రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 4 వ భాగం

ద్వితీయాంకం దృశ్యం 4

బాహుదా, భద్రద,  రాజు      [ ఈ దృశ్యంలో రాజు చాలసేపటివరకు చెట్టు వెనకే దాగి ఉంటాడు]

బాహుదా: నాకెందుకో నేరం చేసిన భావన కలుగుతోంది.

భద్రద: ఏం? ఎందుకని? ఏమిచేసావని?

బా: నా తండ్రి ప్రతి చిన్న విషయానికీ తల్లడిల్లిపోతుంటాడు. చిన్న నీడను చూసినా ఎంత జడుసుకుంటున్నారో చూస్తున్నావు గదా! అతను వెళుతున్నప్పుడు చూసావు కదా, కళ్ళు ఎంత ఆర్ద్రమైపోయాయో!  అంత కరుణాళువైన నా తండ్రికి –ఆ కుర్ర వాడి గురించి, అదే, నీకు తెలుసును కదా, ఎంతో అందంగా ఉంటాడు, ప్రతి ఆదివారం నేను చర్చినుండి ఇంటికి తిరిగి వస్తుంటే నన్ను వెంభడిస్తుంటాడు. అతని గురించి చెప్పి ఉండవలసింది.

భ: ఆ విషయమెందుకూ చెప్పడం?  ఏమీ లేకుండానే మీ తండ్రి ప్రవర్తన చాలా వింతగా ఉంటుంటే! ఇంతకీ ఆ కుర్రవాడంటే నీకు నచ్చదా?

బా: నచ్చకపోవడమా? ఓహ్! అతని రూపం నాకళ్ళలోంచి కదలడంలేదని చెప్పడానికి సిగ్గేస్తోంది. అతని చూపులతో  తొలిసారి నా చూపులు పెనవేసుకున్న క్షణం నుండి, నేను ఏ దిక్కు చూసినా అతని రూపమే కళ్ళకుకట్టినట్టు ఉంటోంది.అదే అయితే ఎంత బాగుండును! అతని ఆకారంలో ఏదో చెప్పలేని ఔన్నత్యం ఉంది.  ఎంత సుకుమారంగా, అయినా ధైర్యంగా, ఠీవిగా,  గుర్రం స్వారీ చేస్తూ, ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తాడు.

(భద్రద రాజు సమీపంలో నిల్చుని ఉండగా, రాజు ఆమె చేతిలో కొన్ని బంగారు కాసులు ఉంచుతాడు.)

భ: నిజం చెప్పాలంటే అతను నాకు కూడా నచ్చేడు. ప్రతిభావంతుడు.

బా: అటువంటి మనిషి  తప్పకుండా…

భ: తెలివైన వాడూ, యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడూ అయి ఉంటాడు.

బా: అతను చూపులేఅతని మనసును పట్టి ఇస్తాయి.  చాలా విశాల హృదయుడు.

భ: ఓహ్! అద్భుతం! అనంతం, (రాజుగురించి చెప్పిన ప్రతి మాటకీ భద్రద చెయ్యి చాచుతూ ఉంటుంది. ప్రతి సారీ రాజు కొన్ని కాసులు ఆమె చేతిలో ఉంచుతూ ఉంటాడు)

బా: థైర్యవంతుడు.
భ: అసహాయసూరుడు.
బా: అయినాసరే, దయార్ద్రహృదయుడు.
భ: చాలా నెమ్మదస్తుడు.
బా: వితరణశీలి
భ: చాలా గొప్పవాడు.
బా: (చివరకు) మనసుని రంజింపజెయ్యగల గుణాలెన్ని ఉన్నాయో, అవన్నీని

భ: అతను నిష్కళంకుడు. సందేహం ఏమీ లేదు. అతని కళ్ళూ, నాసిక, నుదురూ (ఇలా ప్రతి మాటకూ ఒక సారి చెయ్యి జాచుతూంటుంది)
రా: (తనలో) ఓరి భగవంతుడా! నన్ను గాని ఇలా వర్ణించుకుంటూ పోతే  ఏ ఖజానా కూడ సరిపోయేటట్లు లేదు.  నన్ను నిలువు దోపిడీ చేసేస్తోంది.
బా: అతని గురించి మాట్లాడడమంటే నాకు చాలా ఇష్టం.
భ: నాకు తెలుసునమ్మా!
రా: (తనలో) ఎంత ఇచ్చినా అగ్ని మీద ఆజ్యం పోసినట్టవుతోంది గాని, దీని దాహం తీరడం లేదు.
భ: ఆజానుబాహుడు.  కరుణార్ద్రమూర్తి. మంచితనం, త్యాగనిరతి, దయ, చక్కదనం పోతపోసుకున్న వాడు.

రా: (తనలో)  అదుగో మళ్ళీ  పంచాంగం అందుకుంది.
భ: అతను తప్పకుండ ఉన్నతాశయాలుగల రాజవంశీకుడై ఉండి తీరాలి. అతని చేతి “గ్లోవ్స్” చూసేను.  అవి బంగారు జరీతో ఎంబ్రాయిడరీ చెయ్యబడి ఉన్నాయి.

(ఆమె మళ్ళీ చెయ్యి జాచగానే – ఇంకేమీ మిగలలేదన్నట్లు రాజు సంజ్ఞ చేస్తాడు.)

బా: అతను యువరాజుగానీ, రాజకుటుంబీకుడుగానీ, కాకూడదనే నేనుకోరుకుంటున్నాను. అలా అయితే నన్నింకా ఎక్కువగా అభిమానిస్తాడేమో!

భ:అదే నీ అభిమతమైతే అలాగే కానీ!

(తనలో) ఏమి ఆలోచన! ఈ ప్రేమలో పడ్డపిల్లలు ఎంత పొంతనలేని మాటలు మాట్లాడతారో వాళ్ళకే తెలీదు.

(మళ్ళీ మరోసారి చెయ్యి జాచుతుంది)

(ప్రకాశంగా) కాని ఒకటిమాత్రం నిజం.  నువ్వంటే అతనికి అలవిమాలిన ప్రేమ.
(రాజు ఏమీ ఇవ్వడు)

(తనలో)  ఏమిటి? అప్పుడే వట్టిపోయాడా?  అలాగయితే  డబ్బులేదు గనక పొగడ్తకూడా సున్నాయే!

బా: అబ్బ! మళ్ళీ ఆదివారం అంటే ఎంత సుదూరంగానో ఉంది.అతన్ని తిరిగి చూసేదాకా- రాత్రీ పగలూ నా మనసు దుఃఖంలో మునిగి ఉంటుంది.  క్రితంసారి దేవునిపాదాలదగ్గర  అతిసాధారణమైన నా కానుకలు ఉంచుతుంటే అతనేదో మాట్లాడినట్టనిపించింది. నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా? అతనికి కూడ ప్రేమజ్వరంసోకిందనే నా నమ్మకం.  నారూపం కూడ అతని కళ్ళనుండి ఎన్నటికీ విడిచిపెట్టదు. ఇతరులకంటే భిన్నంగా కనిపించే అతని కనుదోయి నాకు తప్ప ఇంక ఏ స్త్రీకీ అందులో స్థానంలేదని చెబుతున్నాయి. నన్నుగూర్చి ఆలోచించుకునే ఆనందంకోసం అతను ఏకాంతాన్ని కోరుకుంటాడు.
భ: (ఆఖరు ప్రయత్నంగా రాజువైపు చెయ్యి జాచుతూ)

ఆ మాటమాత్రం నిజం అని నా తల కదపారాసి ఇవ్వ గలను.

రాజు: (చేతికున్న ఉంగరం తీసి ఇస్తూ- భద్రదతో) నీ తలకు బదులుగా , ఇంద, ఈ ఉంగరం తీసుకో.

బా: ఓహ్!పగలు ఆలోచిస్తున్నా, రాత్రి కలగంటున్నా, నాకెప్పుడూ తలుచుకోగానే నా ప్రక్కన  అతను ఉంటే ఎంతబాగుండును అనిపిస్తుంది. అపుడు అతనితో చెబుతాను: ” సుఖించండి- నాతోడై-  నా ప్రేమాస్పదులు..”
( ఆమె ఈ మాటలు అంటుండగా రాజు చెట్టువెనుకనుండి వస్తాడు ఆమె కోసం రెండుచేతులూ జాచుకుంటూ— ఆమె ముఖం అతనికి వ్యతిరేక దిశలో ఉండగా- మోకాలుపై కూర్చుని, ఆమె మాటలు పూర్తిచేసి ఇటుతిరగగానే)

రా: మీరే! (అని పూర్తిచేస్తాడు)

ఆపవద్దు. ఏదీ? మరొక్కసారి చెప్పు బాహుదా! నన్ను ప్రేమిస్తున్నానని. నీ అధరాలనుండి బయల్వెడలే ప్రేమ – ఇంకా మధురంగా ఉంటుంది.

బా: (గాభరా పడుతూ భద్రదకోసం దిక్కులు చూస్తుంది. అప్పటికే భద్రద చల్లగా జారుకుంటుంది) అయ్యో! నేను మోసగింపబడ్డాను, ఒంటరినై రక్షించే దిక్కులేక!

రా: ఇద్దరు ప్రేమికులు. వాళ్లకు వాళ్ళే ఒక ప్రపంచం.

బా: మీరు ఎక్కడనుండి వస్తున్నారు?

రా: స్వర్గం నుండయినా, నరకం నుండయినా ఫర్వాలేదు.  నువ్వు దేవకాంతవయినా, మానవాకృతివయినా , అభూత కల్పనవయినా సరే! నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

బా: (బ్రతిమలాడుకుంటూ) ఓరి భగవంతుడా! మా నాన్నకు తెలిస్తే! మీరు లోనకు రావడం ఎవరూ పసిగట్టలేదని భావిస్తున్నాను. స్వామీ! నన్ను వదలండి!

రా: జడుసుకున్న నువ్వు నా చేతుల్లో సేదదీరేదాకా నిన్ను విడిచిపెట్టను.  నేను నీవాడిని. నువ్వే నా సర్వస్వమూను.  నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గదా!

బా: (అయోమయంలో) అయితే నేనన్న మాటలన్నీ చాటుగా విన్నారన్నమాట!

రా: నిజమేననుకో! ఇంతకంటే వీనులకింపైన సంగీతం ఇంకొకటేముంటుంది?

బా: మీరు నన్ను ప్రేమించడమే నిజమయితే, మీ ప్రేమకోసమయినా, నన్ను విడిచిపెట్టండి.

రా: నిన్ను విడిచిపెట్టాలా? అందులోనూ, నా భవిష్యత్తు ఇప్పుడు నీతోముడిపడి ఉన్నప్పుడు!  మనజంటనక్షత్రం ఆకాశంలో మెరుస్తున్నప్పుడు. నీ కన్నె హృదయంలో ప్రేమోదయానికి ప్రకృతేనన్నొక సాధనంగా నియోగించినప్పుడు- అది త్వరలోనే మధ్యాహ్నపు సూర్యునిలా జ్వాజ్వల్యమానమవబోతుంటే, నిన్ను వదలాలా? దాని మెత్తని, సన్నని సెగ నీకు ఇంకా తగలడంలేదూ?  మృత్యువు తీసుకునిపోయే చక్రవర్తుల కిరీటాలూ, రాజముద్రలూ, కీర్తిప్రతిష్ఠలూ, గొప్ప నాయకుడన్న పేరూ,ధనవంతుడి వస్తువాహనాలూ — ఇవన్నీ క్షణికాలు. నిరర్థకాలు. లౌకికాలు. సర్వమూ నాశనమై మిథ్యగా మిగిలే  ఈ చరాచర ప్రపంచంలో, ఒకే ఒక్క సంతోషదాయకమైన వస్తువుంది.అదే ప్రేమ! ప్రియమైన బాహుదా! అటువంటి ఆనందాన్ని నీకందిస్తున్నాను, జీవితసుమానికి ప్రేమ మకరందం.  అది పావురంతో రమించే డేగలాంటిది.  ఒదిగే అమాయకత్వం శక్తితో జత కట్టడంలాంటిది. నా చేతిలో ఇమిడిపోయే నీ చిన్ని చేతుల్లాంటిది.  దా! మనం ప్రేమించుకుందాం! ( ఆమెను కౌగిలించుకోబోతాడు. ఆమె వారిస్తుంది)

బా: దయచేసి నన్ను విడిచిపెట్టండి!

భ: (డాబా మీదనుండి చూస్తూ)అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. లేడిపిల్ల వలలో చిక్కుకుంది.

రా: నన్ను ప్రేమిస్తున్నానని నోరారా ఒకసారి అను!

(ఆమెవదుల్చుకుందికి మరో గత్యంతరంలేక నెమ్మదిగా అనును)

భ: (మేడమీద నుండే) ఛీ భ్రష్ఠ!

రా: ఏదీ, బాహుదా! మరొక్కసారి అను!
బా: (కన్నులు దించుకున్నదై) మీరొకసారి విన్నారు. మీకు నా మనసు తెలుసు.

రా: అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి.

బా: నేను ఓడిపోయాను.

రా: లేదు. నువ్వు నాతో సుఖం పంచుకుంటావు.

బా: మీరు నాకు అపరిచితులు.  మీ పేరు తెలియజెయ్యండి.

భ: (తనలో) కథ ఇంత దూరం వచ్చేసేక తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?

బా: మీరు రాజవంశీకులుగాని, కొలువులోనివారుగాని కాదుకద!  వారంటే మా తండ్రికి వల్లమాలిన భయం.

రా: లేదు. భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను. నా పేరు.. (ఏమిచెప్పడమా అని సంశయిస్తుంటాడు- చివరకి)-  మధుపాయి. ఒక పేద విద్యార్థిని.  చాలా బీదవాడిని.
(భద్రద రాజు ఇచ్చిన ధనం లెక్కపెడుతుంటుంది)

భ: (తనలో) అభద్దాలకోరు.

(ఇంతలో పెన్న, పార్థివన్ ప్రవేశిస్తారు. వాళ్ళచేతిలో ఒక లాంతరు ఉంటుంది. వాళ్ళు ముసుగులు ధరించి ఉంటారు)

పెన్న: అదిగో- అదే ఇల్లు

భద్రద: (డాబా మీదనుండి క్రిందకి పరిగెత్తుకుని వచ్చును) బయటనుండి నాకేవో మాటలు వినిపిస్తున్నాయి.

బా:  హే భగవాన్! మా తండ్రిగారు కాదు కద!

భ: (రాజుతో)దయచేసి మమ్మల్ని విడిచి పెట్టండి. ఈ స్థలాన్ని  త్వరగా విడిచిపెట్టండి.

రా: ఎవరా  ద్రోహి,నా సుఖానికి విఘాతం కలిగిస్తున్నాడు? నా చేతులతో వాడిపీక పిసికెయ్యాలన్నంత కోపం వస్తున్నాది.

బా: (భద్రదతో) త్వరగా! త్వరగా! అతన్ని రక్షించు. సముద్రంవైపు తెరువబడే చిన్న ద్వారం తలుపు తెరు.

రా: నిన్నింత త్వరగా విడిచిపెట్టడమా?  రేపు మళ్ళీ కలుస్తావా, బాహుదా?

బా: మరి తమరో?

రా: శాశ్వతంగా

బా: మా తండ్రిగారిని నేను మోసంచేసినట్టుగా, మీరు నన్ను మోసం చెయ్యరుగదా!

రా: ఎన్నటికీ కాదు. ఏదీ, ఆ అందమైన కళ్ళని తనివితీరా ఒక ముద్దు పెట్టుకోనీ.

బా: లాభంలేదు. వద్దు. వద్దు.

(ఆమె వద్దు వద్దని ఎంత వారిస్తున్నా- ఆమె ముఖాన్ని చేతులలోకి తీసుకుని ముద్దు పెట్టుకొనును)

భ: (నెమ్మదిగా) అతను ఎంత నిర్లిప్తంగానైనా ముద్దు పెట్టుకోగల ఘనుడు.

(రాజు భద్రదతో నిష్క్రమించును)

బాహుదా రాజు నిష్క్రమించిన ద్వారంవైపు తదేకంగా చూస్తూ నిలబడును. తర్వాత ఆమె ఇంటిలోనికి పోవును.  ఇంతలో వీధిలో కొలువులోనివారందరూ గుమిగూడతారు.  అందరూ సాయుధులూ, కవచధారులూ అయి, ముసుగులు వేసుకుని ఉంటారు.గద్దే, కాశ్యప, బహుగుణ, మధునిష, మాతంగ, మరువీచి- పెన్ననీ పార్థివన్ నీ కలుస్తారు. రాత్రి బాగా చీకటిగా ఉంటుంది.  చేతిలోని లాంతర్లు కూడా నల్లగా మసిబారి ఉంటాయి.  వాళ్ళొకరినొకరు గుర్తుపట్టినట్టుగా సంజ్ఞలు చేసుకుంటూ, “త్రిభుల” ఇంటివైపు వేళ్ళు చూపిస్తారు.  వాళ్ళ వెనుక ఒక సేవకుడు- గోడలు ఎక్కడానికి అనువైన ఒక నిచ్చెనతో అనుసరిస్తుంటాడు.

(సశేషం)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: