నితాంత ప్రేమ…Shernaz Wadia
తమ యుగళనృత్యపుహేలతో
ఒక అపూర్వమైన జాడను విడిచివెళ్ళారు వారు
ఆ త్రోవ విపరీత భావనల సమ్మేళనం
సంతోషం / సంతాపం, ఆవేదన / ఆనందం
నవ్వూ / కన్నీరూ, అన్యోన్యత / గౌరవం…
వినీల ప్రేమాకాశంలో
వింతవన్నెలరంగుల ఉల్కాపాతం
విధి వాళ్ళ అద్భుతగాథను కాలాతీతం చేసింది…
ఉంచిందామె చేతిలో ఒక పరాయి చెయ్యి
“తప్పదు” అందామె.
ఏకాకిగా నిలబడిపోయాడతడు
అంతుచిక్కని అగాథంలోకి తొంగి చూస్తూ…
కళ్ళుమూసుకుని పిడికిలిబిగించి
ఒక్కసారి ఎగిరేడు
రెక్కలు తొడుగుకుని, విశ్వాసపు వీచికలమీద
రెక్కలార్చుకుంటూ…
ఆశగా వీక్షించిందామె
తన ప్రియుని విధురవియద్యానం
గుర్తుకొచ్చింది– అతనిచ్చిన వీడ్కోలు బహుమతి
తమ స్ఫటికాశ్రువులు
పదిలపరుచుకుందికొక పైడిగిన్నె.
ఆ గాజుతొడుగు నడుమ భద్రంగా-
నాజూకుగా పెనవేసుకున్న ఆమె గుండెమధ్యనుండి
అతని రాగరంజిత హృదయం నవ్వింది.
ఆ తీయని హృదయాశ్లేషనుండి
అతని హృదయం పలికింది
మనప్రేమ అమరం…
Eternal Love
They blazed a trail
in their dance of togetherness
The path a bitter-sweet expression
of joy/ sorrow, pain/ pleasure
Laughter / tears, empathy / respect…
Colourful starbursts
on the firmament of love.
Destiny warped the fairytale…
Put a stranger’s hand in hers!
“inevitable” said she.
Alone stood he
Gazing down a bottomless abyss.
Eyes shut, fists clenched,
He leaped
Sprouted wings and drifted off
on the wind of Faith.
Wistfully she watched
her love gliding away
Then remembered his parting gift –
A golden receptacle to hold
their crystallized tears.
Encased in that glass orb
His ruby-red heart smiled
Tenderly clasped by her own
And, inscribed on their sweet embrace
He read
Our Love is Forever.
Original: Shernaz Wadia
అసంగత ఆకాంక్షలు… Shernaz Wadia
ఈ అనువాదం చదివిన తర్వాత ఇంతకంటే బాగా చెయ్యొచ్చునని మీలో కొందరికైనా అనిపించకపోదు. అప్పుడు మూలం కోసం వెతక నక్కర లేకుండా ఇక్కడ పొందుపరుస్తున్నాను:
శాపగ్రస్తుడనై, అచేతనంగా, దిక్కుతోచక
నాతీరంలో నేనుంటూనే
దిశాంత తీరాల నపేక్షిస్తుంటాను
ఆదరి చేర్చగల సరంగు రాకకై నిరీక్షిస్తూ…
రికామీగా, అశక్తుడనై, తప్పటడుగులేస్తూ,
నేలమీద తడబడుతున్నా, నేను
ఊహలస్వర్గంకోసం ఉవ్విళ్ళూరుతుంటాను
నన్నటకు చేర్చగల ఐంద్రజాలికుడికై ఎదురుచూస్తూ…
నైరాశ్యంతో, జీవితంతో రాజీపడి, ధైర్యం కోల్పోయి,
ఆనవాళ్ళు లేని శవాకృతిగా మిగిలిన నేను
మితిలేని ప్రశంసలకు తపిస్తుంటాను
రాబోయే తరాలు నా అపకీర్తిని కీర్తించాలని
——————————————–
Doomed, bewildered, directionless
On my own home-shore
I hanker for ultimate horizons
Awaiting the oarsman to pilot me ashore
Vagrant, faltering, ineffectual
Doddering on the terra firma
I pine for some Shangri-la
Anticipating a sorcerer to spirit me there
Languid, resigned, gutless
A cadaver sculptured in anonymity
I seek lavish praise
Expecting posterity laud ignominy
———————————————————–
English Original: Shernaz Wadia
దీప కళిక… రబీంద్రనాద్ టాగోర్
బెంగాలీ మూలం:
కే లేబే మోర్ కార్జ్ , కహే సంధ్యా రబి,
సునియా జగత్ రహే నిరుత్తర్ ఛబి
మాటేర్ ప్రదీప్ ఛిలో సే కహిలో స్వామీ
అమార్ జేటుకు సాధ్య కరిబో తా అమి
రబీంద్రనాద్ టాగోర్
Who shall take my charge asked the setting sun,
suddenly, the world went pale and heard it spell-bound
then a small lamp ventured forward, my lord!
to whatever little extent I can, let me!
ముక్త ఛందము
దివము గడిచెను దినకరుఁ డనియె, సామి!
నాదు కార్యముఁ జేకొను నెవరు రేయి?
వెల్లబోయెను, చేష్టల నుడిగె జగము.
‘నాకు గల చేవ నేజేతు’ ననియె దివ్వె
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 4 వ భాగం
పంచమాంకం దృశ్యం 4
త్రిభుల – బాహుదా
(ఒక్క మెరుపు మెరుస్తుంది. ఒక్క పిచ్చికేకతో కొయ్యబారిపోతాడు త్రిభుల)
త్రీ: ఓరి భగవంతుడా! ఇది నా బిడ్డా! ఏమిటిది? నాచేతులకు రక్తం అంటుకుంది? నా కూతురు. నా తల తిరుగుతోంది. క్రూరమైన కల ఏదో నా జ్ఞానేంద్రియాలను వశపరచుకుంది. ఇది అసంభవం! ఇంతసేపూ నాతో ఇక్కడే ఉంది. భగవంతుడా! కనికరించు! ఇది ఆమె అయి ఉండదు. ఆమే అయితే నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది.
(మరొక్కసారి మెరుపు మెరుస్తుంది)
అమ్మో! ఈమె నా బిడ్డే! నా కూతురే ! అయ్యో బాహుదా!
ఈ రాక్షసులు నిన్ను హత్య చేశారా? చెప్పుతల్లీ! మాట్లాడు! ఏదీ, నాన్నతో మాటాడు? ఇక్కడ సాయం చేసేవారెవరూ లేరా? మాటాడు బాహుదా! అమ్మా! బంగారు తల్లీ! అయ్యో! భగవంతుడా!
(అలిసి కూల బడతాడు)
బా: (కొన ఊపిరితో- తనకున్న శక్తినంతా కూడగట్టుకుని ఏడుస్తున్న తండ్రిని చూసి, బలహీనమైన గొంతుకతో)
ఎవరది పిలుస్తున్నారు?
త్రి: (ఆనందాతిరేకంతో) ఆమె మాట్లాడుతోంది! నా చెయ్యి పట్టుకుంది. ఆమె నాడి ఇంకా ఆడుతోంది. ప్రభూ! నువ్వు దయామయుడవి. ఆమె ఇంకా బ్రతికే ఉంది.
బా: (అతి ప్రయత్నం మీద కూర్చుంటుంది. ఆమె తొడుక్కున్న కోటు విప్పేస్తాడు. ఆమె చొక్కానిండా రక్తం. జుత్తు ముడివిడిపోయి వేలాడుతుంది. మిగతా శరీరం కనిపించదు.) నేను ఎక్కడ ఉన్నాను?
త్రి: బంగారుతల్లీ! నా కంటి వెలుగా! నా గొంతు వినిపిస్తోందా? నన్ను గుర్తుపట్టగలవా, అమ్మా?
బా: నాన్నా!
త్రి: ఎవరు చేశారిది? ఏమిటీ నిగూఢరహస్యం? నిన్ను ముట్టుకుంటే ఎక్కడ ఏ గాయాన్ని కెలికి బాధకలిగిస్తానోనని భయమేస్తోంది. బాహుదా! నాకేం కనిపించడం లేదు. తల్లీ, ఏదీ నా చెయ్యి తీసుకుని ఎక్కడ గాయం అయిందో ఒక్క సారి చూపించు.
బా: (ఊపిరికోసం బాధ పడుతూ) కత్తి గుండెలోకి దిగబడింది నాన్నా! అది గుండెను చీల్చినట్టుగా తెలుస్తోంది.
త్రి: కత్తితో పొడిచిందెవరు?
బా: ఆ పొరపాటు నాదే! నిన్ను మోసం చేశాను, నాన్నా! అతన్ని నేను మరీ గాఢంగా ప్రేమించాను. అతని కోసమే నేను ప్రాణత్యాగం చేస్తున్నాను.
త్రి: అయ్యో! ఘోరమైన ప్రత్యుపకారం. నేను ఇంకెవరికోసమో పన్నిన ప్రతీకార చర్య ఇలా బెడిసి కొట్టింది. కానీ ఎలా? ఎవరి హస్తం ఇందులో ఉంది? బాహుదా! తెలిస్తే చెప్పు.
బా: అ……..బ్బా……………..! నన్ను మాటాడమని అడక్కు.
త్రి: (ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ) నన్ను క్షమించు బాహుదా! అందులోనూ, నిన్ను ఇలా పోగొట్టుకుంటున్నాను.
బా: ఊపిరాడటం లేదు. నన్ను కొంచెం ఇటువైపు ఒత్తిగిలించు. కొంచెం గాలి కావాలి.
త్రి: బాహుదా! బాహుదా! తల్లీ! నువ్వు చనిపోడానికి వీలు లేదు!
(నిస్సహాయంగా ఇటూ అటూ తిరుగుతాడు) ఎవరక్కడ? సాయంచేసేవారే లేరా?
సాయం! సాయం! ఆఁ! ఆ బల్ల కట్టుదగ్గర ఉండే గంట, గోడకు సమీపంలోనే ఉంది.
నిన్నొక క్షణంపాటు విడిచి వెళ్తాను తల్లీ! ఎవరయినా సాయం వస్తారేమో చూడ్డానికే!
నీకు కొంచెం నీళ్లు కూడా తీసుకు వస్తాను.
(సాయం కోసం అరుస్తాడు. గంట గట్టిగా వాయిస్తాడు. పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి)
ఏమయింది. అయ్యో! ఈ తండ్రి గుండె పదిలంగా ఉండాలంటే, నువ్వు బ్రతికే ఉండాలి. నా తల్లీ! బంగారుకొండా! నువ్వేకదా నా సర్వస్వమూ! బాహుదా! నిన్ను విడిచి నేను ఉండలేను. వద్దు! చనిపోవద్దు!
బా: (మృత్యుభయంతో) సాయం చెయ్యి నాన్నా! నన్ను లేవనెత్తు. కొంచెం ఊపిరి ఆడనీ!
(ఎత్తి పట్టుకుంటుంటే నొప్పితో మూలుగుతుంది)
త్రి: అయ్యో! నా చేత్తో నిన్ను బలంగా అదిమిపెట్టేనేమో, బండవాణ్ణి. ఇప్పుడు నీకు తేలికగా ఉందా అమ్మా? బాహుదా! ఎవరో ఒకరు ఈ దారంట పోయేవారు వచ్చేదాకా ప్రాణాలు ఉగ్గ బట్టుకో!
అయ్యో! సాయం చెయ్యండి!
బాబూ బిడ్దకు సాయం చెయ్యండి!
( అరుస్తాడు)
బా: (ఎంతో బాధపడిపోతూ) నా..న్నా.. న..న్ను..క్ష..మిం..చు.
(ప్రాణాలు విడిచిపెడుతుంది. అతని భుజం మీద ఆమె తల వెనక్కి వాలిపోతుంది)
త్రి: (ఆవేదనతో) బాహుదా! అయ్యో! ఆమె ప్రాణం పొతోంది! సాయం! సాయం!
( ఆమెను క్రిందికి దించి అతను బల్ల కట్టు గంట దగ్గరికి పరుగెత్తి చాలా జొరుగా గంట మ్రోగిస్తాడు)
ఎవరక్కడ? కాపలాదారూ! హత్య! సాయం!
(బాహుదా దగ్గరకి పరిగెత్తుతాడు.)
నాతో మాటాడు! ఒక్క మాట. ఒక్క మాటంటే ఒక్క మాట.
(ఆమెను పైకి లేవనెత్తడానికి ప్రయత్నిస్తాడు)
ఎందుకమ్మా అంత బిర్రబిగుసుకుపొయావు? తల్లీ!
నీ వయసనగా ఎంత? పదహారే! నువ్వు చావడానికి వీల్లేదు. నువ్వు నన్ను విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇంక నీ ముద్దు మాటలతో ఈ తండ్రి హృదయాన్ని రంజింపజెయ్యవా?
అయ్యో! భగవంతుడా! అసలెందుకు ఇలా జరగాలి? ఇంత అపురూపమైన, అందమైన వరాన్ని ఎందుకు ప్రసాదించాలి? దాని విలువ నేను గుర్తించేలోగానే, నేనింకాలెక్కపెట్టుకుంటుండగానే, ఎందుకు లాగేసుకోవాలి ? లాగేసుకోవడం ఎంత దారుణం?
నీ తల్లి చేతులు నిన్ను సాకకముండే, పసికందుగానే నువ్వు మరణించి ఉంటే, ఈ బాధలేకపోను. లేదా, ఆరోజు, నువ్వు బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు, నీతో ఆటలాడుకుంటున్న సావాసగాళ్ళు, తీవ్రంగా గాయం చేసినపుడు పోయివుంటే, ఈ బాధని తట్టుకుని ఉండగలిగేవాడినేమో!
కాని తల్లీ, ఇప్పుడు నా తరం కాదు. అయ్యో తల్లీ! అమ్మా!
(అతను వాయించిన గంట శబ్దానికి చాలా మంది జనం అతను చివరి మాటలు మాటాడేలోగా పోగవుతారు)
ఒక స్త్రీ: అతని బాధ చూస్తుంటే, నా గుండె తరుక్కుపోతోంది.
త్రి: ఆఖరుకి అందరూ గుమిగూడేరన్నమాట. ఇదే సరయిన సమయం.
(ఒక బండివాడి వంక తిరిగి, చెయ్యి పుచ్చుకుని)
నాయనా! నీ దగ్గర గుర్రం ఉండా? బగ్గీకి తగిలించి ఉందా?
బండి వాడు: ఆఁ! ఉంది. (తనలో) అబ్బా! ఏమి పట్టురా నాయనా! ఉడుం పట్టు!
త్రి: అయితే ఒక పని చెయ్యి. నా తల తెగగొయ్యి. నీ బండి చక్రాలక్రింద నలిపెయ్యి. నా తల్లీ! బాహుదా!
ఇంకొక వ్యక్తి: ఇది ఖచ్చితంగా హత్యే! బాధకి అతనికి స్మృతి తప్పింది. వాళ్ళిద్దర్నీ విడదియ్యడం మంచిది.
(వాళ్ళు త్రిభులను దూరంగా తీసుకుపోడానికి ప్రయత్నిస్తారు)
త్రి: వద్దు. నేనిక్కడే ఉంటాను. ఆమె చనిపోయినా, ఆమె వంకే చూస్తూ కూర్చుంటాను. నేను మీకేం అపకారం చేసాను? నన్నెందుకు ఇలా చూస్తున్నారు? మంచివాళ్ళు కదూ? నన్ను కనికరించండి.
(ఏడుస్తున్న స్త్రీ వంక చూస్తూ) అయ్యో! నువ్వు ఏడుస్తున్నావా? నీది జాలి గుండె. దయతలచి నన్ను వదిలెయ్యమని వాళ్ళకు నువ్వైనా చెప్పు.
(ఆ స్త్రీ జోక్యం చేసుకోవడంతో, అతన్ని బాహుదా శవం దగ్గరికి పోడానికి వీలుగా విడిచిపెడతారు. అతను పిచ్చిగా పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్లమీద వాలిపోతాడు)
ఊఁ! పడూ! మోకాళ్ల మీద పడూ! దౌర్భాగ్యుడా! ఆమెతో పాటు నువ్వుకూడా చావు!
(తల నేలకు బాదుకొనును)
స్త్రీ: శాంతంగా ఉండు! దుఃఖం ఉపశమించుకో! ఇలా మళ్ళీ ఉద్రేకంగా ప్రవర్తిస్తే, నిన్ను దూరం చెయ్యవలసి వస్తుంది.
త్రి: ( దుఃఖంతో విశృంఖలంగా ప్రవర్తిస్తాడు) వీల్లేదు. వీల్లేదు. వద్దు.
(బాహుదాను తన చేతుల్లోకి తీసుకుని అంత దుఃఖంలోనూ, ఒక్కసారి చేష్టలు దక్కి ఉంటాడు. వచ్చే పోయే స్మృతిగాప్రవర్తిస్తాడు)
అదిగో చూడండి! ఆమె మళ్ళీ ఊపిరి తీస్తోంది. ఆమెకు ఒక తండ్రి సంరక్షణ కావాలి. మీలో ఎవరో ఒకరు ఊళ్ళోకెళ్ళి వెంటనే వైద్య సహాయం తీసుకు రండి. అందాకా ఆమెను నా చేతుల్లో పట్టుకుంటాను. నేనిపుడు శాంతంగానే ఉన్నాను.
(ఆమె తన చేతుల్లోకి ఒక తల్లి బిడ్దను ఎలా సాకుతుందో అలా తీసుకుంటాడు)
లేదు. లేదు. ఆమె చచ్చిపోలేదు. భగవంతుడు అలా చెయ్యడు. అతనికి తెలుసు….. ఈ భూమి మీద నేను ప్రేమించేది ఆమెనొక్కర్తినేనని. ఈ భూమి మీద నన్ను ప్రేమించేది ఈమె ఒక్కర్తేనని కూడా అతనికి తెలుసు.
ఈ కురూపిని అందరూ ద్వేషిస్తారు. ఈసడిస్తారు. తప్పించుకు తిరుగుతారు. ఆమె తప్ప ఇంకెవరూ కనికరం చూపలేదు.
నన్ను ప్రేమించింది నా కళ్ళ వెలుగు. నాకున్న ఒకే ఒక్క ఆనందం. మిగతా వాళ్లంతా నన్ను ఈసడించినపుడు, నాకోసం, నా తోటే పాపం తనూ ఏడ్చేది.
ఎంత అందంగా ఉందో చూసేరా? కానీ, పాపం చచ్చిపోయింది.
ఏదీ. దయచేసి మీ చెతి రుమాలొకసారి ఇవ్వండి? ఆమె నుదురొకసారి తుడవాలి.
చూసారా ఆమె పెదాలు? ఇంకా ఎంత ఎర్రగా ఉన్నాయో! నాకు బాగా గుర్తు. నాకు కనిపిస్తున్నంత స్పష్ఠంగా మీకు కూడా కనిపిస్తే బాగుండును…. ఆమెకపుడు రెండంటే రెండేళ్ళు. అయినా జుత్తు బంగారు జలతారులా ఉండేది.
(గుండెకు హత్తుకుంటాడు)
అయితే ఏం లాభం? అన్యాయం జరిగిపోయింది.
నా బాహుదా, నా సుఖం, నా గారాబు బిడ్డ ఎప్పుడో చిన్నప్పుడు, ఆమె “ఇంత” ఉన్నప్పుడు ఇలా గుండెకద్దుకుని, గుండెమీద జోల పాడే వాణ్ణి.
ప్రతిరోజూ కళ్ళు తెరిచేసరికల్లా ఆ చిరునవ్వులు చిందించే కళ్ళు నన్నే చూసేవి. ఆ చూపులు నామీద ఒక దేవత తన కటాక్ష వీక్షణాలను ప్రసరిస్తునట్టుగా జాలువారేవి.
ఆమె నన్నెన్నడూ, అనాకారిగా, దుష్టుడిగా, దుర్మార్గుడిగా చూడలేదు. పిచ్చి పిల్ల! నాన్నంటే దానికి ఎంత ప్రేమో!
కానీ, ఇప్పుడు నిద్రపోతోంది.
నేను ఎందుకు ఇంతసేపూ భయపడుతున్నానో నాకే అర్థం కావడంలేదు. ఆమెకు త్వరలో మెలకువ వచ్చేస్తుంది. ఒక్క క్షణం ఓపిక పట్టండి. త్వరలోనే మెలకువ వచ్చేస్తుంది.
మిత్రులారా! చూస్తున్నారుగదా! నేను ప్రశాంతంగానే ఉన్నాను. చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీరు చెప్పినట్టల్లా చేస్తాను. ఎవరికీ ఏ హానీ చెయ్యను. సరేనా! నన్ను మాత్రం నా బిడ్దను చూసుకోనివ్వండి.
(ఆమె ముఖంలోకి తేరిపార చూస్తాడు)
ఆమె కనుబొమలు ఎంత తీర్చి దిద్దినట్టున్నాయి. ఎక్కడా దుఃఖపు ఛాయ అన్నది లేదు.
(ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ)
అదిగో! ఆమె చెయ్యిని నా చేతులో పెట్టుకుని వెచ్చగా రాసేను. (మిగతా జనంతో) కావలస్తే చూడండి, ఆమె నాడి కొట్టుకుంటోంది మళ్ళీ.
(ఇంతలో ఒక వైద్యుడు ప్రవేశించును)
స్త్రీ: అదిగో! డాక్టరు గారు వచ్చేరు.
త్రి: రండి డాక్టరు గారూ రండి. ఒక సారి పరీక్షించండి. నేను మీకు అడ్డురాను. ఆమెకి తెలివి తప్పిపోయింది. అంతే! అంతే కదూ?
డాక్టరు: (ఆమె నాడిని పరీక్షించి, నిర్లిప్తంగా పెదవి విరుస్తూ) ఆమె చనిపోయింది.
(త్రిభుల పిచ్చిపట్టిన వాడిలా లేచి నించుంటాడు. వైద్యుడు తన మానాన్న తను పరీక్ష చేస్తుంటూ ప్రేక్షకులతో ) ఆమెకు ఎడమ ప్రక్క గాయమయింది. చాలా లోతైన గాయం. బహుశా ఊపిరి తిత్తులలోకి రక్తం ప్రవహించి ఉంటుంది. అందుకే ఆమె ఊపిరి ఆడక చనిపోయింది.
త్రి: (బాధామయమైన ఆర్తితో ఒక్క కేక పెడతాడు)
నా బిడ్డను నేనే చంపుకున్నాను.
