రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 2 వ భాగం

తృతీయాంకం  దృశ్యం 2

రాజు- బాహుదా

రా: (బాహుదా ముసుగు తొలగిస్తూ) బాహుదా!

బా: (ఆనందం, ఆశ్చర్యంతో) ఓహ్! భగవంతుడా! మధుపాయి!

రా: (పట్టరాని నవ్వుతో) నా మీద ఒట్టు! కాకతాళీయం అనుకున్నా, ముందుగావేసుకున్న పధకం అనుకున్నా సరే! లాభం మట్టుకు నాకే! ఓ! బాహుదా! ప్రియా! హృదయేశ్వరీ! ఏదీ, రా! నాచేతులలోకి రా!

బా: (లేవబోతూ, మళ్ళీ కూర్చుంటుంది) ప్రభువులు నన్ను మన్నించాలి! నిజానికి నాకు ఏం మాట్లాడాలో తెలియడంలేదు. మధుపాయి! కాదుకాదు, ఇప్పుడు దయగల ప్రభువులు.

(అతనికాళ్ళమీద మరొకసారి పడుతుంది)

మీరెవరయినా కానీండి.  దయయుంచి నామీద కనికరం చూపించండి!

రా: నీమీద కనికరం చూపించడమేమిటి బాహుదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మధుపాయి నీకు ఇచ్చిన ప్రేమను, ఈ ఫ్రాన్సిస్ ఆమోదిస్తున్నాడు. నేను నిన్నూ, నువ్వు నన్నూ, ప్రేమించుకుంటున్నాం. ఆ రకంగా మనిద్దరం అదృష్టవంతులం. రాజు అన్నహోదా ప్రేమజ్వాలను ఏరకంగానూ తగ్గించలేదు కదా! ఒకప్పుడు నువ్వు నన్ను మేధావిగా, చర్చి సేవకుడిగా, ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఎవరైనప్పటికీ, చదువుకుంటున్న ఒక పేద విద్యార్థిగా గుర్తించావు.  ఇపుడు నన్ను అదృష్టం ఒక ఉన్నత వంశ సంజాతుణ్ణిచేసింది.  నన్ను రాజునుచేసి కిరీటాన్ని నెత్తిమీద పెట్టింది.  అకస్మాత్తుగా అది నన్ను తిరస్కరించదానికీ, ఏవగించుకుందికీ తగిన కారణం అవుతుందా? నేను బానిసగా బ్రతికే భాగ్యానికి నోచుకోపోతే అది నా అపరాధమా!
(రాజు పగలబడి నవ్వును.)

బా: (తనలో) ఓహ్! అతనెలా నవ్వుతున్నాడో! నాకు సిగ్గుతో చచ్చిపోవాలనుంది)

రా: ఎన్ని వేడుకలు, ఆటపాటలు, అలంకారాలు మనకోసం ఎదురుచూస్తున్నాయో! తోటలో పొదరిళ్ళలో ప్రేమ ఎన్ని గుసగుసలుపోతున్నదో! చీకటి తన గుప్పిటిలో  వేలకొలది అందాలు దాచిఉంచింది.  నీ సుఖమయమైన జీవితానికి నాతో అంటుకట్టబోతున్నాది. మనం ఇద్దరం పెనవేసుకోవలసిన జంట. రా! కాలాన్ని కరిగిపోనీ.

మనిషి జీవితమనగా ఎంత!  బుద్బుద ప్రాయం. ప్రాయమూ బుద్బుదమే! శ్రమ, సం రక్షణల ఝంఝాటం. ప్రేమ దానికి వెలుగును ప్రసాదిస్తుంది. ప్రేమే లేకపోతే అది ఎందుకూ పనికిమాలినదే బాహుదా! నేను ఎప్పుడూ ఆ విషయం గురించే ఆలోచిస్తుంటాను. నాకు అదే వివేకవంతంగా కనిపిస్తుంది కూడా. దైవ నిర్ణయాన్ని అంగీకరించు. తిను. తాగు. సుఖంగా ఉండు. జీవితాన్ని ప్రేమతో అభిషేకించు!

బా: ( అగమ్యగోచరంగా చూస్తూ, భయంతో) నా ఊహ ఎంత అసమంజసమైన చిత్రాన్ని గీసింది!

రా: అయితే నువ్వు నాగురించి ఏమనుకున్నావ్? ఒక మూర్ఖుడననుకున్నావా? ముఖం విషాదంగా పెట్టగానే – స్త్రీలందరూ జాలితో కరిగి నీరయిపోయి అతన్ని ఆదరిస్తారని భావించే ఒక సాధు, పిరికి- చాతకాని ప్రేమికుడననుకున్నావా?

బా: నన్ను విడిచిపెట్టండి (తనలో) ఓసి అభాగ్యురాలా!

రా: నేనెవర్నో నీకు తెలుసా? ఈ సామ్రాజ్యం, ఈ దేశం- ఒకటిన్నరకోట్ల ప్రజ- ధనకనక వస్తువాహనాలు, చట్టానికి అతీతమైన అధికారం, అన్నీ, అన్నీ నావే! వీటన్నిటినీ శాసించి పాలిస్తుంటాను. బాహుదా! నేను వీటన్నిటికీ సర్వంసహాధికారిని. నువ్వు నాదానివి. నేను వాళ్ళకి రాజును బాహుదా! నువ్వు నాకు రాణివి కాలేవా?

బా: మరి మహరాణిగారి సంగతో? అదే మీ భార్య?

రా: (నవ్వుతూ) అచ్చుపోసిన అమాయకత్వం. రాణి అంటే- నా ప్రేయసిగా, హృదయరాణి అని అర్థం.

బా: మీ ప్రియురాలిగానా?  ఆ మాట అన్నందుకు సిగ్గుపడాలి మీరు.

రా: అంత గర్వమా?

బా: (కోపంగా) నేనెన్నటికీ మీ ప్రియురాలిగా మాత్రం ఉండను. నా తండ్రి నన్ను రక్షిస్తాడు.

రా: ఏది? నా కొలువులో విదూషకుడు?  త్రిభులా?…  నీ తండ్రి నా దాసుడు.  నా అధీనుడు.  నా బానిస. అతను నా ఆజ్ఞానువర్తి.

బా: అతను కూడా మీ వాడేనా?

రా: (మోకాళ్లపై కూర్చుని) ఓ ప్రియమైన బాహుదా! నాకు అత్యంత ప్రేమాస్పదురాలవు.  ఇంక ఏడవకు. నా గుండెమీద సేద తీర్చుకో! ( ఆమెను కౌగిలించుకోబోతాడు)

బా: ఎన్నటికీ జరుగదు.

రా; ఏదీ మరొక్కసారి చెప్పు- నన్ను ప్రేమిస్తున్నానని?

బా: దానికి ఎన్నడో మంగళాచరణం పాడేను.(వెక్కి వెక్కి ఏడ్చును)

రా: తెలివి తక్కువగా ప్రవర్తించి నేను నిన్ను బాధించేను. వెక్కి వెక్కి ఏడవకు. ఈ అమూల్యమైన కన్నీరుప్రవహించేటట్టు చేసేకంటే, ఓ ప్రియమైన బాహుదా! నేను సిగ్గుతో ఛస్తాను. లేదా, నా రాజ్యం నుండి , నా కొలువునుండి, కీర్తి ప్రతిష్ఠలూ, శౌర్యప్రతాపాలూ మరిచి ఒక స్త్రీని ఏడిపించినందుకు ప్రతిగా, నిష్క్రమిస్తాను. అయ్యో, భగవంతుడా!

బా: ఇదంతా నాటకమేనా?  నాకు తెలుసు, నువ్వు నాతో పరాచికాలాడుతున్నావని.  నువ్వు నిజంగా రాజువైతే, నన్ను ఇంటికి పంపించు.  నా తండ్రి నా కోసం రోదిస్తుంటాడు.  నేను కాశ్యపగారి భవనం దగ్గర ఉంటున్నాను. అది మీకు ఎక్కడుందో తెలుసు.  అసలు మీరెవరు?  నాకు అంతుపట్టడం లేదు.  నేను ఓడిపోయాను. నవ్వులు కేరింతల మధ్య నిస్సహాయంగా ఇక్కడకు ఈడ్చుకు రాబడ్డాను. నా తల తిరుగుతోంది.  ఇదొక భయంకరమైన పీడకల. మీరు- మీకు  నేనంటే అభిమానమని ఒకప్పుడు తలపోసాను.  (ఏడుస్తూ) బహుశా- నేను మిమ్మల్ని ఇప్పుడు ప్రేమించడం లేదేమో! (ఒక్క సారిగా బిగుసుకు పోయి) మీరంటే ఇప్పుడు భయమే!

రా: (ఆమెను తన చేతులలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ) బాహుదా! నేనంటే నీకు భయమేనా?

బా: నామీద కనికరం చూపింఛండి!

రా: (ఆమెను తన చేతుల్లోకి తీసుకుని) పోనీ, కనీసం ఒక ముద్దు- క్షమించేననడానికి గుర్తుగా!

బా: లేదు, లేదు- లాభంలేదు.

రా: (నవ్వుతూ) చిత్రమైన పిల్ల!

బా: (విడిపించుకుంటుంది) అయ్యో! రక్షించండి! అదిగో ద్వారం…

(ఆమె రాజుగారి శయనాగారం వైపు పరిగెత్తి తలుపు వేసుకొనును)

రా: (తన పటకాలోనుండి ఒక చిన్న తాళం చెవి తీస్తూ) అదృష్టం బాగుంది.  తాళం చెవి నా దగ్గరే ఉంది.

(అతను లోనకి ప్రవేశించి తలుపు వేసుకొనును)

(మరువీచి రంగస్థలి వెనుకనుండి వెనుక జరుగుతున్నది చాలసేపటినుండి గమనించుచుండును)

మరు: ఆమె రక్షణకోసం రాజుగారి అభ్యంతర మందిరంలోకి ప్రవేశించింది. పాపం! వెర్రి గొర్రెపిల్ల! (బయటనున్న గద్దేని పిలుచును)

ఇదిగో, స్వామీ!

గద్దే: మేం లోనకి రావచ్చా?

*–* -*- -*

(సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: