బతుకు పాట … లాంగ్ ఫెలో

.
నాకు చెప్పకు, నీ శోకగీతికలతో,
జీవితమొక శూన్యపు కల అని!
చైతన్యవంతం కాని ఆత్మ, మృతిచెందినట్టే లెఖ్ఖ.
యదార్థానికి, వస్తువులు కనిపించినతీరులో ఉండవు.
.
జీవితం సత్యం. జీవితం వాస్తవం!
గోరీ కాదు దాని గమ్యం
మట్టిలోంచి పుట్టినది
మట్టిలో కలిసిపోతుందన్నది ఆత్మకు వర్తించదు.
.
సుఖభోగమో, విషాదమో
మన మార్గమూ, విధిలిఖిత చరమావధీ కావు.
ప్రతి ఉదయమూ, మనం నిన్నటికంటె
ముందు ఉండేలా అడుగెయ్యడమే!
.
కళ చూస్తే అనంతం… కాలమా! పరిగెడుతోంది,
మన గుండెలెంత దిటవుగా, ధైర్యంగా, ఉన్నప్పటికీ,
తెరచాటు మద్దెలలా,
మరణమృదంగాన్ని ధ్వనిస్తూనే ఉన్నాయి
.
ఈ విశాల విశ్వసంగ్రామరంగంలో,
రక్షణలేని జీవన స్కంధావారంలో,
పశువులమందలో ఒకడిగా మౌనంగా భరించకు…
పోరాటంలో వీరనాయకుడిగా నిలు!
.
ఎంత మనోహరమనిపించినా భవిష్యత్తుని నమ్మకు,
గతించిన గతాన్ని, సమాధిలోనే పరుండనీ…
అడుగెయ్యి, సజీవమైన వర్తమానంలోకి అడుగెయ్యి,
గుండె బలంతో, పైవాడిమీద నమ్మకంతో!
.
గొప్పవారి చరితలెప్పుడూ
మనజీవితాలను ఉదాత్తం చేసుకోగలమనీ
గతించిన పిదప, కాలపు ఇసుకతిన్నెలమీద
పదముద్రలు వీడగలమనీ చెబుతుంటాయి.
.
బతుకు కడలిపై ప్రయాణిస్తూ, నౌకాభంగమై,
దిక్కులేకపడిఉన్న సోదర నావికుడెవడైనా
రేపు ఆ ముద్రలను గమనించి,
ఏమో! స్ఫూర్తిపొందగలడేమో!
.
కనుక, లేద్దాం! శ్రమిద్దాం!
ఎట్టి ఫలితాన్నైనా ఎదుర్కోగల ధైర్యంతో.
ఇంకా సాధిస్తూ, ఇంకా అన్వేషిస్తూ,
శ్రమించడం, ఫలితానికై నిరీక్షించడం నేర్చుకుందాం.
.
H W లాంగ్ ఫెలో
.
Psalm of Life
.