(తెలివి తప్పి క్రింద పడిపోతాడు).
***** ***** *****
సమాప్తం
(పాఠకులకు విజ్ఞప్తి: ఈ నాటకాన్ని క్రమం తప్పకుండా చదువుతున్న వారు 20 మంది దాకా ఉన్నారు. మీరు ఈ నాటకాన్ని విశ్లేషించవలసిందిగా మనవి చేస్తున్నాను)
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 3 వ భాగం
పంచమాంకం దృశ్యం 3
(ఒంటరిగా త్రిభుల. అతని దృష్టి అంతా సంచీమీద కేంద్రీకృతమై ఉంటుంది.)
త్రి: అతనిక్కడ చచ్చి పడి ఉన్నాడు. నేనే గనక అతని ముఖాన్ని చూడగలిగితే ఎంతబాగుండును!
(సంచిని మరోసారి పరీక్షిస్తాడు)
సందేహం లేదు. అతనే! ఇవి అతని కాలి జోళ్ళు. వాటిని వేగిర పరచడానికి కొట్టిన నాడాలు ఇవి. అనుమానమక్కరలేదు. అతనే!)
(త్రిభుల లేచి నుంచుని ఒక కాలు సంచీమీద ఉంచుతాడు)
బుర్రతిరుగుడు ప్రపంచమా! ఇప్పుడు, ఇప్పుడు తిలకించు!
ఇక్కడ విదూషకుడు! అక్కడ మహా రాజు!
రారాజు! అసమానుడు! సర్వంసహాధికారి!
అయితేనేం. ఇప్పుడు నాపాదాక్రాంతుడు. నేనిపుడతన్ని నిర్లక్ష్యంగా అటూఇటూ తన్నగలను.
ఈ గోనిసంచీ అతని ముసుగు. ఈ నది అతని సమాధి!
ఇది సాధించినవారెవరు? నే..ను!. నే నొక్కడినే! పరమాద్భుత విజయం!
సూర్యోదయమవడమే తరవాయి. ఈ “చెంచా”ల మంద నమ్మశక్యంకాకుండా చూస్తుంది… ఈ కథని.
కానీ, రాబోయే కాలాలు, ఉదయించని రాజ్యాలు తెలుసుకుంటాయి. తెలుసుకుని భయంతో వాటి ఒళ్ళు జలదరిస్తుంది.
ఏమిటీ?
ఫ్రాన్సిస్?
సామ్రాజ్యపతీ! కాంక్షాపరితప్తా! వీరాధివీరుడైన ఛార్లెస్ కి పక్కలో బల్లెమా! యుధ్ధాధిదేవతా! నీ పదఘట్టనతో శత్రుసమూహాల్ని భయంతో గడగడలాడించినవాడా! మారినాన్ యుధ్ధ విజేతా! నీ హస్త కౌశలంతో విశృంఖలంగా తిరిగే గాలికి ఎగిరిపోయే ధూళికణాల్లా వందలకొలది సైనికుల కుత్తుకలుత్తరించినవాడా!
నీ ప్రతి చర్యా, విశాలవిశ్వంలో నక్షత్రకాంతిలా వెలుగొందిన వాడా!
పాపం! గతించేవా?
నీ తప్పుల్ని భగవంతుడికి విన్నవించుకుని క్షమాపణలు కోరుకునే అవకాశమే లేక, ఏడ్చేవాళ్ళు లేక, నిన్నుగుర్తించేవాళ్ళులేక, ఒక్క దెబ్బకు నేల రాలిపోయావా!
నీ సర్వంసహాధికారాలనుండి, నీ అహంకారం నుండి, నీ సిరిసంపదలూ, కేళీవిలాసాలూ, కాంక్షలూ, అన్నిటినుండీ, నెలలునిండకముందే పుట్టిన బిడ్డలా, ఈడ్చివేయబడి, పారవేయబడ్డావా!
గాలిలోకి కరిగిపోయి, సమసిపోయి, కలిసిపోయావా!
ఒక మెరుపులాగ, ఇలా కనిపించి, అలా మాయమయ్యేవా!
బహుశా రేపు డబ్బుకోసం, నీ శవం వెనుక రోదనలు చేసేవాళ్ళు, ముఖాలు పాలిపోయి, వణుకుతున్న కంఠాలతో, ఫ్రాన్సిస్ చనిపోయాడు! మొదటిఫ్రాన్సిస్ చనిపోయాడు! అని చెబుతారు.
ఆశ్చర్యంగా లేదూ?
(కొద్ది విరామం తర్వాత)
అమ్మా, బాహుదా! అమాయకంగా బాధతో తల్లడిల్లిన నా చిట్టి తల్లీ! నేను నీకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతీకారం చేసాను!
రక్త దాహంతో నాగొంతుక ఇంతవరకు పిడచగట్టుకుపోయింది. బంగారంతో దాన్ని చేదుకోగలిగాను. ఇప్పటికి నా దాహం తీరింది.
(ఆణుచుకోలేనికోపంతో ఆ శరీరం మీఎదకు వంగుతాడు)
ఒరే నమ్మకద్రోహీ!
నువ్వు వినగలిగితే ఎంతో బాగుండేది.
రత్నఖచితమైన నీ మకుటం కంటే విలువైన నాకూతుర్ని,
ఊపిరి పీల్చే ఏ జీవరాశికీ హాని తలపెట్టని నా కూతుర్ని,
వంచనతో నా దగ్గరనుండి దోచుకుని, ఆమె శీలాన్ని హరించి, నాకు పంపేస్తావా?
ఇప్పుడు విజయం ఎవరిది? నాది.
నువ్వు ఊహించలేనివిధంగా నిన్ను వలలోకి లాగేను.
ఉన్మత్తుడవైన నువ్వు ప్రమత్తుడవై ఉండేట్టు చెయ్యగలిగేను.
ఒక తండ్రి తనకి అయిన గాయానికి, కారణభూతుడిని క్షమించగలడేమోననేట్టు నిన్ను భ్రమింపజేసాను.
ఒక బలహీనుడు బలవంతుడితో తలపడటం కష్టసాధ్యమైన పని. కానీ, బలహీనుడే గెలిచాడు.
నీ పాదాలు ముద్దిడుకున్న వాడే, నీ గుండెలు తీసిన బంటు. వినిపిస్తోందా?
సాత్త్వికుల రారాజా!
ఒక దౌర్భాగ్యుడైన బానిస, ఒక మూర్ఖుడు, ఒక హాస్యగాడు,
“మనిషి” అనిపించుకుందికి కూడ కనీస అర్హత లేనివాడు,
నీ చేత “కుక్కా” అని ఎన్నిసార్లో అనిపించుకున్నవాడు,
వాడిప్పుడు నిన్ను కసక్కున కాటేస్తున్నాడు.
(త్రిభుల సంచిని కాలితోతన్నును)
ప్రతీకారానికి కూడా భాష ఉంటుంది. దాని గొంతు విన్నప్పుడు, ఎంత గాఢనిద్రలో ఉన్న ఆత్మ అయినా, మేల్కొనవలసిందే!
పరమ నీచులు కూడా గొప్పవారిగానో, మారిపోయినట్టుగానో కీర్తింపబడవచ్చు. కానీ, ఏదో ఒకరోజు, దోపిడీకి గురైన వాడు, ప్రతీకారపు ఒరలోంచి, తళతళలాడే కత్తిలా, తన ద్వేషాన్ని బయటకు లాగుతాడు.
పిల్లిలా మెత్తని అడుగులు వేస్తుంది- పులి.
ఒక విదూషకుడే, రాజు కుత్తుక తెగగోసేవాడవుతాడు. నేనెంత హృదయదఘ్నంగా ద్వేషిస్తున్నానో, అతనికే గనక తెలిస్తే ఎంత బాగుండును!
కానీ, ఇక చాలు.
ఓ శాపగ్రస్తుడా! ఫ్రాన్సిస్!
పోయి ఈ నదిలో విశ్వాసపాత్రమైన ఒక కెరటాన్ని వెతుక్కో! ఫో!!
ముద్ద ముద్దయిన నీ శరీరాన్ని, ప్రవాహాన్ని ఎదిరించి, నిన్ను దైవసాన్నిధ్యానికి చేర్చమని బ్రతిమాలుకో!!!
(అతను సంచిని ఒక చేత్తో తీసుకుని, ఈడ్చుకుంటూ గోడదగ్గరికి వెళతాడు. అతను పిట్టగోడ మీదకు దానిని ఎత్తబోతూ ఉండగా, మొగలి బయటకు వచ్చి, నాలుగుప్రక్కలా చూచి, రాజుని ఇక నిర్భయంగా వెళ్లవచ్చని సంజ్ఞ చేసి రెండవవైపు దారి చూపిస్తుంది.
సరిగ్గా త్రిభుల నదిలో గోనె మూటను వెయ్యబొయే సమయంలో రాజు నిర్లక్ష్యంగా పాడుకుంటూ రంగస్థలికి ఆవలి వైపు నుండి నిష్క్రమిస్తాడు)
రా: ఆటవెలది కడు నిలకడ లేనిది.
దానిప్రేమ నిత్యమనుట- నమ్ముట మూర్ఖత్వం.
త్రి: (ఒక్క సారి ఆ మూటను నేలకు జారవిడుస్తాడు)
హాఁ ! ఎవరిదా గొంతు? కొంపదీసి ఏ చీకటి జీబూతమో నాతో పరాచికాలాడటం లేదు కదా! అతను వెనక్కి తిరిగి వచ్చి ఎంతో ఆందోళనతో వినడానికి ప్రయత్నిస్తాడు. దూరం నుండి రాజు గొంతు మళ్ళీ వినిపిస్తుంది:
రా: దాని ప్రేమ డోలిక
గాలికూగు తూలిక
త్రి: అయ్యో! విధి వక్రించింది. ఇది అతని శవం కాదు. ఎవడో అతణ్ణి రక్షించాడు. నానోటిముందు కూడు కొట్టేశాడు. మోసం! మోసం!
( సుల్తాన్ ఇంటివైపు పరిగెత్తుతాడు. ఒక్క పై గది కిటికీ మాత్రమే తెరిచి ఉంటుంది)
హంతకులు!
ఈ సంచీ చాలా ఎత్తుగా ఉందే!
ఎవడీ నిర్భాగ్యుడు? వాడికి బదులు హతమైపోయిన వాడు. ఏ అమాయకపు జీవి? నా కెందుకో భయంగా ఉంది.
(శరీరాన్ని తణుముతాడు)
ఇది శవమే! కాని, చచ్చిపోయిందెవరు?
ఈ చిమ్మ చీకటిలో దానిగురించి వితర్కించడం వృధా! ఈ భయంకర నిశాకవచాన్ని ఛేదించడానికి నాకొక దీపకళిక కావాలి. ఎలా? గత్యంతరం లేదు. నేనిపుడు మెరుపులకై నిరీక్షించాలి.
సగం సంచి తెరిచిఉంచి, అతను మెరుపుల కోసం నిరీక్షిస్తుంటాడు. సగం శరీరం కనిపిస్తుంటుంది.
** ** **
సశేషం
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 2 వ భాగం
పంచమాంకం దృశ్యం 2
త్రిభుల- సుల్తాన్
సుల్తాన్: చాలా బరువుగా ఉంది. ఏదీ? ఒక చెయ్యి వెయ్యి! ఇందులోనే నీ మనిషి చచ్చిపడి ఉన్నాడు.
త్రి: అతని ముఖాన్నొకసారి చూస్తాను. ఏదీ? ఒకసారి దీపం తీసుకురా!
సు: అయ్య బాబోయ్! లాభం లేదు.
త్రి: ఏమిటీ? హత్య చెయ్యగలవు గాని, హతుడి ముఖమ్మీద మృత్యువును చూడడానికి భయమా?
సు: నేను భయపడేది అందుకు కాదు. రాత్రి పహరా కాసే వాళ్ళకు. నేను మాత్రం దీపం ఇయ్యను. అయినా, నా పని పూర్తయిపోయింది. నా డబ్బులు నాకిచ్చెయ్!
(త్రిభుల అతనికి నాణేలు ఇచ్చి, శవాన్ని పరిశీలించడానికి సమాయత్తమవుతుంటాడు సంచిని చేతితో తడుముతూ)
త్రి: ఇది శవమే! సందేహం లేదు. (తనలో) చివరకు ద్వేషానికి కూడా దాని సంతోషసమయాలు దానికుంటాయేమో!
సు: నది ఒడ్డుదాకా నేను సాయం చెయ్యనా?
త్రి: అక్కరలేదు. నేనొక్కడినీ చూసుకోగలను.
సు: మరేం లేదు. మరో రెండు చేతులేస్తే పని సుళువవుతుందని! అంతే!
త్రి: ఇది నాకు చాలా ప్రాణప్రదమైన వస్తువు. అందుకని నాకు తేలికగానే అనిపిస్తుంది.
సు: సరే! మీ ఇష్టం. కానీ, దీన్ని ఇక్కడనుండి నదిలోకి విసిరెయ్యొద్దు! ఇక్కడలోతు తక్కువ. (గోడకు దూరంగా ఇంకొక జాగా చూపిస్తూ) అక్కడ ప్రవాహం చాలా లోతుగా, జోరుగా ఉంటుంది. ఊఁ! ఊఁ! తొందరగా కానీ! గుడ్ నైట్!
(అతను ఇంటిలోనికి పోయి తలుపు వేసుకొనును)
** ** **
సశేషం
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 1 వ భాగం
పంచమాంకం త్రిభుల
దృశ్యం 1
[సుల్తాన్ ఇంటితలుపు పూర్తిగా మూసి ఉంచడం, లోపల ఎక్కడా దీపాలు వెలగక పోవడం మినహా, రంగాలంకరణలో ఏ మార్పూ లేక రంగస్థలి నాల్గవ అంకం మాదిరిగానే ఉంటుంది.
త్రిభుల రంగస్థలి వెనుక నుండి ముసుగు కప్పుకుని ప్రవేశిస్తాడు. గాలివాన భీభత్సం తగ్గు ముఖం పడుతుంది. వర్షం కొంతసేపటిలో పూర్తిగా ఆగిపోతుంది కూడా. అయినా దూరం నుండి మెరుపులు మెరవడం కనిపిస్తూంటుంది. ఉరుములు ఇంకా ఉరుముతూనే ఉంటాయి…]
త్రి: ఇప్పుడు విజయం నాది. ఒక నెల్లాళ్ళ దుర్భరమైన బాధ తర్వాత ఇన్నాళ్ళకు దెబ్బతియ్యగలిగాను. హేళనలు, నీచమైన అపహాస్యాల మధ్య, ఈ బఫ్ఫూన్, తన నవ్వుల తెరమాటున- రక్తాన్ని చవిచూసేడు.
(ఇంటి తలుపులు పరీక్షిస్తాడు)
నేను ద్వేషిస్తున్న వాడి శవం ఈ ద్వారం గుండానే బయటకు పోతుంది. ఆహ్! ఇది నిఖార్సయిన ప్రతీకారం. ఫ్రాన్సిస్! ఇంకా పన్నెండు గంటలు కాలేదు. కానీ, అప్పుడే నీ సమాధిని సందర్శించడానికి వచ్చేసేను. ఈ రాత్రి నాకిక నిద్రపట్టదు.
(ఒక ఉరుము గట్టిగా ఉరుముతుంది)
ఆకాశంలో ఒక తుఫాను- భూమి మీద ఒక హత్య సాక్షిగా నేనిప్పుడు ఒక ఘనకార్యాన్ని సాధించేను.న్యాయమైన నా ప్రతీకారానికి, ఆగ్రహానికీ, భగవంతుని ఆగ్రహం కూడా తోడయింది. నేను ఒక రాజునే హత్య చేశాను. ఎటువంటి వాడు? అతని ఉసురు మీద 20 మంది చక్రవర్తుల సింహాసనాలు ఆధారపడి ఉన్నాయి. అతని గొంతుక గడగడలాడిందంటే, లక్షల మందికి శాంతినో, యుధ్ధాన్నో ప్రకటిస్తుంది. సగం మానవ సమాజపు నుదిటి వ్రాతను అతను శాసిస్తాడు. ఇలా రాలిపోతే, ప్రపంచం కూడా కుంచించుకు పోతుంది. అట్లాస్ అంతటి బలోపేతుడ్ని హతమార్చిన ఘనత నా…దే! నా మూలంగానే, ఈ యూరపు ఖండం అంతా అతని మృత్యువుకు శోకిస్తుంది. నేల చిట్టచివరి అంచులనుండి, భీతిల్లిన ఈ భూమి గావుకేక పెడుతుంది… త్రిభులా! శభాష్! నువ్విదంతా ఒంటి చేత్తో సాధించావు. ఆనందించు! ఊఁ ! విజయ గర్వంతో విర్ర వీగు! ఒక విదూషకుడి ప్రతీకారం యావత్ ప్రపంచాన్నే కదలించి వెయ్యాలి!
