రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 3 వ భాగం
పంచమాంకం దృశ్యం 3
(ఒంటరిగా త్రిభుల. అతని దృష్టి అంతా సంచీమీద కేంద్రీకృతమై ఉంటుంది.)
త్రి: అతనిక్కడ చచ్చి పడి ఉన్నాడు. నేనే గనక అతని ముఖాన్ని చూడగలిగితే ఎంతబాగుండును!
(సంచిని మరోసారి పరీక్షిస్తాడు)
సందేహం లేదు. అతనే! ఇవి అతని కాలి జోళ్ళు. వాటిని వేగిర పరచడానికి కొట్టిన నాడాలు ఇవి. అనుమానమక్కరలేదు. అతనే!)
(త్రిభుల లేచి నుంచుని ఒక కాలు సంచీమీద ఉంచుతాడు)
బుర్రతిరుగుడు ప్రపంచమా! ఇప్పుడు, ఇప్పుడు తిలకించు!
ఇక్కడ విదూషకుడు! అక్కడ మహా రాజు!
రారాజు! అసమానుడు! సర్వంసహాధికారి!
అయితేనేం. ఇప్పుడు నాపాదాక్రాంతుడు. నేనిపుడతన్ని నిర్లక్ష్యంగా అటూఇటూ తన్నగలను.
ఈ గోనిసంచీ అతని ముసుగు. ఈ నది అతని సమాధి!
ఇది సాధించినవారెవరు? నే..ను!. నే నొక్కడినే! పరమాద్భుత విజయం!
సూర్యోదయమవడమే తరవాయి. ఈ “చెంచా”ల మంద నమ్మశక్యంకాకుండా చూస్తుంది… ఈ కథని.
కానీ, రాబోయే కాలాలు, ఉదయించని రాజ్యాలు తెలుసుకుంటాయి. తెలుసుకుని భయంతో వాటి ఒళ్ళు జలదరిస్తుంది.
ఏమిటీ?
ఫ్రాన్సిస్?
సామ్రాజ్యపతీ! కాంక్షాపరితప్తా! వీరాధివీరుడైన ఛార్లెస్ కి పక్కలో బల్లెమా! యుధ్ధాధిదేవతా! నీ పదఘట్టనతో శత్రుసమూహాల్ని భయంతో గడగడలాడించినవాడా! మారినాన్ యుధ్ధ విజేతా! నీ హస్త కౌశలంతో విశృంఖలంగా తిరిగే గాలికి ఎగిరిపోయే ధూళికణాల్లా వందలకొలది సైనికుల కుత్తుకలుత్తరించినవాడా!
నీ ప్రతి చర్యా, విశాలవిశ్వంలో నక్షత్రకాంతిలా వెలుగొందిన వాడా!
పాపం! గతించేవా?
నీ తప్పుల్ని భగవంతుడికి విన్నవించుకుని క్షమాపణలు కోరుకునే అవకాశమే లేక, ఏడ్చేవాళ్ళు లేక, నిన్నుగుర్తించేవాళ్ళులేక, ఒక్క దెబ్బకు నేల రాలిపోయావా!
నీ సర్వంసహాధికారాలనుండి, నీ అహంకారం నుండి, నీ సిరిసంపదలూ, కేళీవిలాసాలూ, కాంక్షలూ, అన్నిటినుండీ, నెలలునిండకముందే పుట్టిన బిడ్డలా, ఈడ్చివేయబడి, పారవేయబడ్డావా!
గాలిలోకి కరిగిపోయి, సమసిపోయి, కలిసిపోయావా!
ఒక మెరుపులాగ, ఇలా కనిపించి, అలా మాయమయ్యేవా!
బహుశా రేపు డబ్బుకోసం, నీ శవం వెనుక రోదనలు చేసేవాళ్ళు, ముఖాలు పాలిపోయి, వణుకుతున్న కంఠాలతో, ఫ్రాన్సిస్ చనిపోయాడు! మొదటిఫ్రాన్సిస్ చనిపోయాడు! అని చెబుతారు.
ఆశ్చర్యంగా లేదూ?
(కొద్ది విరామం తర్వాత)
అమ్మా, బాహుదా! అమాయకంగా బాధతో తల్లడిల్లిన నా చిట్టి తల్లీ! నేను నీకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతీకారం చేసాను!
రక్త దాహంతో నాగొంతుక ఇంతవరకు పిడచగట్టుకుపోయింది. బంగారంతో దాన్ని చేదుకోగలిగాను. ఇప్పటికి నా దాహం తీరింది.
(ఆణుచుకోలేనికోపంతో ఆ శరీరం మీఎదకు వంగుతాడు)
ఒరే నమ్మకద్రోహీ!
నువ్వు వినగలిగితే ఎంతో బాగుండేది.
రత్నఖచితమైన నీ మకుటం కంటే విలువైన నాకూతుర్ని,
ఊపిరి పీల్చే ఏ జీవరాశికీ హాని తలపెట్టని నా కూతుర్ని,
వంచనతో నా దగ్గరనుండి దోచుకుని, ఆమె శీలాన్ని హరించి, నాకు పంపేస్తావా?
ఇప్పుడు విజయం ఎవరిది? నాది.
నువ్వు ఊహించలేనివిధంగా నిన్ను వలలోకి లాగేను.
ఉన్మత్తుడవైన నువ్వు ప్రమత్తుడవై ఉండేట్టు చెయ్యగలిగేను.
ఒక తండ్రి తనకి అయిన గాయానికి, కారణభూతుడిని క్షమించగలడేమోననేట్టు నిన్ను భ్రమింపజేసాను.
ఒక బలహీనుడు బలవంతుడితో తలపడటం కష్టసాధ్యమైన పని. కానీ, బలహీనుడే గెలిచాడు.
నీ పాదాలు ముద్దిడుకున్న వాడే, నీ గుండెలు తీసిన బంటు. వినిపిస్తోందా?
సాత్త్వికుల రారాజా!
ఒక దౌర్భాగ్యుడైన బానిస, ఒక మూర్ఖుడు, ఒక హాస్యగాడు,
“మనిషి” అనిపించుకుందికి కూడ కనీస అర్హత లేనివాడు,
నీ చేత “కుక్కా” అని ఎన్నిసార్లో అనిపించుకున్నవాడు,
వాడిప్పుడు నిన్ను కసక్కున కాటేస్తున్నాడు.
(త్రిభుల సంచిని కాలితోతన్నును)
ప్రతీకారానికి కూడా భాష ఉంటుంది. దాని గొంతు విన్నప్పుడు, ఎంత గాఢనిద్రలో ఉన్న ఆత్మ అయినా, మేల్కొనవలసిందే!
పరమ నీచులు కూడా గొప్పవారిగానో, మారిపోయినట్టుగానో కీర్తింపబడవచ్చు. కానీ, ఏదో ఒకరోజు, దోపిడీకి గురైన వాడు, ప్రతీకారపు ఒరలోంచి, తళతళలాడే కత్తిలా, తన ద్వేషాన్ని బయటకు లాగుతాడు.
పిల్లిలా మెత్తని అడుగులు వేస్తుంది- పులి.
ఒక విదూషకుడే, రాజు కుత్తుక తెగగోసేవాడవుతాడు. నేనెంత హృదయదఘ్నంగా ద్వేషిస్తున్నానో, అతనికే గనక తెలిస్తే ఎంత బాగుండును!
కానీ, ఇక చాలు.
ఓ శాపగ్రస్తుడా! ఫ్రాన్సిస్!
పోయి ఈ నదిలో విశ్వాసపాత్రమైన ఒక కెరటాన్ని వెతుక్కో! ఫో!!
ముద్ద ముద్దయిన నీ శరీరాన్ని, ప్రవాహాన్ని ఎదిరించి, నిన్ను దైవసాన్నిధ్యానికి చేర్చమని బ్రతిమాలుకో!!!
(అతను సంచిని ఒక చేత్తో తీసుకుని, ఈడ్చుకుంటూ గోడదగ్గరికి వెళతాడు. అతను పిట్టగోడ మీదకు దానిని ఎత్తబోతూ ఉండగా, మొగలి బయటకు వచ్చి, నాలుగుప్రక్కలా చూచి, రాజుని ఇక నిర్భయంగా వెళ్లవచ్చని సంజ్ఞ చేసి రెండవవైపు దారి చూపిస్తుంది.
సరిగ్గా త్రిభుల నదిలో గోనె మూటను వెయ్యబొయే సమయంలో రాజు నిర్లక్ష్యంగా పాడుకుంటూ రంగస్థలికి ఆవలి వైపు నుండి నిష్క్రమిస్తాడు)
రా: ఆటవెలది కడు నిలకడ లేనిది.
దానిప్రేమ నిత్యమనుట- నమ్ముట మూర్ఖత్వం.
త్రి: (ఒక్క సారి ఆ మూటను నేలకు జారవిడుస్తాడు)
హాఁ ! ఎవరిదా గొంతు? కొంపదీసి ఏ చీకటి జీబూతమో నాతో పరాచికాలాడటం లేదు కదా! అతను వెనక్కి తిరిగి వచ్చి ఎంతో ఆందోళనతో వినడానికి ప్రయత్నిస్తాడు. దూరం నుండి రాజు గొంతు మళ్ళీ వినిపిస్తుంది:
రా: దాని ప్రేమ డోలిక
గాలికూగు తూలిక
త్రి: అయ్యో! విధి వక్రించింది. ఇది అతని శవం కాదు. ఎవడో అతణ్ణి రక్షించాడు. నానోటిముందు కూడు కొట్టేశాడు. మోసం! మోసం!
( సుల్తాన్ ఇంటివైపు పరిగెత్తుతాడు. ఒక్క పై గది కిటికీ మాత్రమే తెరిచి ఉంటుంది)
హంతకులు!
ఈ సంచీ చాలా ఎత్తుగా ఉందే!
ఎవడీ నిర్భాగ్యుడు? వాడికి బదులు హతమైపోయిన వాడు. ఏ అమాయకపు జీవి? నా కెందుకో భయంగా ఉంది.
(శరీరాన్ని తణుముతాడు)
ఇది శవమే! కాని, చచ్చిపోయిందెవరు?
ఈ చిమ్మ చీకటిలో దానిగురించి వితర్కించడం వృధా! ఈ భయంకర నిశాకవచాన్ని ఛేదించడానికి నాకొక దీపకళిక కావాలి. ఎలా? గత్యంతరం లేదు. నేనిపుడు మెరుపులకై నిరీక్షించాలి.
సగం సంచి తెరిచిఉంచి, అతను మెరుపుల కోసం నిరీక్షిస్తుంటాడు. సగం శరీరం కనిపిస్తుంటుంది.
** ** **
సశేషం
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి