రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 5 వ భాగం

చతుర్థాంకం   దృశ్యం 5

[రాజు నిద్రిస్తుంటూ మేడమీది గదిలో;  సుల్తాన్ మొగలి క్రింద గదిలో; బాహుదా బయట]

బాహుదా: (చీకటిలో నెమ్మదిగా  మెరుపుల ఆసరాతో నడుస్తుంటుంది.

మహా ప్రమాదకరమైన ప్రయత్నం. నాకుగాని వివేకము తప్పడం లేదు గదా! ప్రకృతికన్న బలీయమైన శక్తి ఏదో నన్ను ప్రేరేపిస్తోంది. అతను ఈ ఇంటిలోనే ఎక్కడో నిద్రిస్తుంటాడు. నాన్నా, క్షమించు! నీ ఆజ్ఞని ఉల్లంఘించి వచ్చినందుకు మన్నించు. నా హృదయాన్ని చీలుస్తున్న సందేహాన్ని అణుచుకోగల శక్తి నాకు లేదు.  ఇన్ని సంవత్సరాలూ, పూలూ, ప్రశాంతతల మధ్య పెరిగిన నేను, ఈ ప్రపంచపు కన్నీళ్ళూ, కష్టాలగురించి ఎరుగని నేను,  ఒక్కసారిగా అమాయకపుటానందం నుండి అపరాథమూ, అవమానాల మధ్యకు విసరివేయ బడ్డాను.  శీలం అనబడే మందిరాన్ని దానిలోని దీపం దగ్ధంచేస్తే, అందులోని మూర్తిని, ప్రేమే నిర్దాక్షిణ్యంగా త్రొక్కివేస్తోంది. ఇప్పుడందులో అగ్ని ఆరిపోయి, బూడిదమాత్రమే మిగిలింది.  అతను నన్ను ప్రేమించడం లేదు.  అది ఉరుముపాటువంటి మాట. అది నన్ను గాఢనిద్రలోంచి ఐనా మేల్కొలుపుతుంది. అబ్బా! ఈ రాత్రి ఎంత భయంకరంగా ఉంది! ఒకప్పుడు నీడకుకూడా భయపడే ఈ స్త్రీ హృదయాన్ని, నిస్పృహ పురికొల్పి, ఈ సాహసానికి ఒడిగట్టిస్తోంది.

(ఆమె మీద గదిలో వెలుతురు గమనిస్తుంది) అక్కడ ఏమిటి జరుగుతోంది చెప్మా! నా గుండె ఎలా కొట్టుకుంటోందో!   కొంపదీసి అతన్నిక్కడ హతమార్చరు గదా!

(ఉరుము వర్షము చప్పుడు)

సు: (లోపలనుండి) సంసారజీవితంలోని పోట్లాటల్లా, ఆకాశం గర్జిస్తోంది.  ఒకరు అరుస్తున్నారు, ఇంకొకరు భూమిని కన్నీళ్లతో ముంచెత్తుతున్నారు.

బా: మా నాన్నకు నేనిక్కడున్నానని తెలిస్తే?

మొ: (గదిలో) అన్నా!

సు: (భయపడి) ఎవరది మాటాడుతున్నది?

మొ: (బాధతో) ఎందుకన్నా?

సు: మరిప్పుడేమిటి చెయ్యడం?

మొ: నా మనసు కనిపెట్టలేవా?

సు: లేను.

మొ: పోనీ ఊహించు.

సు: నిన్ను దయ్యమెత్తుకెళ్ళ. నా తరం కాదే.

మొ: అయితే విను.  ఇంత మంచి యువకుడు, ఆజానుబాహుడు, రూపసి, పాపం మనమీద ఏమాత్రం అనుమానం లేకుండా నిద్రపోతున్నాడు… చిన్నపిల్లాడిలా. అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టు.

బా: హమ్మయ్య! భగవంతుడా!

సు: ఈ సంచీ తీసుకుని దానికున్న చిరుగులు కుట్టు.

మొ: ఎందుకూ?

సు: ఎందుకంటే, నా పదునైన కత్తి అంచు, అతనిగుండెల్లోకి మీదనుండి దిగబడిన తర్వాత, నువ్వు ఇంతసేపూ పొగుడుతున్నావే, ఆ అందమైన సూర్యబింబాన్ని, దాన్ని ఇందులోకి తోసి, ఒక బండరాయి కట్టి, నదిలోకి తోసెయ్యడానికి.

మొ: కానీ…(సణుగును)

సు: మారు మాటాడకు! పిల్లా. ఇందులో అనవసరంగా జోక్యం చేసుకోకు.

మొ: అయినా…

సు: ఊరుకుంటావా? లేదా? నీ మాటవింటే, ఎవ్వరూ, ఇంకొకర్ని పొడిచెయ్యనక్కరలేదు.  చెప్పిన మాటవిని ఆ సంచీ బాగు చెయ్యి.

బా: బాబోయ్! ఎంత భయంకరమైన జోడీ! కొంపదీసి నేను నరకంలో లేనుగదా!

మొ: సరే!  నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వుకూడా నేను చెప్పినట్టు వినాలి.

సు: ఊఁహూఁ!

మొ: ఈ కుర్రాడంటే ద్వేషంలేదు గదా, నీకు?

సు: లేదు. నిజానికి కత్తిపట్టేవాడంటే ఇష్టం.  ఎందుకంటే, నేను కత్తిని నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని.

మొ: అలాంటప్పుడు, అలాంటి, అష్టావక్రుడిలాంటి- కురూపి ఐన ఒక గూని వాడ్ని సంతృప్తి పరచడానికి ఒక అందమైన యువకుడిని ఎందుకూ హతమార్చడం?

సు: అసలు విషయమేమిటంటే,  ఆ గూనివాడే- ఈ అందమైన యువకుడిని చంపడానికి డబ్బులిచ్చేడు.  ఎవరైతే నాకేం?  పది బంగారు నాణేలు ముందు, పని పూర్తయిన తర్వాత పదీ. అంచేత అతను చావక తప్పదు.

మొ: అలాంటప్పుడు, మిగతా డబ్బులివ్వడానికి వచ్చినపుడు, ఆ గూని వాడిని నువ్వే చంపెయ్యకూడదూ? ఆ రకంగా మన పని కూడా నెరవేరుతుంది.

బా: అమ్మో! మా తండ్రినా?

సు: (కోపంతో) నీ పురాణం పూర్తయిందా? ఇక నేనెంతమాత్రం ఇలాంటి సలహాలు వినదలుచుకోలేదు.  నేను దొంగనీ, బందిపోటునీ, పీకలుత్తరించేవాడినీ అనుకున్నావా లేకపోతే మోసగాడిననుకున్నావా, నా పనికోరి వచ్చిన వాడినే చంపడానికి? థూ…

మొ: పోనీ. ఇందులో ఏదైనా ఒక కర్ర దుంగ కుక్కెయ్యకూడదూ? అతను దాన్ని శవంగా పొరబడే అవకాశం ఉంది గద!

సు: హ్హ!..హ్హ!..హ్హ!..హ్హ! నీ పాచిక గుడ్డివాడిని కూడా  మోసగించలేదే. చచ్చిపోయిన వాడి శరీరానికి “ఇదీ” అని చెప్పలేని చల్లదనముంటుందే. దాన్ని అనుకరించడం కుదరదు.

మొ: అతన్ని ప్రాణాలతో ఎలాగయినా సరే, విడిచిపెట్టు.

సు: వీల్లేదు. అతను చావాల్సిందే!

మొ: అలా అయితే అతన్ని నిద్రలోంచి లేపేస్తా! కాపాడి రక్షిస్తా!

బా: చాలా దయాళువైన పిల్ల!

సు: మరి నా ఇరవై నాణేల మాటో?

మొ: అదీ నిజమే ననుకో!

సు: అందుకే! మంచి పిల్లవు గదూ! అన్ని విషయాలూ నాకు విడిచిపెట్టు.

మొ: నేను చెబుతున్నాను, విను. అతను చావడానికి వీలు లేదు.

(మొదటి మెట్టు మీద ఏదో నిర్ణయించుకున్న దానిలా భీష్మించుకుని కూచుంటుంది. రాజు మేలుకుంటాడేమోనన్న భయంతో సుల్తాన్ ఆగుతాడు. ఈ వ్యవహారాన్ని సామరస్యంగా ఎలా పరిష్కరించడమా అని ఆలోచిస్తుంటాడు)

(రాత్రి పదకొండుగంటల సమయం అయిందని సూచిస్తూ దూరం నుండి గంటలు వినిపిస్తాయి)

సు: అయితే విను.  నన్ను నియోగించిన వ్యక్తి సరిగ్గా అర్థరాత్రికి వస్తాడు.  రాత్రి పన్నెండు గంటలు కొట్టే లోపున ఈ దారిని ఎవడైనా వచ్చి ఈ రాత్రికి మనల్ని ఆశ్రయమిమ్మనికోరితే, అతడ్ని చంపి, లుమ్మలుచుట్టిన అతని శరీరాన్ని, నీ ముద్దుల బొమ్మకు బదులుగా అతనికి మార్పిడి చేస్తాను. అతను నదిలోకి శవాన్ని ఎలాగూ తొసేస్తాడు కాబట్టి, అతనికి తేడా ఎంతమాత్రం తెలీదు.  కానీ, నీకోసం నేనింతవరకే చెయ్యగలను.  ఇంతకుమించి నావల్ల కాదు.

మొ: చాలన్నా! చాలు. కృతజ్ఞతలు. కానీ, ఇంతరాత్రపుడు, ఏ దైవోపహతుడు ఇక్కడకు వస్తాడు?

సు: అలా తప్ప, అతని ప్రాణం ఇంకెలాగూ కాపాడటానికి వీలవదు.

మొ: ఇటువంటి సమయంలోనా?

బా: అయ్యో, భగవంతుడా! నువ్వు నన్ను పురికొల్పుతున్నావు…ఒక బాస తప్పిన వ్యక్తి ప్రాణాలు రక్షించడానికి!. లాభంలేదు. నేనింకా చిన్నదాన్ని. హృదయమా! నన్ను ప్రేరేపించకు. ముందుకు తొయ్యకు.

(ఒక దొంతర ఉరుములు ఉరుముతాయి)

అయ్యో! ఏమిటీ బాధ! వెళ్ళి కాపలాదారుని కేకేద్దునా? కాని, అంతా నిశ్సబ్దంగా ఉంది. చీకటి రాజ్యం చేస్తోంది.  అదిగాక ఈ రాక్షసులు నా తండ్రి దూషిస్తున్నారు.  నాన్నా! ముసురుకుంటున్న వార్థక్యంలో,  నీ జీవిత చరమాంకంలో- నువ్వు నామీద చూపిన అభిమానానికి కృతజ్ఞతలతో, నీకు ఆసరాగా ఉండడానికి నేను బ్రతికే ఉండాలి.  నాకింకా పదహారేళ్ళే! ఇంత చిన్న వయసులో చావుకొనితెచ్చుకోవడం కష్టం. పదునైన కత్తి గుండెల్లోదిగి, కోస్తున్నప్పుడు ఆ బాధ సహించడం కష్టం. అయ్య బాబోయ్! ఈ వర్షం చినుకుల జల్లులు ఎంత చల్లగా ఉన్నాయ్! నా మనసు ఆలోచనలతో వేగిపోతుంటే, శరీరం మాత్రం చచ్చుపడిపోయింది.

(దూరం నుండి గడియారం 11.15 సూచిస్తూ ఒక గంట కొడుతుంది)

సు: అదిగో! సమయం అయిపోవచ్చింది.

(మరో రెండు సార్లు 15 ని.లకు ఒకసారిగా గంట వినిపిస్తుంది)

అదిగో, రాత్రి పదకొండు గంటల నలభై నిముషాలు అయిపోయింది. నీకేమైనా అడుగుల చప్పుడు వినిపిస్తోందా? మనపని అర్థరాత్రిలోగా అయిపోవాలి.

(అతను మొదటిమెట్టు మీద కాలు పెడతాడు)  

మొ: అన్నా!  ఒక్క క్షణం ఆగు! (ఒక్కసారి భోరున ఏడుస్తుంది)

బా: ఈ స్త్రీ ఏడుస్తోంది. అయినా సరే! నాకు అతన్ని కాపాడాలని అనిపించడం లేదు. అతను నన్ను ప్రేమించ లేదు. ఒకప్పుడు నేను చావు కోరుకోలేదూ? అదే మృత్యువు ఇప్పుడతని ప్రాణాలని రక్షించగలదు. అయినా ఎందుకో మనసు నిరాకరిస్తోంది.

సు: (మొగలిని దాటబోతూ) నేనింక ఎంతమాత్రమూ ఆగలేను.

బా: గట్టిగా ఒక్కసారి పొడుస్తాడా? నా ముఖాన్ని గాయపరుస్తాడా? లేదా లుమ్మలు చుట్టెస్తాడా? ఎలా చేస్తాడో?  ఏమిటి చేస్తాడో?నాకేగాని తెలిస్తే ఎంత బాగుండును! భగవంతుడా!

(సుల్తాన్ మొగలిని దాటడానికి ప్రయత్నిస్తాడు.బాహుదా నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చి నెమ్మదిగా తలుపు తడుతుంది)

మొ: (సంతోషంతో) అదిగో! తలుపు చప్పుడు!

సు: అది గాలికి చప్పుడవుతోంది. (బాహుదా మరోసారి తడుతుంది)

మొ: అదిగో! మరోసారి!

(ఆమె కిటికీ దగ్గరకి పరుగెత్తి- తెరిచి బయటకు చూస్తుంది)

సు: (తనలో) చాలా చిత్రంగా ఉందే!

మొ: ఎవరది? (సుల్తాన్ తో) ఎవరో ప్రయాణీకుడు.

బా: (హీనస్వరంతో) ఈ రాత్రికి పడుకోనిస్తే!

సు: (తనలో) అవును. శాశ్వతంగా పడుకోబెడతా!

మొ: (తనలో) అవును. ఇక తెల్లారదు.

బా: భగవంతుడా! వాళ్ళు కత్తులు నూరుతున్న ధ్వని నాకు వినిపిస్తోంది.

సు: ఆ కత్తి నాకు ఇలా ఇవ్వు.

మొ: ఎవడో  నిర్భాగ్యుడు. తన సమాధి తనే తడుతున్నాడు. (సుల్తాన్ తో) త్వరగా కానీ!

సు: అతను తలుపు వెనక్కి రాగానే పని పూర్తి కానిస్తాను.

మొ: (బాహుదాకు తలుపు తెరుస్తూ) లోనికి రండి!

బా: (భయంతో) నాకు ధైర్యం చాలడం లేదు.

మొ: (సగం లోపలకి ఈడ్చెస్తూ) ఇప్పటికే కాలాతీతమయిపోయింది

(బాహుదా గుమ్మం దాటగానే సుల్తాన్ ఒక పోటు పొడుస్తాడు)

              **  **  **

సశేషం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: