అనువాదలహరి

నిరాశా గీతం … Part 1 Neruda

.

రాత్రయేసరికి నీ జ్ఞాపకం నన్ను చుట్టుముడుతుంది.
నది తన అదుపులేని దుఃఖాన్నిసముద్రంతో కలబోసుకుంటుంది.

అరుణోదయంతోనే తెరమరుగయే కాంతివిహీనమైన తారకల్లా
ఓ నా విరహిణీ! ఇది ఇక విడిపోవలసిన తరుణం.

నా హృదయం మీద గడ్డిపూలు వర్షిస్తున్నాయి.
ఓహ్, శిధిల శకలాల గుట్ట, భీతావహమైన ఓడ మునక.

నీలో సంగ్రామాలూ, తిరోగమనాలూ లయించాయి.
నీలోంచే  పిట్టల కిలకిలలు రెక్కలు తొడుక్కున్నాయి.

అన్నిటినీ నువ్వు కబళించేవు, దూరంలా,
సముద్రంలా, కాలంలా. అన్నీ నీలో మునిగిపోయాయి.

ఇది చుంబనలతో దాడి చేయవలసిన సంతోష సమయం
లైట్ హౌస్ లా జ్వలించే మంత్రముగ్థమైన కాలం

నావికుల బెదురు, చోదకుని నిగ్రహంలేని ఆగ్రహం,
ప్రేమోన్మత్తుని కలహప్రియత్వమూ, అన్నీ నీలో మునక వేసాయి.

నా ఆత్మ శైశవపు సోనలవానలో, రెక్కలు తొడుగుకుని, గాయపడి,
శోధకుడిని పోగొట్టుకుంది, నీలో అన్నీ మునిగాయి.

నువ్వు విషాదాన్ని పోకముడివేసుకుని, కోరికను హత్తుకున్నావు,
దుఃఖం నిన్ను ఆశ్చర్య పరచింది, అన్నీ నీలో ములిగిపోయాయి.

క్రీనీడల గోడను వెనకడుగు వేయించి,
కామనకీ కార్యానికీ అతీతంగా నేను ముందుకి సాగిపోయాను.

ఓ శరీరమా, నా స్వశరీరమా, ప్రేమించి పోగొట్టుకున్న యువతీ,
ఈ కన్నీటి సమయంలో మిమ్మల్ని శాశిస్తున్నాను, నాగీతం మీకంకితం.

అనంత కోమలత్వాన్ని నువ్వు జాడీలో భద్రంగా దాచిఉంచావు.
అనంత విస్మృతి నిన్ను జాడీపగిలినట్లు ముక్కలుచేసింది.

ఆక్కడ ద్వీపాల చీకటి ఏకాంతం ఉంది.
అక్కడ, రాగవతులైన స్త్రీలు, తమబాహువుల్లో నను బంధించారు.

అక్కడ ఆకలి, దాహం ఉన్నాయి. నువ్వొక పక్వానికొచ్చిన ఫలానివి.
అక్కడ దుఃఖం, వినాశం  ఉన్నాయి, నువ్వే ఒక అద్భుతానివి.

ఓ యువతీ, నువ్వు నన్నెలా అదుపులో ఉంచగలిగేవో తెలీదు,
నీ ఆత్మ క్షేత్రంలో, నీ కౌగిలీ బంధంలో.

నీకు నా దేహార్తి ఎంత భీకరమూ, క్షణికమో!
ఎంత కఠినమో, మైకమో, ఆత్రమో, బిగువో.

ముద్దుల సమాధులు, అందులో ఇంకా తాపం జ్వలిస్తోంది,
చిలక కొట్టుళ్లతో, ఫలవంతమైన పొదలు భగ్గుమంటున్నాయి

అబ్బా! ఆ గాటుపడిన పెదిమలు, అవయవాలు,
కాంక్షాతప్తమైన దంతాలు, ఆ పెనవేసుకున్న శరీరాలు

అపేక్షా-శక్తుల ఉన్మత్త సమ్మేళన,
అందులో మనం లీనమై, నిరాశచెందాము.

నీటికంటే, పిండికంటే పలుచని, సుకుమారమైన తన్మయత్వంలో,
మాటలు పెదాలను విడదీయడానికి ప్రయత్నించలేదు.

ఇది నా గమ్యం, దీనికొరకే నా కోరికల ప్రయాణం,
ఇందులోనే నా ఆకాంక్ష భుగ్నమయింది, నీలో అన్నీ లయించాయి.

%d bloggers like this: