రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 3 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 3
[త్రిభుల, సుల్తాన్ బయట; రాజు మొగలి లోపల]
త్రి: (బంగారు నాణేలు సుల్తాన్ కి ఒక్కొక్కటీ లెక్కబెడుతూ) నువ్వు ఇరవై అడిగేవు. ప్రస్తుతానికి ఇవిగో పది. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడంటావా? (నాణేలు ఇవ్వబోతూ ఆగిపోతాడు)
సు: (ఆకాశాన్ని పరీక్షిస్తూ) మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇంకో గంటలో గాలీ వానా వచ్చి అతన్ని ఈ రాత్రికి ఇక్కడే ఉంచేటట్టయితే, మా మొగలికి అవి సహాయం చేస్తాయి.
త్రి: అలా అయితే నేను అర్థరాత్రికి వస్తాను.
సు: ఆ శ్రమ మీకు అక్కరలేదు. భగవంతుడి దయవల్ల ఒక శవాన్ని ఎవరిసహాయం అక్కరలేకుండా అదిగో, కనిపిస్తోందే, ఆ నదిలోకి విసరగల శక్తి నాకుంది.
త్రి: ఆ భాగ్యం నాకు కలగాలి. నా చేతుల్తో నేనే చెయ్యాలి.
సు: అలాగయితే మీ ఇష్టం. దానితో నాకేం సంబంధం లేదు. అసలా ఊసే నాకక్కరలేదు. ఈ రాత్రికే మీ మనిషి మీకు మూటగట్టిమరీ అప్పచెప్పబడతాడు.
త్రి: (అతనికి బంగారు నాణేలు ఇస్తాడు) అయితేసరే! అర్థ రాత్రికి…వస్తా. కొరదా డబ్బులు అప్పుడిస్తా.
సు: మీ పని పూర్తి చేస్తాను. ఇంతకీ, ఆ కుర్రాడి పేరేమిటి?
త్రి: అతని పేరు తెలుసుకోవాలనుందా? అయితే అతనిపేరుతో పాటు నా పేరు కూడ తెలుసుకో! నా పేరు శీలం. అతని పేరు ఆశ్లీలం.
స్పందించండి