కాఫీ తాగుతూ, మొహాలనిండా దట్టంగా కమ్ముకున్న సిగరెట్టు పొగని సైతం లెక్కచెయ్యకుండా బాతాఖానీలో మునిగిపోయి, కబుర్ల సందడిలో వున్న జనాలమధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళేను. వెనకవైపు కోర్టుయార్డ్ లో పరిస్థితి హాలుకి భిన్నంగా ఉంది. పొగాలేదు…రణగొణధ్వనుల గొడవా లేదు. అటూ ఇటూ ఒకసారి పరికించిచూసేను. హమ్మయ్య! నా అలవాటైన కార్నర్ సీటు ఖాళీగానే ఉంది… బహుశా ఆ టేబిలునిండా ఎవరో తిని వదిలేసిన ప్లేట్లూ, కప్పులూ, సాసర్లూ ఉండడంచేతనో ఏమో! దూరంగా టేబిళ్ళు క్లీన్ చేస్తున్న ఆ వెయిటర్ అంత తొందరగా ఇటువైపు రాకపోవచ్చుకూడా. అయినా సరే! ఫర్వాలేదు.
నేను ఈ కాఫీహౌస్ కి ఎందుకొస్తానో తెలుసా? ఎంతకాలం వీలయితే అంతకాలం ఇంటికి దూరంగా ఉండడానికి. ఇరుగూ పొరుగూ మన సంగతులన్నీ ఎలా పసిగడతారో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. మొన్నటికి మొన్న ఏమైందనుకున్నారు? విడాకులకేసులోంచి నేనింకా బయటపడనేలేదు… ఎలా పసిగట్టేసేడోగాని మా పక్కింటాయనవచ్చి, “మీరింక ఎలాగూ ఒక్కరే ఉంటారు గదా, కొంచెం కూరా పులుసూ ఏమైనా తెచ్చిపెట్టమంటారా?” అని అడిగేడు. చాచి లెంపకాయ కొడదామనిపించింది. “పులుసూ కూరాకాదు… నాకింత శ్రాధ్ధం పెట్టు! నా నెత్తురు తాగి నా మాంసంతో విందుచేసుకొండర్రా! నా మానాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళండర్రా. మీ సానుభూతి వల్లకాట్లో కాల్చా!” అని అందామనుకున్నాను. కాని మొహమాటం మొహంమీద పులుముకుని, “ థేంక్సండీ ! ఏం వద్దు” అని మాత్రం అనగలిగేను.
విన్నారా! ఆదీ సంగతి. ఒక్కడ్నీ నాతో నేను ఏకాంతంగా గడుపుదామని వచ్చేనిక్కడికి. కాని ఎక్కడికక్కడే జనసందోహం నన్ను వదిలిపెట్టడంలేదు. బర్డ్ వాచర్ లాగ దూరంనుండి మనుషులనుచూస్తూ వాళ్ళ చేతుల కదలికలని గమనిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మాటలకంటే, మనుషుల మనోభావాలని చేతులే బాగా వ్యక్తం చేస్తాయని నా నమ్మకం. ఎంతో చైతన్యం నింపుకుని ఎప్పుడూ గలగలలాడుతూండే చేతులకి జీవరాసులన్నిటిలోనూ ప్రత్యేకమైన ఉనికి లేదూ? అలాగని, “ఏదీ, నీ చెయ్యి ఇలాగ ఇవ్వు, నీ గురించి అంతా చెప్పేయగలను!”అని రోడ్డుమీద గుడ్డపరుచుకుని కూర్చుండే హస్తసాముద్రికుడిని మాత్రం కాదండోయ్ !
అందుకే ఈ కాఫీహౌస్ నాకెంతో భద్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా గుర్తుపట్టి నాతో మాట్లాడడానికి వస్తే మాత్రం నాకు గొప్పబాధగా ఉంటుంది. ముఖ్యంగా, రచయితలంటే నాకు మరీ చిరాకు. ఎందుకంటే, వాళ్ళు పట్టిపట్టి అన్ని విషయాలూ కూపీలు లాగడానికి ప్రయత్నిస్తారు. ప్రతిదానికీ పెడర్థాలు తీస్తారు. క్రిందటి వారం ఏమైందో తెలుసా? కవిగా మారిన జర్నలిస్టు నిరుపం కి దొరికిపోయేను. బాబూ ఇక చూడండి, వాడి ఆకురాయిలాంటి చేతులతో నా భుజాలు తెగ అరగదీసేస్తూ, “ ఏమిటి సార్, మీ రాబోయే చిత్రం? కథా? నవలా? నాటకమా?” అని తగులుకున్నాడు.
నాకు ఒళ్ళుమండి, “ఏం కాదు. టెలీకమ్యూనికేషన్సు డిపార్ట్ మెంట్ వాళ్ళు ఢిల్లీ టెలిఫోన్ డైరెక్టరీని ప్రూఫ్ రీడ్ చెయ్యమని నియోగించేరు. ఆ పనిలో ఉన్నాను,” అన్నాను తిక్కరేగి. అతనో వెర్రినవ్వు నవ్వి అదోలా మొహంపెట్టి, మారుమాటలేకుండా వెళ్ళిపోయాడు. పీడావదిలింది అనుకున్నా.
ముందు నన్ను నా కార్నర్ సీటును దక్కించుకోనియ్యండి. చూసేరా! నా ఆలోచనలు ఎలా వెర్రితలలు వేసుకుంటూ పోతున్నాయో? అందుకే నా నోట్ బుక్ తెరిచి టేబిలుమీద పెట్టాను. నా రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ను తెరిచి దానిమీద పెట్టేను. అంటే, ఈ టేబిలు “రిజర్వ్డ్” అని సంకేతమన్నమాట. దూరంగా ఉన్న “సెల్ఫ్ సర్వీస్” కౌంటరు దగ్గరికి వెళ్ళేను… ఓ కప్పు కోల్డ్ కాఫీ తెచ్చుకుందికి. ఈ శీతాకాలపు సాయంత్రం కోల్డ్ కాఫీ తాగాలంటే ఎంత వెగటుగా ఉంటుందో చెప్పనక్కరలేదు. మా కేసుని ఎటూతెగకుండా అలాఅలా లాక్కొస్తున్న చేతగాని ససవ లాయరు రాంకపూర్ మీద కసితో ఈ కషాయం తాగడానికి పూనుకున్నానేమో కూడా చెప్పలేను. ఒక్కసారి గట్టిగా దులిపేద్దామనిఉందిగాని, ఆ త్రాష్టుడికి నా వ్యక్తిగతవివరాలన్నీ పూర్తిగా తెలిసి చచ్చేయి. వాడిని తన్నితగిలేసేనంటే, ఆ సమాచారం అంతా నామీదే ప్రయోగించి నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యడం ఖాయం. నిన్న కోర్టులో నన్ను కంగారుగా ఎంతసేపునించోబెట్టేడో తలుచుకుంటే గుండెబద్దలవుతుంది. జడ్జీగారిలో రవ్వంతైనా సానుభూతికలిగేవిధంగా ఒక్కటంటే ఒక్క ముక్క వాదించగలిగేడా ఆ వాజెమ్మ? ఎంతో కీలకమైన విషయం… నా భార్య చేతుల్లో నేనెంత నరకయాతన అనుభవించేనో జడ్జీముందు ఉంచగలిగేడా? అంతెందుకూ, అంత పెద్దచేతులున్నాయి… ఊరికే క్లయింట్లదగ్గరనుండి డబ్బు నొల్లుకుపోడానికే కాకపోతే, బల్లగుద్ది వాదించవచ్చుగదా! ఆ చేతులతో ఎన్నిరకాల అభినయాలు, ఎన్నిరకాల హావభావాలు ప్రదర్శించవచ్చు! ఏదీ ఒక్క పాయింటయినా చేతులతో చెప్పేడా? ఊ హు. రెండు చేతులూ వెనక్కికట్టేసుకుని ముంగిలా నుంచుంటాడే! ఎదురుగా ఎవడో తుపాకీగురిబెట్టి, ‘నోటంటమాట ఊడిపడితే జాగ్రత్త’ అని బెదిరించినట్టు భయపడుతూ నిలుచుంటాడే! ఆ జడ్జీగారు కోర్టులో ఉన్నంతసేపూ ఆ రెండు పేపరువెయిట్లనీ అవేవో నవయవ్వనంలోఉన్న కన్యకామణికుచద్వయంలా ఎంతో మక్కువగా ముద్దుగారాస్తూ కూర్చున్నాడే! అంతకంటే మంచిమూడ్ లో ఏ జడ్జీమాత్రం ఎప్పుడుండగలడు? అంత మంచి అవకాశాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేసేడే.
అంతేనా, లేకపోతే నా మనసు విపరీతంగా ఊహాగానం చేస్తోందా? లేకపోతే జడ్జీగారి చేతులకీ నాకేసుకీ ఏమిటి సంబంధం?…
“మీ కభ్యంతరం లేకపోతే ఇక్కడ కూర్చోవచ్చాండీ?”
నా ఆలోచనలమీద నీళ్ళు చిలకరించినట్టు మాటలు. తలెత్తి చూసేను. ఒక మధ్యవయసులోఉన్న స్త్రీ. ఆమెతో రమారమి యాభైఏళ్ళవయసుండే పురుషుడూ. ఇద్దరి మొహాల్లోనూ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చేతులు కొంచెం వణుకుతున్నట్టు కనిపిస్తూనే ఉంది.
