రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 4 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 4
[రాజు, సుల్తాన్, మొగలి]
సుల్తాన్:
[బయట ఒంటరిగా ఆకాశంలోకి చూస్తుంటాడు. మెల్లి మెల్లిగా మేఘాలు దట్టంగా కమ్ముకోవడం ప్రారంభిస్తుంటాయి. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోతుంది. మెరుపులు బాగా మెరుస్తుంటాయి. దూరాన్నుండి ఉరుములు వినిపిస్తుంటాయి]
ఇంక కాసేపట్లో ఈ ప్రదేశం శ్మశానంలా నిర్మానుష్యమైపోతుంది. ఇదొక చిత్రమైన వ్యవహారం. నాకు ఇదేమీ అర్థం కావటంలేదు. (రాజును చూపిస్తూ) మనకు తెలియనిది ఏదో ఈ మనుషులని ఆవహించి ఉంది.
(ఆకాశాన్ని మరోసారి పరీక్షిస్తాడు. ఆ సమయంలో రాజు మొగలితో సరసమాడుతూ ఆమెను కౌగిలించుకోబోతాడు]
మొ: (అతన్ని వెనక్కి తోసేస్తూ) అడుగో మా అన్న!
రా: మధురాధరీ! అయితే ఏమిటి?
[సుల్తాన్ లోపలికి ప్రవేశించి తలుపు వేస్తాడు. ఇంతలో ఒక పెద్ద ఉరుము వినిపిస్తుంది]
మొ: అమ్మో! అప్పుడే ఉరుముతోంది.
సు: వర్షంకూడా ప్రారంభమయింది. చప్పుడు విను.
రా: వర్షం పడితే పడనీ! (సుల్తాన్ భుజం మీద తడుతూ)నాకు ఈ రాత్రికి నీ బసలో గడపడమే ఇష్టం.
మొ: (అతని వంక చూసి నవ్వుతూ) అది నీకు సంతోషమా? ఆహా! ఏమి ప్రభువు! మరి మీవాళ్ళు నీకోసం బెంగెట్టుకోరా?
(రాజు ఆమె వైపు తిరగగానే, అతన్ని వెళ్ళిపోడానికి రేపెట్టవద్దని సుల్తాన్ మొగలికి సంజ్ఞ చేస్తాడు)
రా: నాకు భార్యా లేదు, పిల్లలూ లేరు. నాకు ఆ రెండూ వద్దు కూడా.
సు: ఇందులో దైవేఛ్ఛకూడా ఉంది. వర్షం ముదురుతోంది. చీకటి ఇంకా చిక్కనవుతుంది.
రా: ఒరే అబ్బాయ్! ఫో! నీకు ఎక్కడ వీలుంటే అక్కడ పడుక్కో!
సు: (వంగి) సెలవు.
మొ: (దీపం వెలిగిస్తూ, బ్రతిమాలుకుంటూ చిన్న స్వరంతో) ఊ!త్వరగా కదులు.
రా: (నవ్వుతూ, గట్టిగా) ఇంతరాత్రపుడు, నేనయితే కవి అయినవాడిని కూడా బయటకు పంపించలేను.
సు: ( మొగలిని ఒక ప్రక్కకు రెక్క పట్టుకుని తీసుకెళ్ళి బంగారు నాణేలు చూపిస్తూ) అతన్ని ఉండనీ. మంచి బంగారు నాణేలు పది దక్కాయి. పని పూర్తయితే, ఇలాంటివి మరో పది దక్కుతాయి. (రాజుతో) ప్రభూ! ఈ పేదవాడి కుటీరాన్ని ఈ రాత్రికి తమ సేవలో వినియోగించగలుగుతున్నందుకు నాకు గర్వంగా ఉంది.
రా: ఇది ఇల్లా? వేసవిలో మంగలంలో వేయించినట్టు వేయించి, డిశంబరు చలిలో నరాల్ని గడ్డకట్టించే … భూగృహం.
సు: ప్రభువులు ఈ గృహాన్ని పూర్తిగా చూడదలుచుకుంటే, సెలవా మరి?
రా: అలాగే కానీ!నువ్వు ముందు దారి తియ్యి. ( సుల్తాన్ దీపం తీసుకుంటాడు. రాజు మొగలి దగ్గరకుపోయి చెవిలో ఏదో గుసగుసలాడతాడు. సుల్తాన్ ముందు నడుస్తుండగా, రాజు ఆ సన్నని మెట్లెక్కి డాబామీదకి చేరుకుంటాడు.
మొ: (బయటకు చూస్తూ) అయ్యో పాపం, కుర్రాడు! బయట ఎంత చీకటిగా ఉందో!
(మీద గది కిటికీలోనుండి రాజు సుల్తాన్ కనిపిస్తుంటారు)
సు: ఇక్కడ ఒక మంచమూ, మేజాబల్ల, కుర్చీ ఉన్నాయి.
రా: (మంచాన్ని కొలుస్తూ) మూడు, ఆరు, తొమ్మిది. మిత్రమా! నీ ఫర్నిచరు అంతా మేరీనాన్ లో కొన్నట్టు కనిపిస్తోంది. అక్కడే నరికి, కోయించి, తయారు చేసినట్టు కనిపిస్తోంది. (కిటికీ తలుపును పరీక్షిస్తాడు. దానికి అద్దాలు ఉండవు)
అలా ఆరుబయట పడుక్కుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది! గాజుతలుపుల బాధ ఉండదు. తెరల బాధ ఉండదు. పిల్లగాలి శరీరాన్ని ఇంత సుకుమారంగా ఇక్కడతప్ప ఇంకెక్కడా తాకదు. సరే! పోయిరా! నే పడుక్కుంటాను.
సు: (మెట్లు దిగుతూ) ప్రభువులను భగవంతుడు రక్షించుగాక!
రా: నేను బాగా అలసిపోయాను. కాసేపు మేను వాల్చవలసిందే!
(తన కత్తినీ, టోపీనీ తీసి మేజాబల్లపై ఉంచుతాడు. కాలికున్న బూట్లు విప్పి మంచంపై వాలిపోతాడు.)
ఎంత అందమైన పిల్ల ఈ మొగలి! ఎంత హుషారు! ఎంత తాజాగా పరువంలో ఉంది! ఈ తలుపు వేసుకుని లేదనే భావిస్తాను.
(ఒకసారి లేచి పరీక్షిస్తాడు) అనుకున్నట్టుగానే ఉంది.
(మళ్ళీ ప్రక్కమీదకి వాలి తొందరలోనే నిద్రలోకి జారిపోతాడు)
మొగలి, సుల్తాన్ క్రింద కూర్చుని ఉంటారు. గాలివాన ముదురుతుంది. ఉరుములూ, మెరుపులతో ఆగకుండా వర్షం కురుస్తుంటుంది. సూదీ దారం తెచ్చుకుని ఏదో కుట్టుకుంటూ కూర్చుంటుంది మొగలి. ప్రపంచం ఏమీ పట్టనట్టు, సుల్తాన్ రాజు తాగగా మిగిలిన సారా నెమ్మదిగా తాగుతుంటాడు. ఇద్దరూ ఏవో ఆలోచనల్లో ములిగిపోతారు.
(చాలా విరామం తర్వాత)
మొ: నా మట్టుకు ఆ కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.
సు: నేనూ అలానే అనుకుంటున్నాను. అతను నా పర్సు ఇరవై బంగారు నాణేలతో నింపబోతున్నాడు.
మొ: (ఆశ్చర్యంగా) ఎన్ని?
సు: ఇరవై.
మొ: ఓస్, అంతేనా? అతని విలువ చాలా ఎక్కువ ఉంటుంది.
సు: పిల్లా! మేడమీదకెళ్ళి పడుక్కున్నాడో లేదో చూడు. పడుక్కుంటే ఆ కత్తి మెల్లిగా కిందికి తీసుకు వచ్చెయ్.
(మొగలి అతను చెప్పినట్టు మేడమీదకు వెళ్తుంది. వర్షం భీభత్సంగా మారుతుంది. ఆ సమయంలో బాహుదా రంగస్థలి వెనుకనుండి- మగవాడివేషంలో, నల్లని గుర్రపుస్వారీ దుస్తుల్లో, కాలికి బూట్లు వేసుకుని వస్తుంది. ఆమె గోడకున్న ఖాళీజాగా దగ్గరికి చేరుకుంటుంది. సుల్తాన్ ఇంకా తాగుతూ ఉంటాడు. మొగలి చేతిలోని దీపంతో రాజు ముఖం మీదకి వంగి నిద్రపోతున్నాడో, లేదోనని చూస్తుంది)
మొ: (కత్తి తీసుకుని) పాపం కుర్రాడు! నిద్రపోతున్నాడు
(కత్తి పట్టుకుని నెమ్మదిగా సుల్తాన్ దగ్గరికి వచ్చేస్తుంది)
** ** **
సశేషం
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి