ఇంతేనా… ఏన్ బ్రాంటి (Anne Bronte)

.
ఓ దైవమా! జీవితం
నాకు చూపగలిగింది ఇంతే అయినపుడు,
వేదనాభరితమైన నా నుదిటిని,
సేదదీర్చే నీ చల్లని చెయ్యి తాకనపుడు
.
ఇంతకంటే కాంతివంతంగా
ఈ ఆశాదీపము జ్వలించలేనపుడు
నేను బ్రహ్మానందాన్ని కేవలం కలగంటూ,
శోకమయ జీవితంలోకి కళ్ళు తెరవవలసివచ్చినప్పుడు
.
అన్ని సుఖాలూ సెలవుతీసుకున్నాక,
సాంత్వననిచ్చే స్నేహంకూడా కనుమరుగవుతున్నప్పుడు
నేను ప్రేమకై తిరుగాడుతుంటే
ఎప్పుడూ అది అందనంతదూరంలోనే ఉన్నప్పుడు
.
ఇతరుల ఆదేశాలకు బానిసలా బ్రతుకుతూ,
తిరిగే తిరుగుడుకీ, పడే పాటుకీ ఫలితం శూన్యమైనపుడు,
ఇతరుల నిత్య సంరక్షణలో, పదే పదే బాధపడుతూ,
అసహ్యించుకోబడుతూ, అయినా, జ్ఞాపకానికి నోచుకోనపుడు
.
నేరాల్నీ, పాపాల్నీ చూసి బాధపడుతూ,
లోపల అంతర్లీనంగానూ, బయటా ప్రవాహంలానూ
పెల్లుబుకుతున్న బాధను
నిర్మూలించడానికి అశక్తులమైనపుడు
.
నేను నేర్పిన మంచీ,
నేను పంచుకున్న హృదయానుభూతులూ
నాకే తిప్పికొడితే,
నేనది దిగమింగుకోలేనపుడు
.
సూర్యుడి ప్రకాశమెప్పుడూ మేఘాఛ్ఛాదితమై,
వెలుగురేక కనరానపుడు,
వేసవి రాకముందే
శిశిరం అనుభవించవలసివచ్చినపుడు
.
జీవితమంతా దుఃఖభాజనమైనపుడు,
దేవా! నన్ను నీ దగ్గరికి త్వరగా తీసుకుపో!
లేదా,
నా దౌర్భాగ్యాన్ని భరించగలిగే శక్తిని ప్రసాదించు.
.
ఏన్ బ్రాంటి
బ్రిటిషు కవయిత్రి, నవలాకారిణి
(17 January 1820 – 28 May 1849)
.
ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఒకే కళలో పేరుప్రఖ్యాతులు సంపాదించడం అరుదు. అటువంటి ఘనత బ్రాంటి సిస్టర్స్ సాధించారు . ఎమిలీ బ్రాంటి (Wuthering Heights), చార్లెట్ బ్రాంటి (Jane Eyre) మరియు ఏన్ బ్రాంటి (Agnes Grey). ఈ ముగ్గురు వ్రాసిన నవలలూ, ఇంగ్లీషు సాహిత్యంలో క్లాసిక్స్ గా కీర్తి గడించాయి. 29 ఏళ్ళకే గుండెసంబంధమైన క్షయవ్యాధితో మరణించిన ఏన్, తన అక్కలలా రొమాంటిక్ శైలిలో కాకుండా, వాస్తవానికి దగ్గరగా, విమర్శనాత్మక పధ్ధతిలో వ్రాసింది. ఈమె మంచి కవయిత్రి కూడ. అందుకు ఈ ఒక్క కవిత చాలు
.
If This Be All
.
O God! if this indeed be all
That Life can show to me;
If on my aching brow may fall
No freshening dew from Thee, —
If with no brighter light than this
The lamp of hope may glow,
And I may only dream of bliss,
And wake to weary woe;
If friendship’s solace must decay,
When other joys are gone,
And love must keep so far away,
While I go wandering on, —
Wandering and toiling without gain,
The slave of others’ will,
With constant care, and frequent pain,
Despised, forgotten still;
Grieving to look on vice and sin,
Yet powerless to quell
The silent current from within,
The outward torrent’s swell:
While all the good I would impart,
The feelings I would share,
Are driven backward to my heart,
And turned to wormwood, there;
If clouds must ever keep from sight
The glories of the Sun,
And I must suffer Winter’s blight,
Ere Summer is begun;
If life must be so full of care,
Then call me soon to Thee;
Or give me strength enough to bear
My load of misery.