(గమనిక: ఈ కవిత 1799లో ప్రచురింపబడి, ఆంగ్ల సాహిత్యాన్నేగాక విశ్వసాహిత్యాన్ని కూడా ఒక మలుపు తిప్పిన “లిరికల్ బాలెడ్స్” లోని ఒక ప్రముఖ కవిత. ప్రజల భాషలో ప్రజలదగ్గరికి కవిత్వీకరించకుండా కవిత్వాన్ని తీసుకురావాలనే వర్డ్స్ వర్త్, కాలరిడ్జ్ ల తీర్మానానికి కట్టుబడి వ్రాసినది.)
.
తరచు నేను ల్యూసీ గురించి వినడమే కాదు
ఆడవి బాట పట్టినప్పుడు
తూరుపు తెలవారే వేళకి
ఒకోసారి ఒంటరిగా నాకు తారసపడేది కూడా. .
పాపం! స్నేహితులూ, సావసగాళ్ళూ తెలీదు ల్యూసీకి
శృంగధార నానుకుని పెచ్చెరువు వంపులో ఉండేది
మనిషి రూపంలో మనమధ్య మసిలిన
తొణికిన అమృతపు తునక ల్యూసీ.
.
గంతులేసే జింకపిల్ల మీకు కనపడొచ్చునేమో,
పచ్చిక బయళ్ళలో మీరు చెవులపిల్లిని పసిగట్టగలరేమో
చక్కదనాల చుక్కలాంటి ల్యూచీ ముఖం
ఇక మీకు కనిపించమన్నా కనిపించదు.
.
ఈ రాత్రి తుఫాను భీకరంగా ఉంటుందిట
నువ్వు పట్నం వెళ్ళాలే, అమ్మలూ
లాంతరు తీసుకునిపో, దారికనిపించటానికి
అమ్మకి వర్షంలో తోడుగా ఉందువుగాని, వెళ్ళిరా!
.
అలాగే వెళ్తాను, నాన్నా! నాకూ సరదాగా ఉంది.
కానీ ఏదీ ఇప్పుడే మధ్యాహ్నం అయింది.
చర్చి గంట ఇందాకే రెండు గంటలు కొట్టింది
అదిగో చందమామ ఇంకా పాలిపోయే ఉన్నాడు
.
అనగానే వాళ్ళనాన్న ఇనపచువ్వ తీసుకుని
చలిమంటలో కాలుతున్న చితుకుల కట్టు విడదీసాడు
తనపని తను చేసుకుంటున్నాడు…
ల్యూసీ చేతిలోకి లాంతరు తీసుకుంది
.
ఆడవి దుప్పి అంత వేగంగా పరిగెత్తలేదు.
తుళ్ళుతూ, గెంతుతూ, నేలరాలుతున్న మంచుపొడిని
నలుపక్కలా విరజిమ్ముతూ నడుస్తుంటే
అది పొగమంచులా ఎగయడం ప్రారంభించింది.
.
తుఫాను అనుకున్న దానికంటే ముందే వచ్చేసింది.
ఆమె ఎక్కనూ దిగనూ, కలతిరుగుతూనే ఉంది
మిట్టలూ గుట్టలూ ఎన్ని ఎక్కిందో తెలీదు, అయినా,
పాపం! పట్నం మాత్రం చేరలేకపోయింది
.
ఆ అభాగ్య తల్లిదండ్రులు రాత్రంతా
అరుస్తూ కేకలెడుతూ అన్ని దిక్కులూ గాలిస్తూనే ఉన్నారు
పిసరంత చప్పుడు గాని, చిన్న వెలుగు రేకగాని దొరికితే ఒట్టు,
దాన్ని ఆసరాచేసుకునైనా వెదుకుదామనుకుంటే!
.
తెల్లారే వేళకి వాళ్ళో కొండమీదకి చేరారు
క్రింద కనుచూపుమెర పెచ్చెరువు కనిపిస్తూ.
వాళ్ళింటికి ఫర్లాంగు దూరంలో
వాళ్లకో కర్ర వంతెన కనిపించింది.
.
కన్నీరు మున్నీరవుతూ ఇంటిబాట పట్టేరు
మనమిక స్వర్గం లోనే మళ్ళీ కలుసుకునేదని బావురుమంటూ
… అంతలోనే అమ్మకి ఆనవాళ్ళు కనిపించాయి
ల్యూసీ అడుగులజాడలు పేరుకున్న మంచులో
.
అంత ఎత్తైన కొండ కొన నుండి కిందదాకా
ఆ చిన్ని పాదాల గురుతులు వాళ్ళు అనుసరిస్తూ వెళ్ళేరు