రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 2 వ భాగం

చతుర్థాంకం   దృశ్యం 2

[ బాహుదా- త్రిభుల బయట; సుల్తాన్, మొగలి, రాజు లోపల.]

రాజు: (సుల్తాన్ భుజంపై పరిచయస్తుడిలా చెయ్యి వేసి తడుతూ) “చుక్క”లు రెండూ ఒక్కసారే- నీ సోదరీ, ఆ చుక్కా.

త్రి: (తనలో) దేముడి అనుగ్రహం వలన రాజయి, తనమీద ఏ నిఘా లేదని తెలిసి, నీచ సాంగత్యంకోసం నీతి నియమాల్ని బలిచేస్తున్నాడు. కేవలం, ఒక రాదారి విడిది నడుపుకునే వాడు పోసే మద్యం, పాలకులని సైతం సేవకులుగా మార్చే మద్యం, కోరుకుంటున్నాడు.

రా: (పాడును)

ఆటవెలది, కడునిలకడలేనిది
దానిప్రేమ నిత్యమనుట, నమ్ముట మూర్ఖత్వం.
దానిప్రేమ డోలిక
గాలికూగు తూలిక

(సుల్తాన్ ప్రక్క గదిలోకి నిరాసక్తంగా వెళతాడు.  ఒక గాజుసీసాతో సారా తెచ్చి మేజాపై ఉంచుతాడు. తనచేతిలోని పొడవాటికత్తి పిడిని రెండు సార్లు సంకేతంగా కొడతాడు. దేశద్రిమ్మరి (జిప్సీ) వేషంలో, ఒక మిసిమి వయసులోని పిల్ల – మెట్లుదిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. రాజు ఆమెను తనచేతులలోకి తీసుకో ప్రయత్నించగా, ఆమె తప్పించుకుంటుంది. సుల్తాన్ తన పటకా శుభ్రం చేసుకుంటూ ఉంటాడు.)

రా: మిత్రమా! నీ పటకా ఆరుబయట తుడుచుకున్నావంటే, ఇంకా ధగ ధగ  మెరుస్తుంది.

సుల్తాన్: (నీరసంగా) అర్థమయింది.

(అతను లేచి, రాజుకు అస్తవ్యస్తంగా ఒక నమస్కారం చేసి, తలుపు తెరుచుకుని బయటకు వస్తాడు.  త్రిభులను చూసి  అతనిని జాగ్రత్తగా సమీపిస్తాడు.  బాహుదా రాజుచుట్టూ నృత్యంచేస్తున్న ఆపిల్లను తప్ప ఇంకేమీ పట్టించుకోదు)

సుల్తాన్: (సన్నని స్వరంతో) ఇప్పుడతన్ని మట్టుపెట్టమని సెలవా?

త్రి: అప్పుడే కాదు. కాస్సేపు పోయిన తర్వాత రా!

(త్రిభుల అతన్ని వెళ్ళిపొమ్మని సంజ్ఞ చేస్తాడు. సుల్తాన్ పిట్టగోడ వెనుకకు అదృశ్యమైపోతాడు. ఇంతలో రాజు జిప్సీతో ప్రేమకలాపం సాగించడానికి ప్రయత్నిస్తుంటాడు)

మొగలి: (తప్పించుకుంటూ) ఉహూ! ఉహూ! ఇప్పుడుకాదు.

రా: నువ్వు చాలా కట్టడిచేస్తున్నావు, ఇలా రా! సంధిచేసుకుందాం. (ఆ పిల్ల దగ్గిరగా వస్తుంది) వారం రోజుల క్రిందట- “ట్రయం కోర్ట్” హోటల్ దగ్గర – ఎవరు చెప్మా నన్నక్కడకు తీసుకెళ్ళింది? హా! త్రిభుల! త్రిభులే . ఈ అందమైన ముఖాన్ని నేనక్కడే మొదటిసారి చూసాను. ఒక్క వారం రోజులే! ఓ దేవీ! నిన్నునేను ప్రేమిస్తున్నాను! నిన్ను ప్రేమిస్తున్నా!

మొ: అవును. ఆ మరో ఇరవైమందినీ కాక. నువ్వొక ఘటికుడైన విటుడిలాగ కనిపిస్తున్నావు.

రా: సరే! సరే! నాకోసం కొన్ని హృదయాలు తపించేయి. అది నిజం  అని ఒప్పుకుంటున్నాను.  నేను వింత మృగాన్నే!

