ఇంద్రా! … ఆగస్ట్ స్త్రింద్బెర్గ్ , స్వీడిష్ నాటకకర్త.

.
ఇసకనేలల్లో చతికిలబడిపోయాం.
కోతలుపూర్తయిన చేలోని పరకల్తో
మా కాళ్ళు దుమ్ముకొట్టుకుపోయాయి
రాజమార్గాలనుండి వచ్చే దుమ్మునీ
నగరాల్లోని కాలుష్యాన్నీ
కంపుగొట్టే ఉచ్ఛ్వాస నిశ్వాసాలనీ
వంటిళ్ళలోంచీ, నేలమాళిగల్లోంచీ
వచ్చే పొగల్నీ, దుర్వాసనల్నీ
అన్నిటినీ భరించాం.
ఇకలాభం లేదని
కాస్త ఊపిరి పీల్చుకుందికి
సముద్రపొడ్డుకి పరిగెత్తాం
మా రెక్కలార్చుకుందికీ
పాదప్రక్షాళన చేసుకుందికీ
.
ఓ స్వర్గాధిపతీ! ఇంద్రా!
మా మొర ఆలకించు!
మా నిట్టూర్పుల సవ్వడి విను!
ఈ ధరిత్రి ఒక మురికికూపం.
జీవితం పాపపంకిలం.
మనిషులు చెడో మంచో చెప్పలేం
వాళ్ళు, కుదిరినంతవరకు, రోజుల్లెక్కన
జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు
మట్టిమనుషులు, మట్టిలోనే దొర్లుతున్నారు
ధూళిలోపుట్టిన వాళ్ళు ధూళిలోనే కలిసిపోతున్నారు.
వాళ్ళకి జీవితాన్ని ఈడవడానికి
కాళ్ళే ఇచ్చావు గాని, రెక్కలివ్వలేదు
కనుకే దుమ్ముకొట్టుకుపోతున్నారు.
అయితే ఇందులో తప్పెవరిది?
నీదా? వాళ్ళదా?
.