“అలా కూర్చోండి” అని ఎదురుగా ఉన్న సీట్లు చూపించేను. నిజానికి వాళ్ళు నా టేబిలు దగ్గర కూర్చోడం నా కేమాత్రం ఇష్టంలేదు గాని అప్పటికే కాఫీహౌస్ లో అన్నిటేబిళ్ళదగ్గరా జనాలు నిండిఉన్నారు. నా రేనాల్డ్స్ పెన్ను చేతిలోకి తీసుకుని ఏదో రాస్తున్నట్టు నటిస్తున్నానుగాని కనుకొలకులనుండి వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉన్నాను. ఆ స్త్రీ కుడిచెయ్యి మెల్లగా అతని ఎడమచెయ్యిమీదకు వెళ్ళి ఆ చేతిమీద కాసేపు నిలిచి ఉంది. మనసులో ఏ వ్యధ పెల్లుబికిందోగాని ఆమె మొహం ఎర్రబడింది.
“ఏన్నాళ్ళిలా గడపాలి మనం?”
వ్యధాభరితమైన ఆమె గొంతు గుసగుస. ఆ గొంతులో ఏదో తొందర ధ్వని. వెనువెంటనే ఆమెచెయ్యి అతని ఎడమచేతిమీద కిందకీమీదకీ కదలాడ సాగింది. ఆమెవేళ్ళు పియానోమెట్లమీద నాట్యంచేసినట్టు సుతారంగా, సున్నితంగా, ఆర్ద్రంగా కదులుతున్నాయి. నేను సూటిగా వాళ్ళవైపు చూసేను. ఆ జంట ఏదో చెయ్యరాని అవినీతిపనిచేసి పట్టుబడ్డట్టు గాభరాపడ్డారు. వెంటనే ఇద్దరూ లేచి తాగుతున్నకాఫీకూడా వదిలేసి గబగబా మాయమయ్యారు. పాపం! ఈ ప్రేమపక్షులని బెదరగొట్టి తరిమేసేనన్నమాట. కానీ ఆ చేతులు … ఆమెవి ఎంత ఉద్వేగంగా, సున్నితంగా… అతనివి ఎంత నిర్లిప్తంగా, ఏమీ పట్టనట్టు… లాభం లేదు. వీళ్ళిద్దరూ ఎప్పటికీ వీళ్ళ సమస్యని పరిష్కరించుకోలేరు.
నాదొక్కడిదే కాదు…లోకంలో అందరిదీ ఇదే బాధన్నమాట. ఐతే, వారి బాధ నే నర్థంచేసుకోగలను. కానీ, నా బాధే అర్థంచేసుకోగలవారు ఎవరూ కనిపించరు. నేనుకోరేదల్లా ఒక్క సానుభూతి వాక్యం. ఒక సౌహార్ద్ర హృదయం. అంతకన్న నేనేం వారిదగ్గరనుండి ఆశించలేదు.ఇటువంటి చిన్నచిన్నవే ఎంతో మనశ్శాంతినిస్తాయి.
ఈ కుర్చీలోనే కూర్చోవాలంటే మరో కాఫీ తెచ్చుకోవాలి… ఈ కషాయం నా కివాళ ఏ రకమైన ఉత్తేజాన్నీ కలిగించకపోయినా సరే! ఈ రోజు ఏం తాగినా ఏవగింపుగా ఉంటోందంటే ఏదో అదృశ్యహస్తం నా మనశ్శాంతిని ఇక్కడకూడా హరిస్తోందన్నమాట. చీటికీమాటికీ ఒళ్ళంతా తెగకుట్టే ఆ మహమ్మారి ఎర్రతేలుని చేసుకున్నానంటే బుర్ర ఎంతబద్దలుకొట్టుకున్నా నమ్మకం కుదరడంలేదు. తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆ రాక్షసితో పదేళ్ళు… పదేళ్ళు కాపురం చేసేను!
పోనీ అయిందేదో అయిపోయిందండీ. ఇంత బాధా అనుభవించేక ఇప్పుడు ఎందుకూ కొరగాని ఓ నల్లసానపురాయిలాంటి తెలివితక్కువ బడుధ్ధాయిని లాయరుగా ఎందుకు పెట్టుకోవాలి? “ఆమె మీకు కలిగించిన మానసికహింస మీద వాదిద్దాం,” అంటాడు దాని శారీరక చిత్రహింసలు కొట్టవచ్చినట్టు తేటతెల్లంగా కనబడుతున్నా ఆ సంగతి ఏమాత్రం పట్టించుకోకుండా. ఎదురుపడ్డప్పుడల్లా ఆమె మీదపడి చేతులతోనూ, గోళ్ళతోనూ రక్కేది. నా గొంతుపిసికి చంపడానికి ప్రయత్నించేది. ఇవన్నీ ఎక్కడ మరిచి చచ్చేడో, ఒక్క ముక్క ఆ రీటా లాయరు ముందు పలకడే! ఆ జడ్జీగారికి డేగగోళ్ళలాంటి గోళ్ళున్న ఆమె చేతులగురించి ఎంతైనా చెప్పొచ్చు. కానీ ఒక్క మాటంటే ఒక్క మాట, ఆదేం ఖర్మో, నోటంట ఊడిపడదే!
సాంప్రదాయికంగా ఆమెను పెళ్ళిచేసుకోమని అమ్మ ఎందుకు పట్టుబట్టాలి? అమ్మ చెపితే మాత్రం నేనెందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడామె చచ్చి హాయిగాస్వర్గంలో కూచుంది… ఈ దెయ్యంతో ఈ కోర్టులచుట్టూ తలపడమని నన్నొదిలేసి. ఈ దుర్భరమైన బాధ ఇంకా నే నెన్నాళ్ళు భరించాలో తెలియడం లేదు. రీటాకైతే వాళ్ళన్న ఉన్నాడు ఈ కోర్టువ్యవహారాలన్నీ చూసుకుందికి. నాకే ఎవరూలేనిది. నా స్నేహితులందరూ ఆ చెంపా ఈ చెంపా తగులుతున్న గాయాలలోంచి కారే నెత్తుటికడగండ్లూ, అవస్థలూ చూసి సంతోషిస్తున్నట్టు కనిపిస్తారేతప్ప బాధపడుతున్నట్టు కనిపించరు, ఒక్క జగదీష్ తప్ప! అతనుకూడా ఎంతవరకు స్పందిస్తున్నాడో చెప్పడం కష్టం. అంచేత నన్ను నేనే సాంత్వనపరచుకునే పధ్ధతి అనుసరించాలి.
సరే! అలాగే కానివ్వండి.
“కొంచెం ఓర్చుకో నాయనా, అన్నివిషయాలూ చక్కబడతాయి. ఇంక ఎంతోకాలం పట్టదు. నువ్వు గెలవడం ఖాయం. ఆఖరుకి జయం మనదే! ఈ కార్చిచ్చులోంచి నిన్ను భగవంతుడు ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా? నీకు పూర్తి సంయమనం కలిగించడానికేనయ్యా! అంతా మన మంచికే. ఈ బాధాభినివేశం నిన్నూ, నీ ఆలోచనావిధానాన్నీ ఎంత సునిశితంచేసిందో తెలుసా? ప్రతి విషయాన్నీ అన్నిదృక్కోణాల్లోంచీ చూసి వాటి నిజస్వరూపాన్ని గ్రహించే శక్తి నీకు చేకూర్చింది. నువ్వు ప్రతివారికీ బోధించే కాలధర్మవివక్షత నువ్వెందుకు అర్థంచేసుకోవు? నీకు జ్ఞాపకం ఉందా? జుగల్ కిషోర్ ఉద్యోగంలోంచి సస్పెండ్ అయినప్పుడు అతని మనోవేదనను నువ్వెలా పోగొట్టేవో? అతన్ని ఇంట్లో కాలదేవతవిగ్రహాన్ని పెట్టుకోమని ఉద్బోధించేవు. మరిచిపోయేవా? అన్నిటికీ సమయం కలిసి రావాలయ్యా. మహా అయితే ఎంతకాలమని? కొన్ని నెలలు… తప్పితే కొన్ని వారాలు. అంతే! ఆ తర్వాత అన్నిబాధలూ హూష్ కాకీ అన్నట్టు మాయమైపోతాయి. అంచేత నాయనా, నువ్వుకూడా కాలదేవతని ఎందుకు కొలవకూడదు? ఆ దేవుడిని, ఆ సర్వాంతర్యామిని స్తుతిస్తూ పాటలూ, పద్యాలూ ఎందుకు రాయకూడదు? అతడుతప్ప మనకు వేరే మార్గమేముంది? ఇతర దైవాలన్నీ రాళ్ళూ రప్పలేకదా!”
“హాయ్! హౌ ఆర్యూ?”
ఒక మొగగొంతు నా ఆలోచనలకి అంతరాయం కలిగించింది. తలెత్తి చూసేను. ఎదురుగా కోహ్లీ, అతని కూతురు గీతా. అయ్యో భగవంతుడా! ఒక్క క్షణం ముందు తెలిసిఉంటే, ఈ కీటకాలనుండి రక్షించుకోడానికి ఏ టేబిలుక్రిందో నక్కేవాడిని కదా! లేకపోతే ఆ కాంపౌండ్ వాల్ గెంతి వీళ్ళబారినుండి బయటపడేవాడిని కదా! ఇప్పుడెలా? అసలు నేనిక్కడున్నట్టు వీళ్ళెలా పసిగట్టేరో! ఇది ఈ గీతమ్మ పనే అయిఉంటుంది. సందేహం లేదు. ఆమె విడాకులుతీసుకున్న క్షణం నుండి ఎక్కడికి వెళ్ళినా నన్ను నీడలా … కాదు కాదు బంకలా వెంటాడుతూనే ఉంది. ఇలాంటి ముఖప్రీతి పలకరింపులంటే నా కెంత అసహ్యమో ఈ కోహ్లీగాడికి తెలిస్తే బాగుణ్ణు. ఇలాంటి పలకరింపులే నా సంబంధబాంధవ్యాల నిజస్వరూపాలని అంచనావేసుకుందికి ప్రేరేపిస్తాయి. ఇలాంటి పలకరింపులకి సమాధానమివ్వాలంటే… “నా విడాకులకేసు చట్టబండలయ్యేట్టు ఉంది నాయనా! నేను మట్టికరుచుకుని ఇక్కడిలా ఛస్తున్నాను. నా మానాన్న నన్నుండనియ్యి” అని అనాలి.
“ఓ సారి మా ఇంటికి రాకూడదూ? మా గీత ఎంతచక్కగా డాన్స్ చేస్తుందో వీడియోలో చూద్దురుగాని?”
“వీడియోలో ఏం ఖర్మ, ఎదురుగా మనిషే ఉందిగా! ఇక్కడే చెయ్యమనండి ఆ డాన్సేదో!”… అనుకున్నా లోలోపలే! తాటిమానులాంటి ఆ చేతులతో అసలు ఈ శాల్తీ ఏ డాన్సయినా చెయ్యగలదా అని. ఆ చేతులసలు నృత్యభంగిమలు ప్రదర్శించగలవా? మాటవరసకి, కమలంలా ఆ చేతివేళ్ళు మలచడం సాధ్యమేనా అని నా సందేహం. ఏ ప్లాస్టిక్ సర్జరీ చేసినాసరే ఆ వేళ్ళకి సౌకుమార్యం సంతరించడం అసాధ్యం. నాకు తెలుసు వాళ్ళింటికి నన్నెందుకు ఆహ్వానిస్తున్నారో! మరెందుకో కాదు. ఈ విడాకుల రమణీలలామని నాకు ఎలాగైనా అంటగడదామని. ఒక విడాకుకి ఇంకో విడాకును వేటాడే ప్రయత్నం. స్పష్ఠంగా తెలియడంలేదూ? అఖిలభారత విడాకీయులసంఘం ఏర్పరచి, అందులో ఎవరి నిబంధనలు వారు ఏర్పరచుకుని, ఒక కొత్త తెగ పుట్టించవచ్చేమో! ఏది ఏమైనా, గీతమ్మా! నేను నీకోసం, నువ్వు నాకోసం కాదు సుమ్మా! తక్షణం వెళ్ళిపొమ్మా! మరో మంచిమొగుణ్ణి ఎంచుకోడం నీకేం కష్టంకాదు లెమ్మా! నీ బాబుదగ్గర మూలుగుతున్న దుబాయ్ దొంగ బంగారం నిన్ను ఆదుకోగలదమ్మా!
“అంతకంటేనా! తప్పకుండా వస్తాను. కొంచెం ముఖ్యమైన పనుల్లో ఉన్నాను. వీలు చూసుకుని వస్తాను.”
“అలాగే కానివ్వండి. .. మీ కేసెలా నడుస్తోంది?”
“ఏం బాగుండలేదండీ… ఐనా ఫర్వాలేదు. నేను ఆగగలను. జీవితంలో ఇలాంటివాటిని ఎలా తీసుకోవాలో నాకు బాగాతెలుసు. … ఆ! అన్నట్టు మరిచాను. నా పుస్తకం పబ్లిషరుతో అర్జంటు పనుంది. నే వెళ్ళాలి. ఆయన పంచ్యువాలిటీ అంటే పడిచస్తాడు” అనేసి, మారుమాటకోసం ఎదురు చూడకుండా గబగబా బయటకినడిచేను.
***
జమ్ము అండ్ కాష్మీర్ బాంక్ పక్కనుంచి, పాతకార్లూ, స్కూటర్లూ కొని అమ్మే భసీన్ గేరేజ్ దాటుకుని వీధంట నడుస్తూ మద్రాస్ హోటల్ బస్సుస్టాప్ దగ్గర ఆగేను కాసేపు, ఏం చెయ్యాలో తోచక. ఎదురుగా ముక్కాలి వెదురుస్టాండుమీద పళ్ళబుట్టని చాకచక్యంగా బ్యాలెన్సుచేస్తూ పళ్ళమ్ముకునేవాడు కనిపించేడు. ఆల్చిప్పలాంటి రేకుముక్కతో చకచక పళ్ళతొక్కలుచెక్కే హస్తవిన్యాసంతో, అరటి, బొప్పాయి, జామ, బత్తాయి, ఏపిలు పళ్ళ ముక్కల్నికోసి ఎంచక్కా చిన్న ఆకుముక్కలో అమర్చి, ఆకుని ఒకచేత్తో ఒడిసిపట్టుకుని మరోచేత్తో డబ్బాలోంచి ఉప్పూ, మిరియాలపొడీ, బొటనవేలుకీచూపుడువేలుకీమధ్య పట్టితీసి పండ్లముక్కల మీద జల్లి, కలగలిపి అందించే ఆ చేతులు నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తాయి. మంత్రోఛ్ఛాటనచేస్తూ, చేతులూపుతూ ఏదోదేవతను ఆవాహన చేస్తున్నట్టుంటాయి ఆ చేతులు. ఆ రంగురంగుల పండ్లరుచి చూడాలని నోరూరుతోంది. ఆ కాఫీహౌస్ లోని రుచీపచీలేని కాఫీకంటే ఇది ఎన్నోరెట్లు నయం. కానీ కాఫీగత ప్రాణులకి మరో మంచిరుచి రుచిస్తుందా?
ఆ పండ్ల కలగలుపు విందుకావిస్తుంటే, వెనకనుండి పెద్దగా ఆహా, ఓహో అంటూ అరుపులు వినిపించాయి. వెనక్కితిరిగిచూస్తే అక్కడ ఒక వీధిఆటగాళ్ళ జోడీ కనబడింది. చినిగినచొక్కాలోంచి కనిపిస్తున్న ఎండిన ఎముకలతో సుమారు ఒక పదకొండేళ్ళకుర్రాడూ, వాడిపక్కనే నాలుగేళ్ళుంటాయేమో, వాడి చెల్లీ. ఆ కుర్రాడు ఆ అమ్మాయిని తన అరచేతులమీద పైకి ఎత్తాడు. ఆ పిల్ల పెద్ద ఆరిందాలా రెండు గిరికీలు కొట్టి, పిల్లిమొగ్గవేసి రెండుపాదాలమీదావాలి గొప్పగా సలాంచేసి నిలుచుంది. బస్టాపులో చీమలబారులా క్యూకట్టి నిలుచున్న ప్రేక్షకులకు విజయగర్వంతో సలాంకొట్టి ఒక్కొక్కరిముందూ చెయ్యిచాపింది. అలా చాచినచేత్తో ఆ క్యూలోని వారందరిముందూ ఒక్క పైసా, రెండుపైసలు అంటూ అర్థించింది. క్యూలోనివారందరూ మొహం పక్కకి తిప్పుకున్నారు. ఐనా ఆ పిల్ల నిరుత్సాహం చెందినట్టు కనిపించదు. జీవితంకూడా వాళ్ళు రోజూ ఆడే ఆటలా భావిస్తారేమో వీళ్లంతా. ఒకరు ఒక పైసా వేస్తే ఏమిటి? వెయ్యకపోతే ఏమిటి? నేను ఆ అమ్మాయిదగ్గరికి నడిచివెళ్ళి పదిరూపాయలనోటు ఆమెచేతిలో ఉంచాను. బహుశా అంతపెద్దమొత్తం రోజంతా ఆడినా దొరకదేమో! ఆమెకళ్ళు కృతజ్ఞతతో మెరిసాయి. నా పాదాలకి మొక్కడానికి వంగితే నేను దూరంగా జరిగి వద్దన్నట్టు చెయ్యి అడ్డంగా ఊపేను. ఈ వీధి ఆటగాళ్ళు బహుశా జమునానదిగట్లమీదబసచేసే కూలివాడలనుండో, లేకపోతే షాదీపూర్ బస్ డిపోని కారంపూరాతోకలిపే ఫ్లై ఓవర్ క్రింద మకాంఉండే కూలిజనాలనుండో వచ్చి ఉండొచ్చు. అంతలా ఆడుతూ గెంతుతూండడానికి పాపం వాళ్ళు ఏం తింటారో! వాళ్లచేతులెలా ఉన్నాయో ఒక్క సారి చూస్తే బాగుండును. ఆ పిల్ల చేతులు చాలా లేతగా సున్నితంగా ఉండిఉంటాయి. ఆ కోమలమైన వేళ్ళు ఏ భంగిమనైనా అతి సునాయాసంగా చెయ్యగలవు… ఆ గీత కంటే వెయ్యిరెట్లు అందంగా.
మళ్ళీ తిరిగి కాఫీహౌస్ వైపుకు దారితీసాను. ఈ పాటికి ఆ కోహ్లీలు వెళ్ళిపోయి ఉంటారు. కాఫీహౌస్ వేగం చేరుకోవాలి. జగదీష్ వచ్చి తిరిగివెళ్ళిపోతే కష్టం. ఇవాళ తప్పకుండావస్తాడని నమ్మకం ఉంది. నిన్నసాయంత్రం కోర్టునుండి ఫోనుచేస్తే కొంచెం చలించినట్టు ధ్వనించాడు. మా ఇద్దరి అభిరుచులు వేరైనా, నాకెందుకో అతనితో నా బాధలు చెప్పుకోవచ్చనిపిస్తుంది. అతను గవర్నమెంటు ఉద్యోగంలో ఉన్నవాడు. చాలా సభ్యతతో మాట్లాడుతాడు. నేనైతే హృదయం ఒలిచి అతనిముందు పెట్టెస్తాను. నా వెతలన్నీ ఒలకబోస్తాను… ఏమాత్రం సానుభూతైనా దొరికిందంటే చాలు నాకు. ఐతే నా పుస్తకాలెప్పుడైనా చదివాడో లేదో మరి నేనెన్నడూ అడగలేదు. అంత అవసరం అని కూడా అనిపించలేదు. ఎవరైనా తనలోతాను మాటాడుకుందికే రచనావ్యాసంగమని భావిస్తాను నేను.
ముందు నా కార్నర్ సీటు మళ్ళీ నాకు దొరుకుతుందోలేదో చూడాలి. అయ్యో! ఎవడో పర్వతాకారుడు ఓ సిక్కు దాన్ని ఆక్రమించేసేడు. కాని ఆ పక్కటేబిలుమీద రెండుసీట్లు ఖాళీగాఉన్నాయి. పోనీ! ఇదీ బాగానేఉంది. ఒకటి నేను తీసుకుని రెండోది జగదీష్ కోసం ఉంచొచ్చు. ఒక కుర్చీమీద నా నోట్ బుక్కూ, రెండోదానిమీద నా జేబురుమాలూ ఉంచి నాకో కప్పు కాఫీ తెచ్చుకుందికి వెళ్ళాను… ఆ కాఫీ తెచ్చిన ఎంతసేపటికీ తాగననీ, నా ముందు అలా ఆ కప్పులోనే చల్లారనిచ్చి వదిలేస్తాననీ తెలిసినా.
కాఫీకప్పుతోవచ్చి కుర్చీలోకూర్చుని జగదీష్ పట్ల నా మనసులోనిభావాలను నెమరువేస్తున్నాను. అతను నా ఎదురుగా కుర్చీలోకూర్చునే పధ్ధతి నాకు నచ్చుతుంది. బలిష్టమైన పురుషహస్తాలురెండూ పెనవేసి టేబిలుమీద పెడతాడు. అతని చేతులు చూసినప్పుడల్లా చేతులమధ్యదీపాన్ని కాపాడుతూండే జీవితభీమాసంస్థవారి హస్తద్వయం గుర్తొస్తుంది. అతను ఇంతవరకు ప్రత్యేకంగా నా కేమీ చెయ్యకపోయినా, అతని సమక్షంలో నేను ఆ జీవనభీమాసంస్థవారి దీపంలా నిశ్చింతగాఉంటాను. అతనునాకేదో చెయ్యడానికీ, తిరిగి నేనతనికి ఏదో ఒరగబెట్టడానికీ స్నేహం కొనుగోలు వ్యవహారం కాదుగదా! ఈ రోజు స్నేహంమీద నా అభిప్రాయాన్ని అతనికి తెలియచెప్పాలని అనుకుంటున్నాను. ‘జడ్జిమెంట్ డే’ అనే క్రిస్టియన్ నమ్మకాన్ని హిందువునైన నేను నమ్మనుగాని, అలాంటిరోజేదైనా నిజంగాఉంటే, భగవంతుడు ప్రతీఆత్మనీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు: “ధరిత్రిమీద నీ జీవితకాలంలో ఒక్కడంటే ఒక్కడైనా నిజమైన మిత్రుడు నీకున్నాడా? నీ కోసం తన ప్రాణాన్ని ఒడ్డగలవాడు ఒక్కడంటే ఒక్కడున్నాడా”అని. గుర్తుంచుకొండి మీ భార్యా పిల్లలూ బంధువులూ మిత్రులు కారు. అలాంటి మిత్రుడు మీకొక్కడుంటే మీకు స్వర్గంలో స్థానం. లేదంటారా? ఉండనే ఉందిగా, రెండోది!
జగదీష్ అలాంటి స్నేహితుడని నేను చెప్పలేననుకొండి. కానీ, మేమిద్దరం చిన్నప్పటినుండీ కలిసి చదువుకున్నాం. అడపాతడపా నా వ్యధలన్నీ ఓపిగ్గా వింటాడు. ఈ వేళ కూడా, నా విషాదగాధవిని, నన్ను బాధపడొద్దనీ, వేగంగానే విడాకులుదొరికిపోతాయనీ, కోర్టులోకేసులన్నీ రోజూ మారుతుండే చంద్రుని కళలవంటివనీ, ఒకరోజు దుఃఖాన్నికలిగించినా, మరో రోజు నాకు సుముఖంగా ఉంటుందనీ చెప్పి, నన్ను ఊరటపరుస్తాడని నా నమ్మకం. ఆ తర్వాతంటారా! మేం పండగ చేసుకుంటాం. ఈ చల్లారిన కాఫీతో కాదు. జానీవాకర్ తోనో… షేంపేన్ తొనో… అతని కుడిచెయ్యి నా ఎడం చెయ్యిమీద వేసి ఓదార్పుగా రాస్తూ నాకు మానసికంగానూ, శారీరకంగానూ ఆనందం అందిస్తూ.
