నువ్వు నన్ను ప్రేమించదలుచుకుంటే … ఎలిజెబెత్ బారెట్ బ్రౌనింగ్

.
నువ్వు నన్ను ప్రేమించదలుచుకుంటే,
నీ ప్రేమకు కారణం ప్రేమే తప్ప మరేదీ కాకూడదు
“ఆమె నవ్వుకి ఆమెను ప్రేమిస్తున్నాననీ–
ఆమె చూపులకు ప్రేమిస్తున్నాననీ–
ఆమె సౌమ్యంగా మాట్లాడే తీరుకనీ, —
మా ఇద్దరి ఆలోచనలూ ఆ విషయం లో
ఆశ్చర్యం గా ఒక్కలా ఉన్నందుకనీ,
ఫలానా రోజు నిజంగా నాకు
ఎంతో ఉపశమనాన్నీ సంతృప్తినీ ఇచ్చిందనీ…” చెప్పకు.
ప్రియతమా!
ఎందుకంటే అలాంటి ప్రవర్తనలు స్వతహాగా మారేవి…
నీకోసం మారొచ్చు.
అంతే కాదు, అలా కలిగిన ప్రేమ, అలాగే విరిగిపోతుంది కూడా.
.
అలాగే నా చెక్కిలిపై కన్నీళ్ళను తుడిచేనన్న జాలితో నన్ను ప్రేమించకు.
నీ అనునయాన్ని చిరకాలమనుభవించిన జీవి,
ఏడవడం మరిచిపోవచ్చు, తద్వారా నీ ప్రేమను కూడా.
నన్ను ప్రేమిస్తే, ప్రేమకోసం మాత్రమే ప్రేమించాలి…
నన్ను నిరంతరం ప్రేమించాలి…
అనంతమైన ప్రేమకోసం ప్రేమించాలి.
.
ఎలిజెబెత్ బారెట్ బ్రౌనింగ్ (1806-61)