వెఱపు ఛాయలు … HW లాంగ్ ఫెలో

.
నాలో నే ననుకున్నా, “రేపు నాకేదైనా జరిగితే
నా పిల్లల గతి ఏమిటి? సాయం, ప్రోత్సాహం కోసం ఇపుడు
నా దిక్కు చూస్తున్న వీళ్ళ భవిష్యత్తు ఏం గాను?
ఒక మహాగ్రంథం లాంటి వీళ్ల జీవితాలలో
కేవలం తొలి అధ్యాయాలు మాత్రమే చదివేను,
ఇంకెంత సౌందర్యమూ, విషాదమూ భవిష్యత్తులో
మిగిలిఉన్నాయో చూడలేను కద!”
మళ్ళీ నన్ను నేనే సముదాయించుకున్నా:
“ఈ ప్రపంచము ఈనాటిదా!
ఎన్ని తరాలు గతించేయి;
సూర్యుణ్ణనుగమించే నీడల్లా
ఇంకెన్ని తరాలు గతించనున్నాయి;
బహుశా ఈ కథ ఇప్పటికి కొన్నివేల సార్లు చెప్పబడి ఉంటుందేమో!
ఈ ప్రపంచమెప్పుడూ కొత్తగా వచ్చేవాళ్ళకోసమే.
మనలాగే, ఆశల్నీ, విశ్వాసాల్నీ వాళ్ళంత వాళ్ళే వెతుక్కుంటారు.”
.

మనలాగే,ఆసల్ని, విశ్వాసాల్నీ వాళ్ళంత వాళ్ళే వెతుక్కుంటారు…………యిది మరచిపోయి……సంపాదన కూడబెట్టి…….యేమో అవస్తలు పడిపోతున్నారు పిచ్చి జనం.
మెచ్చుకోండిమెచ్చుకోండి
శర్మ గారూ,
చిత్రం అదే. ప్రతి తల్లీ తండ్రీ పడే భయాన్నే, ఆవేదననే కవి ఇక్కడ చక్కగా వ్యక్తీకరించేడు. తమ వైఫల్యాలు వాళ్ళని ఎప్పుడూ వెంటాడుతుంటాయి. గమ్మత్తేమిటంటే అటు విధిపట్ల పూర్తి విశ్వాసం ఉండదు, ఇటు ప్రకృతి ప్రభావం మీదా పూర్తి నమ్మకం ఉండదు. మనం శాసించలేనివన్నీ శాసించగలమన్న భ్రమలో ఉంటారు. జ్ఞానం ఎప్పుడూ వృధ్ధాప్యంలోనే వస్తుంటుంది. ఎవడో కవి తన 60వ ఏట అంటాడిలా: “ఇప్పుడు నాకున్న జ్ఞానం 20 ఏళ్ళప్పుడు ఉండి ఉంటే, ఇప్పుడు నేను ఎలా మిగిలానో, అలా మిగిలి ఉండేవాడిని కాను గదా (If I had known at 20 what I know now, I would not have been what I am)” అని. అది ప్రకృతి శాపం. మనం నిమిత్త మాత్రులం.
అభివాదములతో.
మెచ్చుకోండిమెచ్చుకోండి