అజేయ … విలియం ఎర్న్ స్ట్ హెన్లీ


నా బ్లాగు సందర్శకులకందరికీ
దీపావళి శుభాకాంక్షలు
.
భూ నభోంతరాలు వ్యాపించిన కాలబిలంలా
నన్ను కమ్ముకున్న ఈ నిశీధినుండి,
ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలున్నారో వారందరికి నా కృతజ్ఞతలు
లొంగదీసుకోలేని ఆత్మ నాకున్నందుకు
.
పరిస్థితుల పళ్ళచక్రం పట్టి బిగించినా
బాధతో మూలగనూలేదు, వెనుకంజవెయ్యనూలేదు.
యాదృఛ్ఛిక సంఘటనల గాయాలకి
తల రక్తసిక్తమైంది గాని అవనతం కాలేదు
.
ఈ క్రోధాలూ కన్నీళ్ళ సీమ కావల
కనిపిస్తున్నది కేవలం మృత్యుఛ్ఛాయ
ఐనా, వత్సరాల బెదిరింపుల పిదప, భయాలు
నేను లొంగలేదనీ, ఇకమీదటకూడా లొంగననీ గుర్తిస్తాయి
.
ఇపుడు ద్వారం ఎంత తిన్నగా* ఉన్నా,
నేరాల చిఠ్ఠా ఎంత పొడుగుగా ఉన్నా విచారం లేదు.
నా భవిష్యత్తుకిపుడు నేనే విధాతని
నా ఆత్మకు నేనే కర్తని.
.
(* స్వర్గానికి ద్వారం ఇరుకుగానూ, నరకానికి ద్వారం విశాలం గానూ ఉంటుందని Christian Religious thought. Matthew 7:14)
.
విలియం ఎర్న్ స్ట్ హెన్లీ
(23 August 1849 – 11 July 1903)
Victorian Poet
ఒక్క పద్యంతో సాహిత్యంలో శాశ్వతంగా నిలబడగల కీర్తిని సంపాదించడం అరుదు. అటువంటి ఘనత సాధించిన వాడు William Ernest Henley.
ఈ పద్యం నేపధ్యం తెలిస్తే ఇంకా ఆనందించగలం. ఎముకలకు సోకిన క్షయవ్యాధికి అతని ప్రాణం కాపాడటానికి తప్పనిసరి అయి, తన 17వ ఏట ఒక కాలు తొలగించిన సందర్భంలో ఆసుపత్రిలో రాసిన గీతం ఇది. అతను దీనికి శీర్షిక ఉంచలేదు. Arthur Thomas Quiller-Couch, తన సంపాదకత్వంలో 1902లో వెలువడిన “The Oxford Book of English Verse, 1250–1900” పుస్తకంలో దీనికి Invictus అన్న శీర్షిక ఉంచేడు. లాటిన్లో ఈ పదానికి అర్థం “ఓటమి లేని/ ఎరుగని” అని అర్థం.
ఈ పద్యం లో పాదాలు విభిన్న సందర్భాలలో వ్యక్తులకి ప్రేరణ నివ్వడమే గాక, తరచు ఉటంకించడానికి ఉపయోగపడ్డాయి. అందులో ప్రముఖులు, నోబెలు శాంతి పురస్కార గ్రహీతలు … Aung San Suu Kyi (Burma), Nelson Mandela (South Africa) కూడా ఉన్నారు.
2005 జులై 7న టెర్రరిస్టులు లండన్ భూగర్భరైలుమార్గంలో బాంబుదాడి జరిపినప్పుడు, మరుసటిరోజు Daily Mirror పత్రిక ఉంచిన పతాక శీర్షిక “Bloody, but unbowed.”
అతని మిత్రుడు RL Stevenson తన Treasure Island నవలలో Long John Silver పాత్రని హెన్లీ వ్యక్తిత్వం ఆధారం గా రూపకల్పన చేశినట్టు ప్రకటించేడుకూడా.
.
Invictus
.
Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.
In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.
Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds, and shall find, me unafraid.
It matters not how strait the gate,
How charged with punishments the scroll.
I am the master of my fate:
I am the captain of my soul.
.
దీపావళి శుభాకాంక్షలు!!
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you for visiting my blog. Happy and safe Diwali to you and all your family and friends.
best regards
Murty
మెచ్చుకోండిమెచ్చుకోండి