రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 3 వ భాగం

తృతీయాంకం దృశ్యం 3 

మరువీచి – దర్బారు ప్రముఖులు- త్రిభుల 

[పెన్న మినహా మిగతా దర్బారు ప్రముఖులంతా లోనకి వస్తారు.  అతను ద్వారబంధం దగ్గర కాపలా కాస్తుంటాడు.] 

మరువీచి: (తలుపువైపు వేలు చూపిస్తూ)  గొర్రెపిల్ల ఆశ్రయంకోసం సింహం గుహలోకి దూరింది. 

పార్థివన్: పాపం, త్రిభుల! 

పెన్న: (లోపలికి వస్తూ) హుష్! నిశ్శబ్దం! అతను వస్తున్నాడు.  అందరికీ ఇదే హెచ్చరిక.  ఏమీ ఎరగనట్టు ఎవరి పని వారు చేసుకుంటూ పొండి. 

మరు: అతను నాతో తప్ప ఎవరితోనూ మాటాడలేడు.  అతను ఇక్కడ ఎవర్నీ గుర్తుపట్టలేడు. 

పార్థి: మనం ఏ విషయమూ పొక్కనియ్యకూడదు. 

(త్రిభుల ప్రవేశం. అతను యథాప్రకారం విదూషకుడి వేషంలో ఉంటాడు. కాకపోతే కొంచెం పాలిపోయినట్టు కనిపిస్తాడు.  పెన్న మిగతావాళ్లతో ఏదో సంభాషణలో మునిగిపోయినట్టు  ప్రవర్తిస్తుంటాడు. కానీ నవ్వు ఆపుకోలేక కొందరు యువ రాజవంశీకులకు హావభావ ప్రదర్శన చేస్తుంటాడు.) 

త్రిభుల:           (నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రంగస్థలి ముందుకి వస్తాడు.) 

(తనలో)  ఆమెను వాళ్ళెక్కడ దాచేరో? ఇపుడు వాళ్లని ఆ విషయం అడిగితే నా ముఖం మీదే నవ్వుతారు. ( అతను మరువీచి దగ్గరకి కొంత ప్రసన్న మైన ముఖంతో వెళతాడు) 

మరువీచీ! నిన్న రాత్రి వేసిన చలికి నీకు పడిశం పట్టనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 

మరు: నిన్న రాత్రా? 

త్రి: (అది హాస్యంగా  తీసిపారేస్తూ) మంచి టోకరా వేసారు.  బాగా నటించారు. 

మరు: టోకరానా? 

త్రి: అవును. చాలా పకడ్బందీగా పథకం వేసి అమలుపరచారు. 

మరు: అదేమిటి? నిన్న రాత్రి పదోగంటకే దుప్పట్లో ముసుగుతన్ని పడుకుంటే! బారెడు పొద్దెక్కేదాకా తెలివేరాలేదు. 

త్రి: (అతను చెప్పినది నమ్మడానికి ప్రయత్నిస్తూ)  బహుశా నాకు కలగాని వచ్చిందేమో! 

(అతను కుర్చీ మీద ఒక జేబురుమాలు చూస్తాడు. దాన్ని ఒక్క సారిగా లాక్కుని దాని మీద ఉన్న అక్షరాలు పరిశీలిస్తుంటాడు) 

పార్థి: (పెన్నతో) చూడు పెన్నా! నా చేతిరుమాలుని తినేసేలా పరికిస్తున్నాడు? 

త్రి: (నిట్టూర్పుతో) ఆమెది కాదు. 

పెన్న: (యువ రాజవంశీకులతో) అయ్యా! మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? అంత నవ్వు పుట్టించే విషయం ఏమిటుందిక్కడ? 

గ్ద్దే: అదిగో (మరువీచిని చూపిస్తూ) అతను! 

త్రి: వింతగా ఉందే!  వీళ్ళు నిష్కారణంగా ఎందుకు నవ్వుతున్నారు?

(పెన్నను సమీపించి) స్వామీ! ప్రభువులు ఇంకా నిద్రిస్తున్నారా? 

పెన్న: అవును విదూషకా! 

త్రి: అతని గదిలో ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి? 

(అతను తలుపు దగ్గరకు పొబోవును) 

పెన్న: (అతన్ని వారిస్తూ) ప్రభువులకు నిద్రాభంగం అవుతుంది. 

గద్దే: (పార్థివన్ తో) స్వామీ, వినండి. ఆ కవిగాడు మరువీచి ఒక కమ్మటి కథ చెబుతున్నాడు. స్వర్గం నుండి తిరిగి వస్తున్న ముగ్గురు మహర్షులు — ఏమంటావు విదూషకా?– వాళ్ళ భార్యలు ఎవరి ప్రక్కలో ఉన్నారో కనుక్కున్నారట! 

మరు: దాగున్నారో! 

త్రి: మనం ఒక దారుణమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం. 

కాశ్యప: స్త్రీలు చాల నమ్మక ద్రోహులు. 

త్రి: స్వామీ, గుర్తుంచుకొండి. 

కాశ్యప: ఏమిటి? 

త్రి: జాగ్రత్త! ఆ చెబుతున్న కథ మీదే కావచ్చును.  అటువంటి అందమైన కథే మీ గురించి ప్రచారంలో ఉంది. ఇప్పటికీ మీ చెవులమీద ఏదో ( రెండు చేతులూ తలమీద పెట్టి వేళ్ళతో కొమ్ములు సంజ్ఞ చేస్తూ) కనిపిస్తోంది. 

కాశ్యప: (ఆగ్రహంతో) హా! 

త్రి:(సభాసదులనుద్దేశించి ప్రసంగిస్తూ, కాశ్యపను చూపుతూ) 

సాత్త్వికులారా! ఇదో చిత్రమైన జంతువు.. దాన్ని రేపెట్టినప్పుడల్లా, ఒక గావుకేక పెడుతుంది.  హా! (అని కాశ్యపను అనుకరిస్తాడు) 

(సభాసదులంతా కాశ్యపను చూసి నవ్వుతారు.  ఇంతలో రాణీగారి సేవకుడు వంగర ప్రవేశిస్తాడు.)    

పెన్న: వంగరా! ఏమిటి విషయం? 

వంగర: మహరాణీ వారు అత్యవసర కార్యమై ప్రభువువారి దర్శనం కోరుతున్నారు. 

(పెన్న అది సాధ్యం కాదని సంజ్ఞ చేస్తాడు.) బ్రజ కాంత ప్రస్తుతం ప్రభువులతో లేదు కద! 

పె: (కోపంతో) ప్రభువులు ఇంకా నిద్రలోనే ఉన్నారు. 

వం: అదేమిటి ప్రభూ?  కొద్ది క్షణాల క్రిందటివరకూ  మీ రందరూ కలిసే ఉన్నారు కద! 

(పెన్న అతనికి సంజ్ఞలు చేయును కాని అతనికి అర్థం కాదు. త్రిభుల ఉత్కంఠతో అందర్నీ మార్చి మార్చి పరిశీలించుచుండును) 

పె: అతనిపుడు వేటలో ఉన్నారు. 

వం: అదేమిటి? అశ్వమూ లేక, వేటగాళ్ళూ లేక, అతని మందీ మార్బలమంతా ఇక్కడుంటుంటే? 

పె: ఏడిచినట్టుంది. ( పట్టలేని కోపంతో) 

ఇప్పటికైనా తలకెక్కిందా? ప్రభువులు ఈ రోజు ఎవ్వరినీ చూడరు. 

త్రి: (ఒక్క సారి మేఘంలా గర్జిస్తాడు)  అలా అయితే ఆమె ఇక్కడనే ఉంది. ఇక్కడే ఉంది. 

(అందరూ ఒక్క సారి ఆందోళన చెందుతారు) 

గ: ఆమె  ఎవరు? అతనేదో వాగుతున్నాడంతే! 

త్రి: ఆహా! సాత్త్వికులారా! నేనేమిటి మాటాడుతున్నానో మీకు బాగా తెలుసు. మీరు నన్ను నా లక్ష్యం నుండి వేరు చెయ్యలేరు. మీ రంతా వఠ్ఠి నీచులు. పిరికి పందలు. నిన్న రాత్రి నాఇంటినుండి ఎత్తుకొచ్చేరే- ఓయ్ మధునిషా, బహుగుణా, పెన్నా, శనిగాళ్ళల్లారా- అంతా వినండి. ఆమె ఇక్కడే ఉంది. ఆమె నాది! 

పె: అయితే ఏమిటంటావు త్రిభులా?  ప్రియురాల్ని పోగొట్టుకున్నావా? పాపం!నీలాంటి అందగాడికి, తొందరలోనే మరొక సుందరి దొరకకపోదులే! 

త్రి: (గట్టిగా)  నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వండీ! 

అందరూ: (ఆశ్చర్యంతో) హా! కూతురా?

త్రి: హా! హా! హా!నా కూతురే!.

నన్ను చూస్తే మీకు ఇంకా నవ్వు వస్తోందా?ఏం? తోడేళ్ళకీ, దర్బారుజనాలకీ పిల్లలుండగాలేనిది, నాకుమాత్రం ఎందుకుండకూడదు? స్వాములూ! ఇక చాలు. ఇది హాస్యమే అయితే- వేళాకోళానికే అయితే, ఇక్కడ ఆపెయ్యండి! మీరు నవ్వుతున్నారు! గుసగుసలుపోతున్నారు! నీచులు! మీరు చేసింది ఒక బుర్రలేని పని.  ఆమెను మీదగ్గరనుండి లాక్కుంటాను. నా బిడ్దను నాకివ్వండి! ఆమె ఇక్కడే ఉంది!

(అతను రాజుగారి మందిరం వైపు పరిగెత్తును. అందరూ అడ్డుకుంటారు) 

మరు: అతని తెలివి తక్కువ పిచ్చిలోకి ముదిరింది. 

త్రి: మీరు దర్బారు ప్రముఖులు కాదు.  రాక్షసులు.  భట్రాజులు.  మీ వంశం నాశనమయిపోను.  ఒక కన్యక మానం అంటే మీకు ఏమీ కాదా? కేవలం ఒక రాజుకి తగిన ఆహారమేనా? ఒక కామాతురుడి ఆటవస్తువా?  అతన్ని ఆనందపరచడానికి అవకాశం వస్తే, మీ భార్యలూ, బిడ్డలూ, అతనికి అప్పగిస్తే అప్పగింతురు గాక, ఒక కన్యక పవిత్ర శీలం – ఆమె సంపదగా భావించే గుప్తధనం! ఒక స్త్రీ అంటే సుక్షేత్రం. సస్యకేదారము. అటువంటిది, రాజుగారికి బాడుగ ఇవ్వబడింది. దానికి బాడుగ ఏమిటి? ఒక ప్రభుత్వ పదవి. ఒక బిరుదు. ఒక అలంకారం. అంతే! మీలో ఎవ్వడైనా ఇది నిజం కాదు అబధ్ధమని ఖండించండి!  లేరు. ఇది పచ్చి నిజం.  నీచాతి నీచులైన దొపిడీదారులారా! మీరు అతనికి ఏదైనా అమ్మడానికి సిధ్ధమే! 

(గద్దేతో) అయ్యా మీ సోదరి సంగతి;

(పార్థివన్ తో) స్వామీ! మీ అమ్మగారి సంగతి: 

(బహుగుణతో)- నీ సంగతి, మీ ఆవిడ సంగతి ఏమిటి? 

ఎవరు నమ్ముతారు? అందరూ రాజసేవకులే! భూస్వాములూ, సామంతులూ, మంత్రులూ.

షాలమేన్ వంశం ఒకరిది; మిలాన్, సిమియన్,వంశాలు కొందరివి. ఓహ్! ఎటువంటి వంశాలు! ఎటువంటి కీర్తి ప్రతిష్ఠలు!

కాని మీ కందరికీ చేతనైనదీ, మీరు సాధించిన ఘనకార్యమూ ఏదయ్యా అంటే, ఒక పేదవాడికూతుర్ని ఎత్తుకు రావడం.

అంత ఉత్తమ వంశీకులు- గర్వించ చరిత్రగలవాళ్ళలో ఇంత పిరికి పందలు పుట్టరూ, పుట్టలేరూ. తప్పకుండా మీ మీ  తల్లులు ఒకానొక బలహీన క్షణాల్లో ఏ ఆంతరంగికుడైన సేవకుడి సాంగత్యమో చేసి ఉండాలి. మీ రంతా లం.కొ.లే! 

గ: వహ్వా! విదూషకా! 

త్రి: ఇంత గౌరవప్రదమైన సేవకు రాజుగారు మీకు ఏమిటి ముట్టచెప్పేరు?  మీకు ముట్టింది నాకు తెలుసు. (వేళ్ళకంటిన కన్నీరు తలకు రాసుకొనును) 

ఆమె తప్ప ఇంకెవ్వరూ లేని నాకు, రాజు ఏంచెయ్యగలడు? మీలాగ ఏ బిరుదువెనకో దాక్కునేందుకు నాకేమి ఇవ్వగలడు? 
నా అవయవాలకు సాకారాన్నివ్వలేడు.  
నా చూపయినా సరిచెయ్యలేడు. గంగలో మునగనియ్యండి.  
నా సర్వస్వాన్నీ తీసుకున్నాడు.  ఆమెను  తిరిగి నాకు ఇచ్చేదాకా ఇక్కడనుండికదలను.  
ఈ వణుకుతున్న చెయ్యి చూడండి.  ఇదెవరిది? ఒక నౌకరుది.  ఇందులో ఏ ఉత్తమ వంశీకుల రక్తమూ ప్రవహించడం లేదు. 
ఈ చేతిలో కత్తిలేదు కాబట్టి నిరాయుధుణ్ణి అనుకుంటున్నారు.  
కాని మీ అందరి దగ్గరనుండి, నా గోళ్ళు ఉపయోగించి అయినా విడిపించుకుపోగలను.  

(అతను మళ్ళీద్వారం దగ్గరకు పరుగెత్తుతాడు. అందరూ అతనిమీద కలియబడతారు. కొంతసేపు నిస్సహాయంగా పెనుగులాడి, చివరకు అలసిపోయి, రంగస్థలి ముందుభాగంలో మోకాళ్ళమీద పడిపోతాడు.) 

అందరూ నాకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఒక్కడికోసం పదిమంది! 

(మరువీచిదిక్కు చూస్తూ) 

మరువీచీ! ఈ కన్నీళ్ళు చూడు!  కనికరం చూపించు! నీది కవి హృదయం! జాలి చూపించి ఆమె ఇక్కడే ఉందని చెప్పు!మీదంతా ఒకే లక్ష్యం. ఇక్కడ ఉన్న ఇంతమందిలో మతీ సుతీ ఉన్నది నీకొక్కడికే! మరువీచీ! మా మంచి మరువీచీ! 

(మిగతావారివంక చూసి) 

దొరలు! ప్రభువులు! మీరందరూ. మీ పాదాలచెంత నేను న్యాయం అర్థిస్తున్నాను. ఇపుడు నా మనసు బాగులేదు. దయచేసి కనికరించండి. మరొరోజు ఎపుడైనా మీ పరాచికాలు సహిస్తాను. 

ఎన్నేళ్ళనుండో ఈ అంగవికలుడు మిమ్మల్ని నవ్విస్తూనే ఉన్నాడు. 

అవును. ఇపుడు హృదయం బద్దలయేలా ఉంది! మీ త్రిభులను మన్నించండి! ఇంతటి నిస్సహాయుడి మీద మీ ఆగ్రహాన్ని వెలిగ్రక్క కండి! నా కూతుర్ని నాకిప్పించండి!  నాకున్న సంపద, ఏకైక సంపద ఆమె ఒక్కర్తే! 

ఆమె లేకుంటే, ప్రపంచంలో ఏదీ నాది కాదు.  నామీద జాలి చూపండి! ఇటువంటి రాత్రి మరొకటి ఎదురైతే, నాతల పండిపోతుంది. పగిలిపోతుంది! 

(రాజుగారి గది తెరుచుకుంటుంది. అందులోంచి, గాభరాతో, చెదరిన జుత్తుతో, బాహుదా పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఒక్క కేకతో తండ్రి చేతుల్లో వాలిపోతుంది.)

