రాకుమారి ఘనకార్యం … ఆస్కార్ వైల్డ్

.
నిశ్చలాంబువులలో సప్త తారకలు
నిర్మలాకాశంలో సప్త ఋషులు
రాకుమారికి సప్తవ్యసనాఘాతాలు
గుండెలోతులలో గుర్తుగా మిగులు
ఆమె పాదాల చెంత ఎర్రగులాబులు
(ఆమె ప్రాభాతవర్ణపు కురులలోనూ ఎర్రగులాబులే)
అరే, ఆమె హృదయమూ, లేనడుముల సంగమంలోనూ
ఎర్రగులాబులు దాగున్నాయి!.
ఆ రెల్లు పొదల్లో, పరివేల్లములపై
చచ్చిపరున్న యోధుడు అందంగా ఉన్నాడు.
మృష్టాన్నం దొరికిన ఆనందంలో
చిరుచేపలు తెగ సంబరపడుతున్నాయి
ఆ కుర్రాడు దీర్ఘనిద్రలోనూ ముచ్చటగా ఉన్నాడు
(స్వర్ణాంబరాలెప్పుడూ మృత్యువుకి ఎరలేగదా!)
అదిగో ఆకసంలోకి చూడు, కాకోలాలు
నల్లగా, చీకటంత నల్లగా ఎగురుతున్నై.
అక్కడ ఊరకే చచ్చిపడున్న చేతులేం చేస్తాయి?
(ఆమె చేతులపై రక్తపు మరకలున్నాయి)
ఆ లిల్లీలపై ఎందుకుచెప్మా ఎర్రమచ్చలున్నై?
(నదీసైకతాలపై రక్తపు జాడలున్నై.)
దక్షిణం నుండి తూర్పుకి రెండూ
ఉత్తరం నుండి పడమటికి రెండూ ఎగురుతునై
బొంతకాకులకి అది పసందైన విందు
రాకుమారికి నిర్భరమైన కనువిందు
ఆమెని నిజంగా ప్రేమించినవాడొకడున్నాడు
(అయ్యో, గడ్డకట్టిన నెత్తురింకా ఎర్రగానే ఉంది)
తనగొయ్యి తానే తవ్వుకున్నాడు, కర్రి “యూ” చెట్టుక్రింద
(ఒక గొయ్యి నలుగురికి సరిపడేంత)
స్థాణువైపోయిన ఆకాసంలో చంద్రుడులేడు
బిక్కచచ్చిన నీటిలోనూ లేడు
ఆమె చేసిన పాపాలు ఏడు
అతను చేసిన పాపం మాత్రం… ఒక్కడు!
.
