చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు

మునిపల్లె రాజు

.

చర్చిగంటలు మ్రోగడం లేదు.
బజార్లు రద్దీగానే ఉన్నాయి
ఆఫీసులు మూతపడలేదు
సంతాప దినాలు ప్రకటింపబడలేదు
వాహన సంచారం యధాప్రకారం అస్తవ్యస్తంగానే ఉంది
సినిమాహాళ్ళు ఎప్పటిలాగే కిక్కిరిసి ఉన్నాయి

*

శవయాత్ర సాగుతోంది… అయితే
ముందు బేండు మేళాలు మోగటమూ లేదు
వెనుక గుర్రపు సవారీలు అనుసరించడమూ లేదు.
పాడె మీద కవి ఏం పట్టనట్టు పరున్నాడు
శవవాహకులు నలుగురూ పిడికిళ్లు బిగించి నడుస్తున్నారు.

*

జండాలు అవనతం కాలేదు.

కొందరు ఇరుగు పొరుగు వాళ్ళూ,
తోటి కవులు మరికొందరూకనిపిస్తున్నారు.

అతని ప్రచురణ కర్తలు కనపడటం లేదు
ఫొటోగ్రాఫరు జాడలేదు
కాకపోతే ఒకరిద్దరు విమర్శకులూ
బాధ్యత మరువని ఓ విలేఖరీ వెంటనడుస్తున్నారు.

శ్మశానంలో పాడె క్రిందకి దింపారు
మృతునిగురించి ప్రసంగం చెయ్యవలసి ఉంది
వక్తకి కళ్ళు చెమరుస్తున్నాయి
అతని మాటలు శాంతగంభీరంగా ఉన్నాయి.

కాని, కాల్చడానికి కట్టెలూ,
వెలిగించడానికి ఇంధనం ఏవీ?
కవి ఆత్మకి శాంతి కూర్చేదెలా?

కొన్ని నిముషాలు దొర్లిపోయాయి
చందాలు వసూలు చెయ్యడానికి టోపీ కలదిరిగింది
కానీ, అందులో చేరుకున్న నాణేలు కొన్నే.

*

ఆరె! ఎవరది ఓ డొక్కు రిక్షాలోంచి
శ్మశానద్వారం దగ్గర దిగుతున్నది?

అతని వితంతువు అతని వ్రాతప్రతులన్నీ
కట్టగట్టి తీసుకు వచ్చింది.

ఇక మనం చితిముట్టిద్దాం రండి
మరి ఎంతమాత్రం ఆలస్యం చెయ్యలేం!

*

మునిపల్లె రాజు

మునిపల్లెరాజు గారు కేంద్రసాహిత్యఅకాడమీ బహుమతిగొన్న కథకులుగా సుప్రసిధ్ధులైనా అతని ప్రథమ వ్యాసంగం మాత్రం కవిత్వమే. ఆయనే చెప్పుకున్నట్టు విద్యార్థిదశలో ఆయన జాషువా, మాధవపెద్ది బుచ్చిసుందర రామశాస్త్రి పద్యాలకూ, విశ్వనాథవారి కిన్నెరసాని గేయాలకూ సమ్మోహితుడైనారు.

ఈ కవిత ఆయన 1998 లో ప్రచురించిన “వేరొక ఆకాశం- వేరెన్నో నక్షత్రాలు”  కవితా సంపుటిలోనిది. ప్రస్తుతం వారు సికిందరాబాదు సైనిక్ పురిలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.

.

Poet On The Funeral Pyre

.

No bells are tolling.

The  bazars are throbbing

Offices not closed

No mourning declared

Traffic as usual chaotic

Cinemas are crowded systematic

*

A funeral procession passes by

Sans brass bands leading

Sans any cavalcade following

On the bier a poet unconcerned rests

Pall bearers four grim like fists.

*

I see flags on fullmast

His humble neighbours few

And fellow poets some

You spot no lensme

His publishers are unseen

But a gentle critic or two

And a duty bound reporter too.

The bier is grounded

A funeral oration to sound

But the speakers eyes are moist

His words are deeply silent

Where is the fuel where is the firewood

To lit the pyre to put him to rest.

A few moments roll

A hat is passed on to fill

But the coins offered are few.

*

Lo, a rickety rickshaw at the entrance sighted

A widow alights with all his manuscripts piled and bundled

Now let us lit the pyre

We can’t wait any more!

*

Munipalle Raju

“చితిమీద ఒక కవి … మునిపల్లె రాజు” కి 6 స్పందనలు

  1. మన దేశంలో కవి స్థానం గురించి ఈ వేదన మనసు కదిలించేలా ఉంది.

    మెచ్చుకోండి

    1. అవును జ్యోతిర్మయీ,
      ఈ దేశంలో పరమ నికృష్ట రాజకీయనాయకులకున్న విలువ కూడా కవులకీ కళాకారులకీ లేదు. గుర్తింపు ప్రతిభనిబట్టిగాక అధికార గణానికి చూపించగల విశ్వాసం మీద ఉంటుంది చాలా సందర్భాలలో.
      ఆశీస్సులతో,

      మెచ్చుకోండి

  2. మనదేకాదు, ప్రపంచం మొత్తంమీద కవులకు యిదే దుస్థితి వుందేమో!

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      ఈ విషయం లో నేను మీతో ఏకీభవించ లేను. చాలా దేశాల్లో, మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో, కవులకీ కళాకారులకీ వ్యక్తిగతంగానూ, వారి రచనలపట్లా కూడా అమితమైన శ్రధ్ధాభక్తులున్నాయి. వారి రచనలు ఇష్టం వచ్చినట్లు మార్చేసో, లేదా స్వంతకల్పన జోడించో చెప్పరు. (పేరడీలు వేరే సంగతి. అవి ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి.). ఛాసరునాటి కవుల సమాధుల దగ్గరనుండి, వాళ్ళు చిన్నప్పుడు నివసించిన ఇళ్ళుకూడా జాతివారసత్వాలుగా పరిగణించి పదిలపరచుకోవడం చూస్తున్నాం. మనదేశంలో అటువంటి సంస్కారం లేదు. ఎక్కడలేని విగ్రహాలూ దేశాన్నిదోచుకున్న”అకళంక దేశభక్తులకే” చాలటం లేదు. కవులకీ కళాకారులకీ ఎక్కడవస్తాయి. పొరపాటున ఎవరైనా పెడితే వాటిని మనం నిలుపుకోలేము కూడా. ఆంధ్రదేశానికివస్తే, పరిస్థితి ఇంకా దారుణం. గురజాడగురించి అంత గర్వంగా చెప్పుకుంటాం. అతని నాటకాన్ని రంగస్థలిమీద చూపించేటప్పుడు ప్రతి తలమాసిన డైరెక్టరూ వాడి పైత్యాన్నిబట్టి మార్చిపారేస్తుంటాడు. వెలుగు రామినాయుడు లాంటివాళ్ళు పూనుకోకుంటే ఆపాటి గురజాడవారి ఇల్లూ కూడా ఏ అక్రమసంపాదనాపరుడో కొనేసి అపార్ట్ మెంట్లుచేసి అమ్మేసి ఉండే వాడు. ఇప్పుడు శ్రీశ్రీ పుట్టిన ఇల్లు విశాఖపట్నం మహరాణీపేటలో ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా? మనకి మన చరిత్రపట్ల ఉన్న నీరసభావం మన చేతల్లో కనిపిస్తుంది. పోతన లాంటి ఏ మహానుభావుడికో చెల్లుతుంది తప్ప, కవులు ఇప్పుడు కవిత్వాన్ని నమ్ముకునీ బ్రతకలేరు, అమ్ముకునీ బ్రతకలేరు. ముందుగా కవిత్వసంకలనాలు ప్రచురణకర్తలు అచ్చెయ్యరు… కవులు వాళ్ళంతటవాళ్ళు వేస్తే కొని చదివే నాధుడుండడు. కనుక, కవులలోన తెలుగు కవులన్న వేరయా అనుకోవలసిందే.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  3. మీ నుంచి యింత జవాబు ఆశించాను. సాధించాను. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి ఇంటిని పదిలపరచలేకపోయారు. అలాగే మరో అస్థాన విద్వాంసుడే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారిల్లు కూడా నిలపలేకపోయిన ప్రభుత్వాలు మనకున్నాయి. దౌర్భాగ్యం.మొన్న నొక పత్రిక లో చూశాను పంప మహా కవి సమాధి వున్న శిలా శాసనం గాలిలో దొర్లుతోంది.నేడో రేపో అది చాకలి బండగా మారినా అశ్చర్యపోనక్కరలేదు. అటు కర్నాట,ఆంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు.విశేషం యేమంటే పంపడు తెలుగు వాడు. కన్నడలో మొదటి భారత రచన చేశాడు. నాకు బాగా అవేశం వచ్చేసిందనుకుంటా.నిరాశతోనే ఆ మాటాన్నా. క్షమించండి.

    మెచ్చుకోండి

  4. శర్మ గారూ,
    ఇవాళ అకస్మాత్తుగా మనకి కొన్నివేల ఏళ్ళనాటి నిధిగాని పొరపాటున బయటపడిందా, ముందు అందులోని బంగారం వెండీ వగైరా ఏవైనా ఉంటే వాటిని కరిగించేసి సొమ్ముచేసుకుందికి చూస్తారు తప్ప, అయ్యో ఎటువంటి అపూర్వమైన సమాచారం దాగుందో, దానివలన ఎన్ని చిక్కుముడులు విడుతాయో అని ఆలోచించగల మనస్తత్త్వం, సంస్కారం మన చదువులు ఇవ్వలేకపోతున్నాయి. ఫేషన్లు ప్రజలనుండి పాలకులకీ, నీతి నియమాలు పాలకులనుండి ప్రజలకీ చేరుతాయని లోక వ్యవహారం.
    అభివాదములు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: