రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 1 వ భాగం
చతుర్థాంకం బాహుదా
దృశ్యం 1
నగర ప్రథాన ద్వారం. అతి ప్రాచీనద్వారం. దానిప్రక్కగా ఒక పాడుబడ్డ ధాన్య నిల్వచేసుకునే గిడ్డంగి. దాని అవతారం చూడగానే అది చవుకబారు మనుషుల విలాస గృహం అని అర్థం అవుతుంది. ఆ ఇంటిముఖద్వారం ప్రేక్షకులవైపు తెరిచి ఉంటుంది. లోపల చాలా సాదా సీదాగా- ఒక మేజాబల్ల- గోడలోకి చలికాచుకునేందుకు పొయ్యి- డాబామీదకో, డాబామీది గదిలోనికో వెళ్ళేందుకు సన్నని మెట్ల వరుస. పైనున్న గదిలో కిటికీలోంచి కనిపిస్తున్న మంచం. మంచానికి కుడిప్రక్కగా లోపలకి తెరుచుకున్న తలుపు. వీధి గోడ బాగా పాడుబడి ఉన్నచోట ఉండి, లేనిచోట లేక ఉంటుంది. ఉన్నచోట కంతలతో, చిన్న చిన్న మొక్కలతో, పొదలతో నిండి ఉంటుంది. లోపలజరుగుతున్నదంతా వీధిలో నడుచుకుంటూపోయే వాళ్ళందరికీ కనిపిస్తూనే ఉంటుంది. గిడ్డంగి పాడుబడ్డ ఎడమగోడనానుకుని ఒక పిట్టగోడ ఉన్న డాబా, దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదీ, నది మీదుగా దూరంగా నగరమూ కనిపిస్తుంటాయి.
త్రిభుల బాహుదా బయట; సుల్తాన్ లోపల ఉంటారు. ఈ దృశ్యం జరుగుతున్నంతసేపూ, త్రిభుల ఆదుర్దాగా, ఆందోళనగా కనిపిస్తాడు. సుల్తాన్ లోపల మేజాబల్ల దగ్గర తన పటకా తుడుచుకుంటూ బయట ఏమిజరుగుతోందో పట్టించుకోకుండా ఉంటాడు]
త్రి: అయితే, నువ్వతన్ని ఇంకా ప్రేమిస్తున్నావా?
బా: నిరంతరం.
త్రి: నేను నీకు ఈ అర్థంలేని కలని ఇంతసేపూ,విడమరిచి చెప్పినప్పటికీనా?
బా: అయినా నేనతన్ని ప్రేమిస్తున్నాను.
త్రి: ఆహా! ఏమి ఈ స్త్రీ హృదయం! పోనీ బాహుదా! ఇంతకీ అతన్ని ఎందుకు ప్రేమిస్తున్నావో కారణాలు వివరించగలవా?
బా: నాకు తెలీదు.
త్రి: చాల వింతగా ఉంది. నమ్మశక్యం కావటం లేదు!
బా: ఏం కాదు. బహుశా నేనందుకే అతన్ని ప్రేమిస్తున్నానేమో! ఉదాహరణకి మనకోసం ఒక వ్యక్తి ప్రాణాలకు తెగిస్తాడనుకుందాం. లేదా, ఒక భర్త ధనం-హోదా- కీర్తీ తెచ్చిపెడతాడనుకుందాం. అంతమాత్రంచేత స్త్రీలు భర్తని ప్రేమిస్తారా? నాకుతెలుసు. అతనివల్ల నాకు మిగిలింది అవమానం, అపకీర్తీ అని. అయినాసరే! ఎందుకో నాకే తెలీదు. అతన్ని నేను ప్రేమిస్తున్నా! అతనితో ముడిపడినదేదీ నా మనోఫలకం మీదినుంచి చెరిగిపోదు. ఇది పిచ్చి అని నాకు తెలుసు. నాన్నా! ఇలా అంటున్నందుకు నువ్వు నన్ను క్షమించగలవా? అతను నాకు అన్యాయం చేసినా, నువ్వు నాకు ఎప్పుడూ మంచే చేసినా, నీకోసం ఎలాగో, అతనికోసం కూడా అలాగే ప్రాణత్యాగం చెయ్యగలను.
త్రి: నిన్ను నేను క్షమిస్తున్నాను.
బా: అలాగయితే అతను నన్నుకూడా ప్రేమిస్తాడు.
త్రి: పొరబడుతున్నావు. అదెన్నటికీ జరగదు.
బా: అతను నాకు మాట ఇచ్చాడు. తనప్రేమ నాకే అంకితమని ప్రమాణం చేసి మరీ చెప్పాడు. అతను చెప్పే ప్రేమ మాటలు ఎంత హృదయ పూర్వకంగా, నిజాయితీగా చెబుతాడంటే, ఏ స్త్రీ హృదయమూ వాటివెనుక ఉన్న సత్యాన్ని శంకించలేదు. ఆ మాటలూ, చూపులూ, ఆర్ద్రంగానూ, రసనిష్యందంగానూ ఉంటాయి. అసలు రాజు అంటే అతనే! అంత అందగాడు. ధీరోదాత్తుడూ…
త్రి: అతను రసహీనుడు. ఒట్టు తీసి గట్టుమీదపెట్టగల మోసగాడు. అలుపెరుగని స్త్రీలోలుడు. అతను నా ప్రతీకారం నుండి తప్పించుకోలేడు.
బా: మా మంచి నాన్నవుకదూ. నువ్వు ఒక్కసారి అతణ్ణి క్షమించవూ?
త్రి: అతని క్రూరత్వానికి తగిన మాయోపాయం పన్నేవరకూ, ఎదురుదెబ్బ తీయడానికి సాహసించలేకపోయాను.
బా: నాకు చెప్పడానికే భయమేస్తోంది. మరి క్రిందటి నెలల్లా రాజుగారిని ప్రేమిస్తున్నట్టే ఉన్నావు.
త్రి: అలా నటించాను. నీకు జరిగిన దానికి తగిన ప్రతీకారం తీసుకుంటాను.
బా: నాన్నా! నీ బిడ్డకోసమైనా అతన్ని విడిచిపెట్టు.
త్రి: నీ తెలివితక్కువ దురభిమానం, ఒకసారి నిన్ను మోసంచేస్తే, ఓప లేని ద్వేషంగా మారిపోతుంది.
బా: అతనలాంటివాడు కాదు. ఎన్నటికీ అలా జరగదు. నేన్నమ్మను.
త్రి: కన్నీళ్ళతో అతన్ని మన్నించమని వేడుకున్న ఈ కళ్ళతోటే, అతని నమ్మకద్రోహాన్ని కూడా చూస్తే, అప్పుడుకూడా ఇంకా ప్రేమిస్తూనే ఉంటావా అతన్ని?
బా: నాకు తెలీదు. నన్ను ప్రేమిస్తున్నాడు. కాదు. ఆరాధిస్తున్నాడు. అలా అని నిన్న రాత్రి నాతో అన్నాడు.
త్రి: (మధ్యలో త్రుంచుతూ, వెక్కిరింతగా) ఏ వేళప్పుడుటా?
బా: సుమారు ఇదే వేళప్పుడు.
త్రి: అయితే విను. చూడు. చాతనయితే క్షమించు. (అతను ఆమెను లోనకు తీసుకెళ్తాడు. గోడకున్న కంతలలోనుండి చూడమని చెబుతాడు. అందులోంచి, లోపల జరుగుతున్న దంతా కనిపిస్తూంటుంది.)
బా: నా కెవడో మనిషి కనిపిస్తున్నాడు. అంతే!
త్రి: సరే! ఇప్పుడు చూడు.
(లోపల నున్న ఇంకో గదిలోనుండి, అధికార వేషంలో ఉన్న రాజు వస్తాడు)
బా: (ఆశ్చర్యంతో) నాన్నా!
(ఈ తర్వాత దృశ్యం జరుగుతున్నంత సేపూ, బాహుదా, శిలా విగ్రహం లా, కదలకుండా, మెదలకుండా, గోడకున్న ఖాళీ జాగాలో ఇమిడిపోయి ఉంటుంది. ఉండుండి ఒక్కసారి, గగుర్పాటు కనబరుస్తూ, ఇంకేమీ పట్టించుకోకుండా, అసహనంగా ఉంటుంది)
** ** **
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి