జీవన సంధ్య … డొరతీ పార్కర్

.
వయసు పైబడి, సౌకర్యాలమరి
కోరికలకి భరతవాక్యం పాడి, కేవలం
జ్ఞాపకాలే శయ్యావిభాగినులై
ప్రశాంతతతో నే చలికాగుతున్నప్పుడు
చలువచేసిన నా టోపీ క్రింద
శిరోజాలనందమైన పాయలుగ అలంకరించుకుని
బలహీనమూ, శీతలమూ ఐన నా చేతులు
నా ఒడిలో వేసుకుని నెమ్మదిగా కూర్చుంటాను.
పూలూ, లతలూ అల్లి, లేసులువేసిన
నా గౌను మెడదాకా తొడిగి
లోకానికి తెరదించి,
ఒక ఉల్లాసమైన కూనిరాగాన్నందుకుంటాను.
కారే కన్నీరు తీరు మరచి,
తూగుతూ, ఊగుతూ, నా టీ కలుపుకుంటాను.
అబ్బ! ఆ ఆనందకరమైన రోజులు
ఇంకొంత కాలం కొనసాగితే ఎంత బాగుణ్ణు!
.