బాహుదా: నాన్నా! నా… (తండ్రి గుండెల్లో ముఖం దాచుకుంటుంది)

త్రి: బాహుదా! బంగారు తల్లీ! చూడండి మారాజులు! నా వంశపు కొసపింజను చూడండి. సాక్షాత్తూ ఒక దేవకన్యకే! సాత్త్వికులారా! నన్ను మన్నించండి. ఈ ఆనందాశ్రువులు మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. కేవలం చూడటం మాత్రం చేతనే మనసెంతో నిర్మలత్వం సంతరించుకుంటుందే, అటువంటిది, ఈ పిల్లని పోగొట్టుకోవడమంటే మాటలా? బాధాకరం కాదూ? మీకు మాత్రం తెలీదూ?

(బాహుదాతో)

ఇంకదేనికీ భయపడనక్కరలేదు. ఇదంతా కేవలం మతి తప్పిన వేళాకోళం మాత్రమే! నవ్వుకోడానికి ఒక మిష.

అయ్యోతల్లీ! వాళ్ళునిన్నెంత భయపెట్టేసేరు! నిజం చెప్పమ్మా!

(ఆమెను అభిమానంగా కౌగిలించుకొనును)

ఇప్పుడు నాకెంతో హాయిగా ఉంది.   నేను నిన్నెంత గాఢంగా ప్రేమించేనో- నాకిప్పటిదాకా తెలీనే తెలీదు.  నిన్ను పోగొట్టుకున్నానేమోనని ఒకప్పుడు ఏడ్చిన నాకు, ఇప్పుడు సంతోషంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయ్. నిన్ను మళ్ళీ చూడగలగడమే నిజంగా స్వర్గం! కాని తల్లీ, నువ్వేడుస్తున్నావా?  ఎందుకూ?

బా: (ముఖంచేతులలో కప్పుకుని) అయ్యో! నన్ను  నా అవమానం నుండి కాపాడు!

త్రి: ఏమిటి తల్లీ నువ్వు చెప్పేది?

బా: (అందర్నీ చూపిస్తూ) వీళ్లందరి ముందరా చెప్పలేను. సిగ్గుతో చచ్చిపోతాను. నీతో ఏకాంతంలోనే చెప్పగలను. (ఏడ్చును)

త్రి: (రాజమందిరం వైపు చూస్తూ) ఓరి పశువా! ఈమెను కూడా….?

బా: (వెక్కి వెక్కి ఏడుస్తూ త్రిభుల కాళ్ళపై పడిపోతుంది) నాన్నా! నీతో … ఒంటరిగా…

త్రి: (అందరు దర్బారు ప్రముఖులవైపు నడుస్తూ) వెళ్లండి! ఇక్కడనుండి మీరందరూ ఫొండి! ఒకవేళ రాజు ఈ త్రోవను రాదలుచుకుంటే (రాజభటుడివైపు తిరిగి) నువ్వు అతని అంగరక్షకుడివి కదా! అతనికి హెచ్చరిక చెయ్యి, ఇటు రావడానికి వీలులేదని! త్రిభుల ఇక్కడ ఉన్నాడనీ..

పె: ఇంతమంది మూర్ఖుల్ని చూశాను గానీ, ఇంతటి మూర్ఖుణ్ణి ఎక్కడా చూడలేదు.

గ: ఒక్కొక్కసారి మనం పిచ్చివాళ్లకీ, పిల్లలకీ తలఒగ్గక తప్పదు. ఫర్వాలేదు. మనం బయటనుండే కనిపెడదాం. పదండి. (కాశ్యప మినహా అందరూ నిష్క్రమిస్తారు)

త్రి: బాహుదా! ఇంక నిర్భయంగా చెప్పమ్మా! (తలత్రిప్పిచూడగా, కాశ్యప కనిపిస్తాడు. ఒక్క ఉరుము ఉరిమినట్టుగా)

ఏం? మీకు నామాట వినిపించలేదా స్వామీ?

కా: (తొందరగా నిష్క్రమిస్తూ) ఈ విదూషకుడు ఒక్కొక్క సారి ఎక్కడలేని వింత చనువునూ ప్రదర్శిస్తుంటాడు.

(సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: