రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 1 వ భాగం
తృతీయాంకం దృశ్యం 1 రాజు
[ రాజప్రాసాదంలో ముందరి గదులు. రినైజాన్సు కాలం నాటి అభిరుచులకు అనుగుణంగా లోపలి అలంకరణలు ఉంటాయి. రంగస్థలం ముందుభాగంలో ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక స్టూలు, వెనుక భాగంలో తళతళలతో ఒక పెద్ద తలుపు ఉంటాయి. అందంగా వ్రేలాడుతున్న తెరలతో ఎడమవైపుగా రాజుగారి శయన మందిరం. కుడిప్రక్క పింగాణీ పాత్రలు ఉంచుకునే సైడు బోర్డు. వెనుకనున్న తలుపు డాబామీదకు తెరవబడి ఉంటుంది.
దర్బారు ప్రముఖుల ప్రవేశం]
గద్దే: ఈ సాహస యాత్రకు భరత వాక్యం పలకాలి.
పెన్న: కాదు. త్రిభులని తన ప్రేయసి ఇక్కడుందని తెలియక బాధతో అల్లల్లాడనియ్యాలి.
కాశ్యప: అవును. అతను ప్రపంచం అంతా గాలించాలి! (సందేహంతో) అవునుగానీ, మరి భవన రక్షకుడెవరైనా ఈ రహస్యం బయటపెడితేనో?
మరువీచి: కాపలాదారులందరికీ ఆదేశాలు జారీ చెయ్యబడ్డాయి. నిన్నరాత్రి ఇక్కడకు ఏ స్త్రీ రాలేదని ప్రమాణం చేసి మరీ చెబుతారు.
పార్థివన్: అంతేకాకుండా, ఇలాంటిపాచికలు వెయ్యడంలో ఆరితేరిన నా బానిసని ఒకడిని రాత్రి ఆ విదూషకుడి ఇంటికి పంపి, అతనిచేత అర్థరాత్రివేళ ‘హాట్ ఫోర్ట్’ భవనంవైపు ఒక స్త్రీని ఎవరో బలాత్కారంగా తీసుకుపోతున్నారనీ, ఆమె పెనుగులాడుతున్నాదనీ, చెప్పించేను.
మరు: (ఒక ఉత్తరం బయటకు తీసి) అంతేకాదు, ఈ ఉత్తరాన్ని రాత్రి పంపించేను:
దొంగిలించితి ప్రభుల ప్రేయసిని నీదు
ఆమెరూపమమోఘము; ఉండనిమ్ము
ఉన్నయెడ నీ హృదయాంత రంగమందు.
కాని, తనువును వెంట తోడ్కొనుచు పోదు.
అధికారముద్రతో- జాన్
(అందరూ పగలబడి నవ్వుతారు.)
పా: ఆహా! ఏమి వేట దొరికింది!
కా: అతని బాధే నాకు ఆనందము.
గ: అవును. ఆ బానిసని కన్నీళ్ళలో, బాధతో పిడికిళ్ళు బిగించి కోపంతో పళ్ళు పటపట కొరుక్కుంటూ మగ్గనియ్యండి. మనకు ఎన్నాళ్లనుండో పడిన బాకీ ఒక్క రోజులో తీర్చుకుంటాడు.
[ఇంతలో రాజుగారి గది తలుపు తెరుచుకుంటుంది. ఆయన సుందరమైన ప్రాభాత అలంకరణతో ప్రవేశిస్తాడు. అతని వెనుక పెన్న చేరి అభివాదము చేసి ఏదో చెబుతాడు. సభాసదులందరూ దగ్గరగా చేరుతారు. రాజు, పెన్న నవ్వు దాచుకోరు]
రా: (దూరంగా ఉన్న గది చూపుతూ) ఆమె అక్కడ ఉందా?
పె: (నవ్వుతూ) మన త్రిభుల ప్రేయసి!
రా: (నవ్వుతూ) నా విదూషకుడి ప్రేయసిని దొంగిలించడమా! అద్భుతం!
పె: భార్యా? ప్రియురాల?
రా: (తనలో) అంత అందమైన భార్యా, కూతురూ కూడా ఉన్నారా? అతనంతటి ఘనుడనుకోలేదే!
పె: ఆమెను ప్రవేశపెట్టడానికి అనుమతి ప్రభూ.
రా: అలాగే!
[పెన్న క్షణకాలం రంగస్థలి వదలి లోనకి పోయి బాహుదాను తోడ్కొని వస్తాడు. ఆమె ముసుగులోనే, భయంతో వణుకుతూ ఉంటుంది. రాజు కుర్చీలో నిర్లక్ష్యంగా కూర్చుంటాడు.
పె: రా, సుందరీ! తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు వణకవచ్చు.. ముందు రాజుగారిని వీక్షించు.
బా: (ఇంకా ముసుగులోనే) (తనలో, ఆశ్చర్యంతో) ఇంత నవయవ్వనుడు. ఇతనేనా రాజుగారు?
(“రాజుగారు” అన్న మాటని బయటకు అసంకల్పితంగా అంటుంది)
(ఆమె అతని పాదాలదగ్గర వాలిపోతుంది. ఆమెగొంతుక విని రాజు ఒక్కసారి నిర్ఘాంతపోయి, అందరినీ నిష్క్రమించమని చేతితో సైగ చేస్తాడు)
— — —
(సశేషం)
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి