రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 4 వ భాగం

పంచమాంకం                                దృశ్యం 4

త్రిభుల – బాహుదా

(ఒక్క మెరుపు మెరుస్తుంది. ఒక్క పిచ్చికేకతో కొయ్యబారిపోతాడు త్రిభుల)

త్రీ: ఓరి భగవంతుడా! ఇది నా బిడ్డా! ఏమిటిది? నాచేతులకు రక్తం అంటుకుంది? నా కూతురు. నా తల తిరుగుతోంది.  క్రూరమైన కల ఏదో  నా జ్ఞానేంద్రియాలను వశపరచుకుంది. ఇది అసంభవం! ఇంతసేపూ నాతో ఇక్కడే ఉంది. భగవంతుడా! కనికరించు! ఇది ఆమె అయి ఉండదు. ఆమే అయితే నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది.

(మరొక్కసారి మెరుపు మెరుస్తుంది)

అమ్మో! ఈమె నా బిడ్డే! నా కూతురే ! అయ్యో బాహుదా!

ఈ రాక్షసులు నిన్ను హత్య చేశారా? చెప్పుతల్లీ! మాట్లాడు! ఏదీ, నాన్నతో మాటాడు? ఇక్కడ సాయం చేసేవారెవరూ లేరా? మాటాడు బాహుదా! అమ్మా! బంగారు తల్లీ! అయ్యో! భగవంతుడా!

(అలిసి కూల బడతాడు)

బా: (కొన ఊపిరితో- తనకున్న శక్తినంతా కూడగట్టుకుని ఏడుస్తున్న తండ్రిని చూసి, బలహీనమైన గొంతుకతో)

ఎవరది పిలుస్తున్నారు?

త్రి: (ఆనందాతిరేకంతో) ఆమె మాట్లాడుతోంది! నా చెయ్యి పట్టుకుంది.  ఆమె నాడి ఇంకా ఆడుతోంది.  ప్రభూ! నువ్వు దయామయుడవి.  ఆమె ఇంకా బ్రతికే ఉంది.

బా: (అతి ప్రయత్నం మీద కూర్చుంటుంది. ఆమె తొడుక్కున్న కోటు విప్పేస్తాడు. ఆమె చొక్కానిండా రక్తం. జుత్తు ముడివిడిపోయి వేలాడుతుంది. మిగతా శరీరం కనిపించదు.) నేను ఎక్కడ ఉన్నాను?

త్రి: బంగారుతల్లీ! నా కంటి వెలుగా! నా గొంతు వినిపిస్తోందా?  నన్ను గుర్తుపట్టగలవా, అమ్మా?

బా: నాన్నా!

త్రి: ఎవరు చేశారిది?  ఏమిటీ నిగూఢరహస్యం?  నిన్ను ముట్టుకుంటే ఎక్కడ ఏ గాయాన్ని కెలికి బాధకలిగిస్తానోనని భయమేస్తోంది.  బాహుదా! నాకేం కనిపించడం లేదు.  తల్లీ, ఏదీ నా చెయ్యి తీసుకుని  ఎక్కడ గాయం అయిందో ఒక్క సారి చూపించు.

బా: (ఊపిరికోసం బాధ పడుతూ) కత్తి గుండెలోకి దిగబడింది నాన్నా! అది గుండెను చీల్చినట్టుగా తెలుస్తోంది.

త్రి: కత్తితో పొడిచిందెవరు?

బా: ఆ పొరపాటు నాదే! నిన్ను మోసం చేశాను, నాన్నా! అతన్ని నేను మరీ గాఢంగా ప్రేమించాను. అతని కోసమే నేను ప్రాణత్యాగం చేస్తున్నాను.

త్రి: అయ్యో! ఘోరమైన ప్రత్యుపకారం. నేను ఇంకెవరికోసమో పన్నిన ప్రతీకార చర్య ఇలా బెడిసి కొట్టింది. కానీ ఎలా? ఎవరి హస్తం ఇందులో ఉంది? బాహుదా! తెలిస్తే చెప్పు.

బా: అ……..బ్బా……………..! నన్ను మాటాడమని అడక్కు.

త్రి: (ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ) నన్ను క్షమించు బాహుదా!  అందులోనూ, నిన్ను ఇలా పోగొట్టుకుంటున్నాను.

బా: ఊపిరాడటం లేదు.  నన్ను కొంచెం ఇటువైపు ఒత్తిగిలించు. కొంచెం గాలి కావాలి.

త్రి: బాహుదా! బాహుదా! తల్లీ! నువ్వు చనిపోడానికి వీలు లేదు!

(నిస్సహాయంగా ఇటూ అటూ తిరుగుతాడు) ఎవరక్కడ? సాయంచేసేవారే లేరా?

సాయం! సాయం!  ఆఁ!  ఆ బల్ల కట్టుదగ్గర ఉండే గంట,  గోడకు సమీపంలోనే ఉంది.

నిన్నొక క్షణంపాటు విడిచి వెళ్తాను తల్లీ! ఎవరయినా సాయం వస్తారేమో చూడ్డానికే!

నీకు కొంచెం నీళ్లు కూడా తీసుకు వస్తాను.

(సాయం కోసం అరుస్తాడు. గంట గట్టిగా వాయిస్తాడు.  పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి) 

ఏమయింది.  అయ్యో! ఈ తండ్రి గుండె పదిలంగా ఉండాలంటే, నువ్వు బ్రతికే ఉండాలి. నా తల్లీ! బంగారుకొండా!  నువ్వేకదా నా సర్వస్వమూ! బాహుదా! నిన్ను విడిచి నేను ఉండలేను.  వద్దు! చనిపోవద్దు!

బా: (మృత్యుభయంతో) సాయం చెయ్యి నాన్నా! నన్ను లేవనెత్తు. కొంచెం ఊపిరి ఆడనీ!

(ఎత్తి పట్టుకుంటుంటే నొప్పితో మూలుగుతుంది)

త్రి: అయ్యో!  నా చేత్తో  నిన్ను బలంగా అదిమిపెట్టేనేమో, బండవాణ్ణి.  ఇప్పుడు నీకు తేలికగా ఉందా అమ్మా?  బాహుదా! ఎవరో ఒకరు ఈ దారంట పోయేవారు వచ్చేదాకా ప్రాణాలు ఉగ్గ బట్టుకో!

 అయ్యో! సాయం చెయ్యండి! 

బాబూ బిడ్దకు సాయం చెయ్యండి! 

( అరుస్తాడు)

బా: (ఎంతో బాధపడిపోతూ) నా..న్నా.. న..న్ను..క్ష..మిం..చు.

(ప్రాణాలు విడిచిపెడుతుంది. అతని భుజం మీద ఆమె తల వెనక్కి వాలిపోతుంది)

త్రి: (ఆవేదనతో) బాహుదా! అయ్యో! ఆమె ప్రాణం పొతోంది! సాయం! సాయం!

( ఆమెను క్రిందికి దించి అతను బల్ల కట్టు గంట దగ్గరికి పరుగెత్తి చాలా జొరుగా గంట మ్రోగిస్తాడు)

ఎవరక్కడ? కాపలాదారూ! హత్య! సాయం!

(బాహుదా దగ్గరకి పరిగెత్తుతాడు.)

నాతో మాటాడు! ఒక్క మాట. ఒక్క మాటంటే ఒక్క మాట.

(ఆమెను పైకి లేవనెత్తడానికి ప్రయత్నిస్తాడు)

ఎందుకమ్మా అంత బిర్రబిగుసుకుపొయావు? తల్లీ!

నీ వయసనగా ఎంత? పదహారే!  నువ్వు చావడానికి వీల్లేదు.  నువ్వు నన్ను విడిచిపెట్టడానికి  వీల్లేదు.  ఇంక నీ ముద్దు మాటలతో ఈ తండ్రి హృదయాన్ని రంజింపజెయ్యవా?

అయ్యో! భగవంతుడా! అసలెందుకు ఇలా జరగాలి?  ఇంత అపురూపమైన, అందమైన వరాన్ని ఎందుకు ప్రసాదించాలి? దాని విలువ నేను గుర్తించేలోగానే,  నేనింకాలెక్కపెట్టుకుంటుండగానే, ఎందుకు లాగేసుకోవాలి ? లాగేసుకోవడం ఎంత దారుణం?

నీ తల్లి చేతులు నిన్ను సాకకముండే, పసికందుగానే నువ్వు మరణించి ఉంటే, ఈ బాధలేకపోను.  లేదా, ఆరోజు, నువ్వు బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు, నీతో ఆటలాడుకుంటున్న సావాసగాళ్ళు, తీవ్రంగా గాయం  చేసినపుడు పోయివుంటే, ఈ బాధని తట్టుకుని ఉండగలిగేవాడినేమో!

 కాని తల్లీ, ఇప్పుడు నా తరం కాదు. అయ్యో తల్లీ! అమ్మా!

(అతను వాయించిన గంట శబ్దానికి చాలా మంది జనం అతను చివరి మాటలు మాటాడేలోగా పోగవుతారు)

ఒక స్త్రీ: అతని బాధ చూస్తుంటే, నా గుండె తరుక్కుపోతోంది.

త్రి: ఆఖరుకి అందరూ గుమిగూడేరన్నమాట. ఇదే సరయిన సమయం.

(ఒక బండివాడి వంక తిరిగి, చెయ్యి పుచ్చుకుని)

నాయనా! నీ దగ్గర గుర్రం ఉండా?  బగ్గీకి తగిలించి ఉందా?

బండి వాడు: ఆఁ! ఉంది. (తనలో) అబ్బా! ఏమి పట్టురా నాయనా! ఉడుం పట్టు!

త్రి: అయితే ఒక పని చెయ్యి.  నా తల తెగగొయ్యి. నీ బండి చక్రాలక్రింద  నలిపెయ్యి. నా తల్లీ! బాహుదా!

ఇంకొక వ్యక్తి: ఇది ఖచ్చితంగా హత్యే! బాధకి అతనికి  స్మృతి తప్పింది. వాళ్ళిద్దర్నీ విడదియ్యడం మంచిది.

(వాళ్ళు త్రిభులను దూరంగా తీసుకుపోడానికి ప్రయత్నిస్తారు)

త్రి: వద్దు. నేనిక్కడే ఉంటాను.  ఆమె చనిపోయినా, ఆమె వంకే చూస్తూ కూర్చుంటాను.  నేను మీకేం అపకారం చేసాను? నన్నెందుకు ఇలా చూస్తున్నారు? మంచివాళ్ళు కదూ? నన్ను కనికరించండి.

(ఏడుస్తున్న స్త్రీ వంక చూస్తూ)  అయ్యో! నువ్వు ఏడుస్తున్నావా?  నీది జాలి గుండె.  దయతలచి నన్ను వదిలెయ్యమని వాళ్ళకు నువ్వైనా చెప్పు.

(ఆ స్త్రీ జోక్యం చేసుకోవడంతో, అతన్ని బాహుదా శవం దగ్గరికి పోడానికి వీలుగా విడిచిపెడతారు. అతను పిచ్చిగా పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్లమీద  వాలిపోతాడు)

ఊఁ! పడూ! మోకాళ్ల మీద పడూ! దౌర్భాగ్యుడా! ఆమెతో పాటు నువ్వుకూడా చావు!

(తల నేలకు బాదుకొనును)

స్త్రీ: శాంతంగా ఉండు! దుఃఖం ఉపశమించుకో! ఇలా మళ్ళీ ఉద్రేకంగా ప్రవర్తిస్తే, నిన్ను దూరం చెయ్యవలసి వస్తుంది.

త్రి: ( దుఃఖంతో విశృంఖలంగా ప్రవర్తిస్తాడు) వీల్లేదు. వీల్లేదు. వద్దు.

(బాహుదాను తన చేతుల్లోకి తీసుకుని అంత దుఃఖంలోనూ, ఒక్కసారి చేష్టలు దక్కి ఉంటాడు. వచ్చే పోయే స్మృతిగాప్రవర్తిస్తాడు)

అదిగో చూడండి! ఆమె మళ్ళీ ఊపిరి తీస్తోంది. ఆమెకు ఒక తండ్రి సంరక్షణ కావాలి. మీలో ఎవరో ఒకరు ఊళ్ళోకెళ్ళి  వెంటనే వైద్య సహాయం తీసుకు రండి.  అందాకా ఆమెను  నా చేతుల్లో పట్టుకుంటాను.  నేనిపుడు శాంతంగానే ఉన్నాను.

(ఆమె  తన చేతుల్లోకి ఒక తల్లి బిడ్దను ఎలా సాకుతుందో  అలా తీసుకుంటాడు)

లేదు. లేదు. ఆమె చచ్చిపోలేదు.  భగవంతుడు అలా చెయ్యడు. అతనికి తెలుసు….. ఈ భూమి మీద  నేను ప్రేమించేది ఆమెనొక్కర్తినేనని. ఈ భూమి మీద నన్ను ప్రేమించేది ఈమె ఒక్కర్తేనని కూడా అతనికి తెలుసు. 

ఈ కురూపిని అందరూ ద్వేషిస్తారు. ఈసడిస్తారు. తప్పించుకు తిరుగుతారు. ఆమె తప్ప ఇంకెవరూ కనికరం చూపలేదు. 

 నన్ను ప్రేమించింది నా కళ్ళ వెలుగు. నాకున్న ఒకే ఒక్క ఆనందం. మిగతా వాళ్లంతా నన్ను ఈసడించినపుడు, నాకోసం, నా తోటే పాపం తనూ ఏడ్చేది. 

ఎంత అందంగా ఉందో చూసేరా? కానీ, పాపం చచ్చిపోయింది.

 ఏదీ. దయచేసి మీ చెతి రుమాలొకసారి ఇవ్వండి? ఆమె నుదురొకసారి తుడవాలి.

చూసారా ఆమె పెదాలు? ఇంకా ఎంత ఎర్రగా ఉన్నాయో! నాకు బాగా గుర్తు. నాకు కనిపిస్తున్నంత స్పష్ఠంగా మీకు కూడా కనిపిస్తే బాగుండును….  ఆమెకపుడు రెండంటే రెండేళ్ళు.  అయినా జుత్తు బంగారు జలతారులా ఉండేది.

(గుండెకు హత్తుకుంటాడు)

అయితే ఏం లాభం? అన్యాయం జరిగిపోయింది. 

నా బాహుదా, నా సుఖం, నా గారాబు బిడ్డ ఎప్పుడో చిన్నప్పుడు, ఆమె “ఇంత” ఉన్నప్పుడు ఇలా గుండెకద్దుకుని, గుండెమీద జోల పాడే వాణ్ణి. 

ప్రతిరోజూ కళ్ళు తెరిచేసరికల్లా ఆ చిరునవ్వులు చిందించే కళ్ళు నన్నే చూసేవి.  ఆ చూపులు నామీద ఒక దేవత  తన కటాక్ష వీక్షణాలను ప్రసరిస్తునట్టుగా జాలువారేవి.

 ఆమె నన్నెన్నడూ, అనాకారిగా, దుష్టుడిగా, దుర్మార్గుడిగా చూడలేదు. పిచ్చి పిల్ల! నాన్నంటే దానికి ఎంత ప్రేమో!

కానీ, ఇప్పుడు నిద్రపోతోంది.

నేను ఎందుకు ఇంతసేపూ భయపడుతున్నానో నాకే అర్థం కావడంలేదు.  ఆమెకు త్వరలో మెలకువ వచ్చేస్తుంది.  ఒక్క క్షణం ఓపిక పట్టండి.  త్వరలోనే మెలకువ వచ్చేస్తుంది.

మిత్రులారా! చూస్తున్నారుగదా! నేను ప్రశాంతంగానే ఉన్నాను.  చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు చెప్పినట్టల్లా చేస్తాను.  ఎవరికీ ఏ హానీ చెయ్యను.  సరేనా! నన్ను మాత్రం నా బిడ్దను చూసుకోనివ్వండి.

(ఆమె ముఖంలోకి తేరిపార చూస్తాడు)

ఆమె కనుబొమలు ఎంత తీర్చి దిద్దినట్టున్నాయి. ఎక్కడా దుఃఖపు ఛాయ అన్నది లేదు. 

(ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ)

 అదిగో! ఆమె చెయ్యిని  నా చేతులో పెట్టుకుని వెచ్చగా రాసేను. (మిగతా జనంతో) కావలస్తే చూడండి, ఆమె నాడి కొట్టుకుంటోంది మళ్ళీ.

(ఇంతలో ఒక వైద్యుడు ప్రవేశించును)

స్త్రీ: అదిగో! డాక్టరు గారు వచ్చేరు.

త్రి: రండి డాక్టరు గారూ రండి. ఒక సారి పరీక్షించండి.  నేను మీకు అడ్డురాను.  ఆమెకి తెలివి తప్పిపోయింది. అంతే! అంతే కదూ?

డాక్టరు: (ఆమె నాడిని పరీక్షించి, నిర్లిప్తంగా పెదవి విరుస్తూ) ఆమె చనిపోయింది.

(త్రిభుల పిచ్చిపట్టిన వాడిలా లేచి నించుంటాడు. వైద్యుడు తన మానాన్న తను పరీక్ష చేస్తుంటూ ప్రేక్షకులతో ) ఆమెకు ఎడమ ప్రక్క గాయమయింది.  చాలా లోతైన గాయం. బహుశా ఊపిరి తిత్తులలోకి రక్తం  ప్రవహించి ఉంటుంది. అందుకే ఆమె ఊపిరి ఆడక చనిపోయింది.

త్రి: (బాధామయమైన ఆర్తితో ఒక్క కేక పెడతాడు)

నా బిడ్డను నేనే చంపుకున్నాను.

(తెలివి తప్పి క్రింద పడిపోతాడు).

*****        *****        *****

సమాప్తం

 (పాఠకులకు విజ్ఞప్తి: ఈ నాటకాన్ని క్రమం తప్పకుండా చదువుతున్న వారు 20 మంది దాకా ఉన్నారు. మీరు ఈ నాటకాన్ని విశ్లేషించవలసిందిగా మనవి చేస్తున్నాను)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: