రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 1 వ భాగం
పంచమాంకం త్రిభుల
దృశ్యం 1
[సుల్తాన్ ఇంటితలుపు పూర్తిగా మూసి ఉంచడం, లోపల ఎక్కడా దీపాలు వెలగక పోవడం మినహా, రంగాలంకరణలో ఏ మార్పూ లేక రంగస్థలి నాల్గవ అంకం మాదిరిగానే ఉంటుంది.
త్రిభుల రంగస్థలి వెనుక నుండి ముసుగు కప్పుకుని ప్రవేశిస్తాడు. గాలివాన భీభత్సం తగ్గు ముఖం పడుతుంది. వర్షం కొంతసేపటిలో పూర్తిగా ఆగిపోతుంది కూడా. అయినా దూరం నుండి మెరుపులు మెరవడం కనిపిస్తూంటుంది. ఉరుములు ఇంకా ఉరుముతూనే ఉంటాయి…]
త్రి: ఇప్పుడు విజయం నాది. ఒక నెల్లాళ్ళ దుర్భరమైన బాధ తర్వాత ఇన్నాళ్ళకు దెబ్బతియ్యగలిగాను. హేళనలు, నీచమైన అపహాస్యాల మధ్య, ఈ బఫ్ఫూన్, తన నవ్వుల తెరమాటున- రక్తాన్ని చవిచూసేడు.
(ఇంటి తలుపులు పరీక్షిస్తాడు)
నేను ద్వేషిస్తున్న వాడి శవం ఈ ద్వారం గుండానే బయటకు పోతుంది. ఆహ్! ఇది నిఖార్సయిన ప్రతీకారం. ఫ్రాన్సిస్! ఇంకా పన్నెండు గంటలు కాలేదు. కానీ, అప్పుడే నీ సమాధిని సందర్శించడానికి వచ్చేసేను. ఈ రాత్రి నాకిక నిద్రపట్టదు.
(ఒక ఉరుము గట్టిగా ఉరుముతుంది)
ఆకాశంలో ఒక తుఫాను- భూమి మీద ఒక హత్య సాక్షిగా నేనిప్పుడు ఒక ఘనకార్యాన్ని సాధించేను.న్యాయమైన నా ప్రతీకారానికి, ఆగ్రహానికీ, భగవంతుని ఆగ్రహం కూడా తోడయింది. నేను ఒక రాజునే హత్య చేశాను. ఎటువంటి వాడు? అతని ఉసురు మీద 20 మంది చక్రవర్తుల సింహాసనాలు ఆధారపడి ఉన్నాయి. అతని గొంతుక గడగడలాడిందంటే, లక్షల మందికి శాంతినో, యుధ్ధాన్నో ప్రకటిస్తుంది. సగం మానవ సమాజపు నుదిటి వ్రాతను అతను శాసిస్తాడు. ఇలా రాలిపోతే, ప్రపంచం కూడా కుంచించుకు పోతుంది. అట్లాస్ అంతటి బలోపేతుడ్ని హతమార్చిన ఘనత నా…దే! నా మూలంగానే, ఈ యూరపు ఖండం అంతా అతని మృత్యువుకు శోకిస్తుంది. నేల చిట్టచివరి అంచులనుండి, భీతిల్లిన ఈ భూమి గావుకేక పెడుతుంది… త్రిభులా! శభాష్! నువ్విదంతా ఒంటి చేత్తో సాధించావు. ఆనందించు! ఊఁ ! విజయ గర్వంతో విర్ర వీగు! ఒక విదూషకుడి ప్రతీకారం యావత్ ప్రపంచాన్నే కదలించి వెయ్యాలి!
(గాలి ఉధృతంగానే ఉంటుంది. దూరం నుండి ఒక గడియారం 12 గంటలు కొడుతుంది.)
అదిగో! ఎదురు చూసిన సమయం సమీపించింది.
(త్రిభుల తలుపు దగ్గరకు పరుగెత్తుకుంటూ పోయి, తలుపు గట్టిగా కొడతాడు.)
(లోపలినుండి) : ఎవరది? తలుపు తడుతున్నది?
త్రి: నేను! తొందరగా తలుపు తియ్యి.
లోపలి గొంతు: అన్నీ అనుకున్నట్టుగ్గానే జరిగిపోయాయి. కానీ, లోపలకు రావద్దు!
(తలుపుకి ఉన్న మరో చిన్న తలుపు తెరుచుకుని- సుల్తాన్ బయటకు పాకురుకుంటూ వచ్చి- తన వెనక, చీకటిలో ఒక బస్తాను ఈడ్చుకుంటూ వస్తాడు.
** ** **
సశేషం
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి