రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 4 వ భాగం
తృతీయాంకం దృశ్యం 4
బాహుదా- త్రిభుల
త్రి: (విచారంతోనూ, తీవ్ర స్వరంతోనూ) ఊ! ఇక చెప్పు!
బా: (అవనత శిరస్కురాలై- మధ్య మధ్య వెక్కిళ్ళతో) నాన్నా! నిన్న రాత్రే.. మొదటిసారిగా… అతను మన ఇంటిలోకి ప్రవేశించాడు. ( ఆమె ముఖం చేతుల్లో దాచుకుంటూ) చెప్పలేను!
(త్రిభుల ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా తలనిమిరి, నుదుటిమీద ముద్దు పెట్టుకొనును)
బా: కాని చాలా కాలం నుండి…. నీకీ విషయం ఎప్పుడో చెప్పి ఉండవలసింది…. నన్ను వెంటాడుతున్నాడు. కాని ఎన్నడూ మాటాడలేదు. కాని ఆదివారం వచ్చిందంటే చాలు, చర్చిలో ప్రత్యక్షం.
త్రి: (తీవ్ర స్వరంతో) ఎవరు? రాజా?
బా: మొన్న ఆదివారం- నా దగ్గరగా వచ్చి కుర్చీ కదిపేడు, నేను మాట్లాడతానేమోనని! నిన్న రాత్రి ప్రవేశం సంపాదించేడు.
త్రి: ఇక చాలు! నువ్వింకేమీ చెప్పనక్కరలేదు! సిగ్గువిడిచి నువ్వు విడమరచి చెప్పవలసిన బాధ నీకు తప్పిస్తాను. మిగిలింది నేనూహించుకోగలను.
(ఒక్కసారి నిటారుగా నిల్చొనును)
ఓహ్! ఎంత తీవ్ర మైన బాధ! నీ నుదిటిమీద స్వఛ్ఛంగా మెరిసే కన్యాత్వపు పూలమాలని, రోత పుట్టించే అతని స్పర్శతో నలిపివేశాడన్నమాట!
దానికిబదులుగా లజ్జాకరమైన అవమానాన్ని రాసిపెట్టేడు.
ఒకప్పుడు నిన్నుఆవరించి ఉన్న స్వఛ్ఛతావాయువుల్ని అతని ఊపిరితో కలుషితం చేసేడు!
ఓహ్! బాహుదా! నా చిట్టితల్లీ! నా దౌర్భాగ్యపు జీవితానికి ఒకప్పుడు మిగిలిన ఏకైక ఆసరా!
బాధల రాత్రులనుండి మేల్కొనే ఉషోదయం- నా ఆనందపుటాలోచనలకు మిగిలిన ఆధారం!
నా అవమానాల్ని దాచే ఒక కాంతి తెర.
అందరిచే ఛీదరించబడినవాడికి స్వర్గ ధామం-
నా కన్నీళ్ళను తుడవటానికి భగవంతుడు అనుగ్రహించిన దేవత.
నేను నమ్మిన ఒకే ఒక్క పవిత్ర వస్తువు.
ఇప్పుడు నాగతి ఏమిటి?
వ్యభిచారం- అపకీర్తి- అవలక్షణాలూ నిర్లజ్జగా, నిర్భీతిగా, విశృంఖలంగా రాజ్యం చేస్తున్న ఇక్కడ, ఈ శూన్య సౌధం మధ్యలో, ఈ నేరాలు చూసి చూసి, అలసిపోయిన కన్నులు కల్లాకపటమెరుగని నీ మూర్తిని చూడటానికి పరుగెత్తేవి. అప్పుడు నేను విధివ్రాతనీ, నా హేయమైన బ్రతుకునీ, కన్నీళ్ళనీ, బ్రద్దలౌతున్న నా గుండెలో బలీయమవుతూవచ్చిన గర్వాన్నీ, నా బాధల్ని ఇంకా బాధామయంచేసేవాళ్ళ వ్యంగ్యబాణాలనీ, అవును, అన్నిరకాల బాధలూ, అవమానాల గీతికల్నీ సహించుకోగలిగేవాడిని!
కాని తల్లీ, నీ తప్పుల్ని భరించగల శక్తి నాకు లేదు. నిజం! నీ ముఖం చాటుచేసుకుని ఏడ్చుకో! నువ్వింకా చిన్నపిల్లవేగనుక, నీ కన్నీటిద్వారా కొంత దుఃఖం బయటకిపోవచ్చు. ఈ తండ్రిగుండెల్లోకి ఎంత దుఃఖాన్ని ఒంపగలిగితే అంతా ఒంపేయ్!
(శూన్యంలోకి చూస్తూ)
కాని ఇప్పటికి చాలు! నేను తప్పించుకోగలిగితే, విషయం చక్క బెట్టిన తర్వాత మనం ఈ నగరం విడిచి పారిపోదాం.
(రెట్టించినకోపంతో రాజమందిరం వైపు తిరిగి)
ఒరేయ్, ఫ్రాన్సిస్! నా ప్రార్థనను ఆలకిస్తున్న ఆ భగవంతుడు, నీ మార్గంలో మృత్యు గహ్వరాన్ని తెరుస్తున్నాడు. అందులో నువ్వు
నీ పాపాలతో సహా, శోకించేవాళ్ళులేకుండా, పశ్ఛాత్తాపానికి అవకాశంలేకుండా, జారిపడిపోతావు!
బా: (తనలో) భగవంతుడా! ఆ పని మాత్రం చెయ్యకు! అతనంటే నాకింకా అభిమానం చావలేదు!
(బయట పెన్న మాట్లాడుతుంటాడు)
పెన్న: మధునిషా! దుర్గాన్ని జాగ్రత్తగా కాపలా కాయండి! ఇప్పుడు వేలరీ మీ బందీ!
(వేలరీ, మధునిషా, సైనికులు ప్రవేశం)
వేలరీ: భగవంతుడు శిక్షించనూ లేదు, ఈ రాజుకి నేనిచ్చిన శాపం తగలనూ లేదు.
కనుక, పీకలోతుగా నేరాలలో మునిగిపోయిన ఈ రాజు వర్థిల్లడం ఖాయం.
నా శాపం నిష్ప్రయోజనమయిపోయింది.
త్రి: (వెనుకకు తిరిగి, అతన్ని ముఖంలోముఖంపెట్టి చూస్తూ)
ముసలయ్యా! నువ్వు పొరపాటు పడ్డావు!
నీకు బదులుగా, శిక్ష విధించేవాడు ఇంకొకడున్నాడు!
** ** **
(సశేషం)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి