మానసిక క్షోభతో … రాబర్ట్ బర్న్స్

.
ఓ పరమాత్మా!
నీవెవ్వరో నా కగమ్యగోచరం.
కానీ, నీకీ సృష్టిలో జరిగేవన్నీ
నీకు తెలుసుననే నమ్ముతున్నాను.
.
ఈ జీవుడు దీనుడూ, దుఃఖితుడై
నీ మ్రోల నిలబడ్డాడు
ఈ హృదయాన్ని దొలిచే ఆవేదనలు
నీ ఆనతి వినా జరగవని నమ్ముతున్నాడు
.
అయితే, శర్వశక్తిమయా! నువ్వు
కోపంవలననో, నిర్దయతోనో ఇలా చేశావనుకోను.
ప్రభూ! అలసిన నా కనుల కన్నీరైనా తుడు
లేదా, శాశ్వతంగా మూసుకునేలా వరమివ్వు!
.
లేదూ, నీ చర్యల వెనుక ఏదో
నిగూఢ రహస్యం దాగున్నదంటే
నిగ్రహించడానికీ, నిర్విచారంగా మనడానికీ
ఈ హృదయానికి తగిన సంకల్పబలాన్నివ్వు!
.
Image Courtesy: http://upload.wikimedia.org
రాబర్ట్ బర్న్స్
(25 January 1759 – 21 July 1796)
రబ్బీ బర్న్స్ అనీ, స్కాట్లండ్ అభిమాన పుత్రుడనీ, రైతుకవి అనీ, స్కాట్లండు జాతీయకవిగా కీర్తించబడే, రాబర్ట్ బర్న్స్ మంచి కవీ, గేయ రచయితా. రొమాంటిక్ మూమెంట్ ఆద్యులలో ఒకడుగా కీర్తింపబడే బర్న్స్, స్వేఛ్ఛా వాదులకీ, సమసమాజము కాంక్షించే వాళ్ళకీ గొప్ప ప్రేరణ. స్కాట్లండు లోనూ, స్కాటిష్ జాతీయులందరిచే ప్రపంచ వ్యాప్తంగానూ, వారి సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపబడి, స్కాటిష్ సాహిత్యం మీద అపారమైన ప్రభావం చూపించగలిగిన ప్రతిభాశాలి. స్వయంగా జానపద గీతాలు వ్రాయడమే గాక, స్కాట్లండు అంతా తిరిగి కొన్ని అపురూపమైన ప్రాచీన జానపద గీతాలు సేకరించి, సంకలించేడు. A man is a man for all that; Tam o’ Shanter, To A Mouse అన్నవి అతనికి చాలా కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పెట్టిన కవితలలో కొన్ని.
.
Under The Pressure Of Violent Anguish
.