మొ: కాదు. ఒక అడ్డగాడిద.

రా: పోనీ అలానే అనుకో!కానీ, ఓ కామినీ, నీ అందమే నన్నిక్కడకు లాక్కొచ్చింది.  ఈ భరించలేని భోజనాన్నీ, కషాయం లాంటి ఈ మదిరనీ తాగడానికి కావలసిన  సహనాన్నీ, సాహసాన్నీ ఇచ్చింది.  మీ సోదరుడి తీవ్రమైన చూపులు వాటిని మరింత చేదుగా చేశాయి. సరసం తెలియని వెధవ! ఇంత చక్కని మధురాధరాల సమీపంలో, కట్టి పడేసే కనుల సమీపంలో నేనుండగా, తనిక్కడ తచ్చాడడానికి వాడికి ఎంత గుండె ధైర్యం? సరే కానియ్యి! ఈ రాత్రికి ఇక్కడే గడిపేస్తాను.

మొ: (తనలో) వలలో చిక్కుకుంటున్నాడు. (ఆమెను కౌగిలించుకోబోయే ప్రయత్నం చేస్తున్న రాజుతో) క్షమించండి!

రా: ఎందుకీ ప్రతిఘటన?

మొ: కాస్త తెలివి కలిగి ప్రవర్తించండి.

రా: ఇంతకంటే తెలివైన పని ఏమిటుంటుంది?  తిను-త్రాగు- ప్రేమించు- అన్న సాలమన్ వాక్యాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

మొ: మీకు చర్చి కంటే రాదారి విడుదులంటేనే మక్కువ ఎక్కువనుకుంటాను?

రా: (ఆమెకోసం చేతులు చాచుతూ) ఓ ప్రియమైన మొగలీ!

మొ: (మేజాబల్ల  వెనక్కి చేరి) రేపు!

రా: (మేజాబల్లని రెండుచేతులతో పట్టుకుంటూ) ఏదీ? మళ్ళీ అను చూద్దాం? రేపు అనే జుగుప్సాకరమైన మాట మళ్ళీ అన్నావంటే, ఈ మేజాబల్లని తిరగేస్తాను.  నీలాంటి చిలకలకొలికి రేపు అన్న మాటను పలకకూడదు.

మొ: (హఠాత్తుగా వచ్చి రాజు సరసన కూర్ఛుంటుంది) సరే! అయితే మనం జత కడదాం.

రా: (ఆమెచేతిని తన చేతిలోకి తీసుకుంటూ) ఆహా! ఎంత సుకుమారమైన హస్తం!  లేతగా, మృదువుగా  ఉంది.  మతం మీద అతి విశ్వాసం- ఛాందసం అనుకోకపోతే- ఈ చేత్తో ఒక చెంపదెబ్బ తింటే, రెండోచెంపకూడ చాచాలనిపిస్తుంది.

మొ: (ఆనందంతో) అదిగో! మీరు నాతో పరాచికాలాడుతున్నారు?

రా: ఎన్నటికీ కాదు.

మొ: మరయితే, నేను అందంగా ఉండనుగా?

రా: అలాంటి మాటలు అని నీకు అన్యాయమూ, నాకు అవమానమూ చెయ్యకు. స్వాధీన హృదయా! నీకు తెలియదా?  ఒక సైనికుడి మనసుని నియంత ఎలా శాసించగలుగుతాడో. “ఒక అందమైన చిన్నది మనప్రేమని అంగీకరించే పక్షంలో రష్యాలోని హిమశీకరాలమధ్యనైనా ప్రేమ మనల్ని దహించివేస్తుంది”

మొ: (నవ్వుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ) ఈ మాటలు తప్పకుండా నువ్వు ఏదో పుస్తకంలోంచి బట్టీ పట్టే ఉంటావు.

రా: (తనలో) కావచ్చు. (బయటకి) రా. నన్ను ముద్దుపెట్టుకో!

మొ: పద, పద! నువ్వు తప్ప తాగి ఉన్నావు.

రా: అవును. నీ మీద ప్రేమతో! నీ ప్రేమనే!

మొ: నాకు తెలుసు నువ్వు ఆటపట్టిస్తున్నావు గానీ. నీ తెలివితేటలన్నీ  నాలాంటి ఒక తెలివితక్కువ పిల్ల మీద ప్రయోగించడానికే!

(రాజు ఒకసారి ఆమెను ముద్దుపెట్టుకోవడంలో సఫలీకృతుడౌతాడు. రెండవసారి ప్రయత్నించగా, ఆమె నిరాకరిస్తుంది) ఇక చాలు!

రా: నేను నిన్ను పెళ్ళిచేసుకుంటాను.

మొ: (నవ్వుతూ) ఒట్టా?

(రాజు నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చెయ్యివేసి చెవిలో ఏదో గుసగుసలాడుతాడు… బాహుదా ఇంక భరించలేక తల త్రిప్పుకుని తండ్రివైపు చూస్తుంది)

త్రి: (ఆమె వాలకాన్ని కొంతసేపు నిశ్శబ్దంగా ఎగా దిగా పరిశీలించిన తర్వాత) పిచ్చి తల్లీ! ఇప్పుడు చెప్పు. ప్రతీకారం మాట ఏమంటావో?

బా: మోసం! దగా! అయ్యో! నా గుండె బద్దలయ్యేట్టుంది. అతనికి మనసుగాని, జాలి, దయ అన్నవిగాని మచ్చుకికూడలేవు. అతన్ని ఏమాత్రం ప్రేమించని ఆ పిల్లతో సైతం, ప్రేమపూర్వకంగా నాతో ఏ మాటలైతే  అన్నాడో, అవే మాటలంటున్నాడు.

(తనముఖాన్ని తండ్రి గుండెల్లో దాచుకొనును)

అబ్బా! సిగ్గుమాలిన మనిషి!

త్రి: హుష్! ఇకచాలు. వదలిన కన్నీళ్ళు చాలు. ప్రతీకారం విషయం నాకు ఒదిలేయ్.

బా: నీకు ఎలా తోస్తే అలా చెయ్యి.

త్రి: మంచిది.

బా: కానీ, నాన్నా! నీ చూపులు గమనిస్తుంటే, ఏదో భయం వేస్తోంది. ఏం చేస్తావేమిటి?

త్రి: దయచేసి ఆ విషయం మాత్రం నన్ను అడక్కు.  అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోయాయి.  ఇక ఇంటికి వెళ్ళమ్మా! అక్కడ నువ్వు వెంటనే ఆశ్వికుడిగా వేషం మార్చుకుని, ఒక మంచి గుర్రాన్నధిరోహించి, ‘పర్సు ‘ నిండా బంగారు నాణేలు నింపుకుని, దారిలో ఎక్కడా ఆగకుండా, ‘ఎవరూజ్’ పారిపో! రేపు సాయంత్రానికల్లా నేను నిన్ను కలుసుకుంటాను.  మీ అమ్మ చిత్తరువు వెనక ఒక నిక్షేపం ఉంది. నీకు బాగా తెలుసు.  అక్కడే, నీ అశ్వికుడి వేషానికి అవసరమైన ఆహార్యాన్ని దాచి ఉంఛేను.  గుర్రం కూడా కళ్ళెం తగిలింఛి తయారుగా ఉంటుంది.  నేను చెప్పినట్టుగాచెయ్యి.  ఇక్కడికి మాత్రం తిరిగి రాకు. ఇక్కడ కొద్దిసేపట్లో ఒక ఘోరం జరగబోతోంది. వెళ్లమ్మా! వెళ్ళు!

బా: నాన్నా! అయితే నువ్వు నాతో రావడం లేదా?

త్రి: సాధ్యం కాదు, తల్లీ!

బా: (తనలో) ఏదో చెప్పలేని వికారంగా ఉంది. నా మనసుని నీరసం ఆవహిస్తోంది.

త్రి: ఉంటాను మరి. గుర్తుంచుకో బాహుదా! నేచెప్పినట్టే చెయ్యి.

(బాహుదా నిష్క్రమించును)

( ఈ దృశ్యం జరుగుతున్నంత సేపూ, రాజూ, మొగలి నవ్వుతూ, సన్నని గొంతుకతో ఏదో మాట్లాడుకుంటుంటారు.  బాహుదా వెళ్ళిన తక్షణం, త్రిభుల పిట్టగోడదగ్గరికి పోయి, సుల్తాన్ కి సంజ్ఞ చేస్తాడు.  అతను గోడ వెనుక నుండి ముందుకి వచ్చును.  చీకటి చిక్కబడి రాత్రవుతుండగా, రంగస్థలి కూడ చీకటిగా మారుతుంది.)

**  **  **

సశేషం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: