భగ్న ప్రేమ … ఎలిజబెత్ సిడాల్

.
ఓహ్! భగ్నప్రేమ గురించి చింతించడమెందుకు?
ప్రేమ ఎన్నడు నిజం అయింది గనక?!
అది అనువును బట్టి నీలం నుండి ఎరుపుకీ,
రక్తవర్ణం నుండి నీలానికీ రంగులు మారుస్తుంటుంది.
అసలు ప్రేమ పుట్టుకే బాలారిష్టాలతో…
కనక అదెన్నడూ నిజం అవమన్నా అవలేదు.
.
సొగసైన నీ ముఖం మీద ఆ చిరునవ్వెందుకు?
వద్దు. మళ్ళీ నిట్టూర్చవలసి వస్తుంది సుమా!
చిట్టితల్లీ! ఎంత నిజాయితీగల మాటలు,
నిష్కల్మషమైన పెదాలు పలికినా
అవి గాలిలో కలిసి హరించిపోవలసిందే…
శీతగాలులు కోతపెట్టే వేళ
నువ్వు ఒంటరిగా మిగిలిపోవలసిందేనే తల్లీ!
.
ఓసి బంగారు కొండా! జరగనిదానికి వగపెందుకు?
భగవంతుడు దాన్ని అనుగ్రహించలేదు. అంతే!
పిచ్చిదానా! ప్రేమలో లవలేశమైనా నిజముండి ఉంటే
మనం ఈపాటికి స్వర్గంలో ఉండి ఉండే వాళ్ళం.
ఇది ఇహమని గుర్తుంచుకోవే తల్లీ!
ఇక్కడ స్వఛ్ఛమైన ప్రేమ దొరకమన్నా దొరకదు!
.
