాణం ఎప్పటికీ కడతేరదు.
నువ్వూ, నేనూ లేనంతమాత్రాన్న అవి కనిపించకుండా పోనక్కరలేదు
మనం ఉన్నాం కదా అని, అవి కనిపించనవసరమూ లేదు.
.
జిస్వావా షింబోర్స్కా ,
పోలిష్ కవయిత్రి
ఈ నెల 1 వ తేదీన నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసిన షింబోర్స్కా, పోలండుకు చెందిన కవయిత్రీ, అనువాదకురాలూ, వ్యాసకర్తా. ఈమెకు 1996 లో సాహిత్యం లో నోబెలు పురస్కారంలభించింది. ఆమె కవిత్వం లో ప్రధాన విషయం యుధ్ధం, ఉగ్రవాదం (తీవ్రవాదం). దానికి కారణం ఆమెను వెన్నాడిన రెండవ ప్రపంచ సంగ్రామపు భయంకర నీడలే. 16 ఏళ్ల వయసులో ఆమె చదువు చిత్రమైన పరిస్థితుల్లో రహస్య స్థలాల్లో, నిబధ్ధతగల విద్యా వాలంటీర్ల సహకరం వల్ల జరిగింది. వక్రోక్తి (Irony) ఆమె ప్రత్యేకత. ఆమె ఫ్రెంచి సాహిత్యాన్ని పోలిష్ లోకి అనువదించింది.
పైన ఉదహరించిన కవితలో, ఒక పక్క జీవితము గట్టిపునాదిమీద ఉంది అంటూనే, మనుషులు ఎన్ని తరాలు గతించినా, మబ్బులుమాత్రం కొనసాగుతూనే ఉంటాయి అన్న సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. (మనుషులు ఆకారాలు మారుతుంటారు …. మబ్బులు ఆకారాలు మారుతుంటాయి; ఒకసారి వచ్చిన రంగు రూపు, ఆకారం తిరిగిపొందలేకపోవడం మొదలైనవి మనుషులకీ మబ్బులకీ సమానమే; చివరకి మనుషుల ప్రయాణమూ కడతేరదు… మబ్బుల ప్రయాణమూ కడతేరదు)