హల్లో! ఏమిటి భాయ్!
సారీ, కొంచెం లేటయింది.
(హమ్మయ్య! వచ్చావా. నాకు తెలుసు. నువ్వు తప్పకుండా వస్తావని.)
రా! రా! ఇలా కూర్చో అని జేబురుమాలుతీసి కుర్చీ చూపించేను. అతను కూర్చున్నాడు. ఎప్పటిలాగే రెండుచేతులూ మెలివేసి టేబిలుమీద పెడుతూ మాటలలోకి దిగేడు.
ఇవాళ ఆఫీసులో చాలా దుర్భరంగా గడిచిందోయ్. ఇవాళ మనకంతా చుక్కెదురే. మా ఆఫీసరు మొగుడు అర్జెంటుగా ఒక నోట్ తయారుచెయ్యమన్నాడు… ఎవడిదో ప్రమోషను. కనీసం ఆ శాల్తీ తాలూకు మంచీ చెడూ చూడ్డానికైనా టైమివ్వాలా? నేనేం కంప్యూటర్ని కానుకదా! ఆ మహానుభావుడేదో ఒత్తిడిలో ఉండి ఉంటాడు. అది నామీద చూపించేసేడు. దీనికి తోడు ఆ వెధవఫోను ఒకటి. రోజల్లా అలా మోగుతూనే ఉంది. ఆఖరికి మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేకపోయాను. అబ్బ చచ్చిపోయాననుకో! అంచేత ఆఫీసయిపోగానే కొంచెం గాలిపీల్చుకుందామని కారు ఎంపైర్ స్టోర్స్ ముందాపి నిలుచున్నా! ఏం జనం రా బాబూ! ఊపిరిసలపకుండా! అబ్బబ్బ!….
అదే వరస. చెప్పుకుంటూ పోతున్నాడు. మధ్యమధ్య గాలిలో కుడిచెయ్యి ఊపుతూ విన్యాసాలు చేస్తున్నాడు. కాని ఏమిటి ఈ సోదంతా! జనాలూ, ఊపిరిసలపకపోడాలూ ఎక్కడలేవు? పోనీలే! ముందింకా చెప్పేదేమైనా ఉందేమో ననుకున్నా. నాకో మంచిమాట చెపుతాడనుకున్నా. ఉన్నట్టుండి ఒక్కసారి లేచాడు.
అయ్యయ్యో! మరిచేపోయాను. మా ఆవిడ పట్టుచీర రైంబో డ్రై క్లీనర్స్ కి ఇచ్చేను. తిరిగి తీసుకోవాలి. ఎన్నింటికి వాడు షాపు మూసేస్తాడో నీ కేమైనా తెలుసా?
తెలీదు జగదీష్.
సరే, అయితే! తర్వాత కలుద్దాం.
బై! బై! నీరసం గా ఉంది నా జవాబు. గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది.
“యూ టూ … జగదీష్!” నాలో నేనే.
మెల్లమెల్లగా అప్పుడే చీకటి నగరంమీదకి వాలుతోంది. ఇంక కాఫీహౌస్ మూసేసే టైమయింది. కానీ నాకింకా ఎంతసేపు వీలయితే అంతసేపు ఉండాలని ఉంది. వెయిటర్ వచ్చి మూసేసే టైమైపోయింది సార్ లేవండి అన్నా నేను బాధపడను.
అకస్మాత్తుగా, నా కుడిచెయ్యి ఎడంచేతిని ఓదార్పుగా రాస్తూండడం గమనించేను. నాలో నేననుకుంటున్నట్టుగా: “చూడు భాయ్! నువ్వేం బాధపడకు. సమయమే అన్ని సమస్యలనీ చక్కబరుస్తుంది. గుర్తుంచుకో! ఏదేమైనా, జయం మనదే!! ఆఖరికి జయం మనదే, గుర్తుంచుకో!!!”
***
Prof. Shiv K. Kumar
ఆంగ్ల మూలం: Prof. Shiv K Kumar అనువాదం: RS Krishna Moorthy & NS Murty
Thank you. Prof. Shiv K Kumar is a poet, play-wright, novelist and a former vice chancellor of University of Hyderabad settled in Hyderabad. He had about 8 poetry collections, 6 novels and a drama published along with translations of Faiz Ahmad Faiz. He is born in 1821 in Lahore and his novel :River with Three Banks” gives great insights into the partition struggle as also how the three mainstream religions are exploited by some people those days. Actually, we (My uncle and I) translated a major part of it and my uncle’s sudden demise put a break. I am trying to complete it. I shall publish in this blog later.
Thank you for your visit.
స్పందించండి