(గాలి ఉధృతంగానే ఉంటుంది. దూరం నుండి ఒక గడియారం 12 గంటలు కొడుతుంది.)
అదిగో! ఎదురు చూసిన సమయం సమీపించింది.
(త్రిభుల తలుపు దగ్గరకు పరుగెత్తుకుంటూ పోయి, తలుపు గట్టిగా కొడతాడు.)
(లోపలినుండి) : ఎవరది? తలుపు తడుతున్నది?
త్రి: నేను! తొందరగా తలుపు తియ్యి.
లోపలి గొంతు: అన్నీ అనుకున్నట్టుగ్గానే జరిగిపోయాయి. కానీ, లోపలకు రావద్దు!
(తలుపుకి ఉన్న మరో చిన్న తలుపు తెరుచుకుని- సుల్తాన్ బయటకు పాకురుకుంటూ వచ్చి- తన వెనక, చీకటిలో ఒక బస్తాను ఈడ్చుకుంటూ వస్తాడు.
** ** **
సశేషం
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 5 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 5
[రాజు నిద్రిస్తుంటూ మేడమీది గదిలో; సుల్తాన్ మొగలి క్రింద గదిలో; బాహుదా బయట]
బాహుదా: (చీకటిలో నెమ్మదిగా మెరుపుల ఆసరాతో నడుస్తుంటుంది.
మహా ప్రమాదకరమైన ప్రయత్నం. నాకుగాని వివేకము తప్పడం లేదు గదా! ప్రకృతికన్న బలీయమైన శక్తి ఏదో నన్ను ప్రేరేపిస్తోంది. అతను ఈ ఇంటిలోనే ఎక్కడో నిద్రిస్తుంటాడు. నాన్నా, క్షమించు! నీ ఆజ్ఞని ఉల్లంఘించి వచ్చినందుకు మన్నించు. నా హృదయాన్ని చీలుస్తున్న సందేహాన్ని అణుచుకోగల శక్తి నాకు లేదు. ఇన్ని సంవత్సరాలూ, పూలూ, ప్రశాంతతల మధ్య పెరిగిన నేను, ఈ ప్రపంచపు కన్నీళ్ళూ, కష్టాలగురించి ఎరుగని నేను, ఒక్కసారిగా అమాయకపుటానందం నుండి అపరాథమూ, అవమానాల మధ్యకు విసరివేయ బడ్డాను. శీలం అనబడే మందిరాన్ని దానిలోని దీపం దగ్ధంచేస్తే, అందులోని మూర్తిని, ప్రేమే నిర్దాక్షిణ్యంగా త్రొక్కివేస్తోంది. ఇప్పుడందులో అగ్ని ఆరిపోయి, బూడిదమాత్రమే మిగిలింది. అతను నన్ను ప్రేమించడం లేదు. అది ఉరుముపాటువంటి మాట. అది నన్ను గాఢనిద్రలోంచి ఐనా మేల్కొలుపుతుంది. అబ్బా! ఈ రాత్రి ఎంత భయంకరంగా ఉంది! ఒకప్పుడు నీడకుకూడా భయపడే ఈ స్త్రీ హృదయాన్ని, నిస్పృహ పురికొల్పి, ఈ సాహసానికి ఒడిగట్టిస్తోంది.
(ఆమె మీద గదిలో వెలుతురు గమనిస్తుంది) అక్కడ ఏమిటి జరుగుతోంది చెప్మా! నా గుండె ఎలా కొట్టుకుంటోందో! కొంపదీసి అతన్నిక్కడ హతమార్చరు గదా!
(ఉరుము వర్షము చప్పుడు)
సు: (లోపలనుండి) సంసారజీవితంలోని పోట్లాటల్లా, ఆకాశం గర్జిస్తోంది. ఒకరు అరుస్తున్నారు, ఇంకొకరు భూమిని కన్నీళ్లతో ముంచెత్తుతున్నారు.
బా: మా నాన్నకు నేనిక్కడున్నానని తెలిస్తే?
మొ: (గదిలో) అన్నా!
సు: (భయపడి) ఎవరది మాటాడుతున్నది?
మొ: (బాధతో) ఎందుకన్నా?
సు: మరిప్పుడేమిటి చెయ్యడం?
మొ: నా మనసు కనిపెట్టలేవా?
సు: లేను.
మొ: పోనీ ఊహించు.
సు: నిన్ను దయ్యమెత్తుకెళ్ళ. నా తరం కాదే.
మొ: అయితే విను. ఇంత మంచి యువకుడు, ఆజానుబాహుడు, రూపసి, పాపం మనమీద ఏమాత్రం అనుమానం లేకుండా నిద్రపోతున్నాడు… చిన్నపిల్లాడిలా. అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టు.
బా: హమ్మయ్య! భగవంతుడా!
సు: ఈ సంచీ తీసుకుని దానికున్న చిరుగులు కుట్టు.
మొ: ఎందుకూ?
సు: ఎందుకంటే, నా పదునైన కత్తి అంచు, అతనిగుండెల్లోకి మీదనుండి దిగబడిన తర్వాత, నువ్వు ఇంతసేపూ పొగుడుతున్నావే, ఆ అందమైన సూర్యబింబాన్ని, దాన్ని ఇందులోకి తోసి, ఒక బండరాయి కట్టి, నదిలోకి తోసెయ్యడానికి.
మొ: కానీ…(సణుగును)
సు: మారు మాటాడకు! పిల్లా. ఇందులో అనవసరంగా జోక్యం చేసుకోకు.
మొ: అయినా…
సు: ఊరుకుంటావా? లేదా? నీ మాటవింటే, ఎవ్వరూ, ఇంకొకర్ని పొడిచెయ్యనక్కరలేదు. చెప్పిన మాటవిని ఆ సంచీ బాగు చెయ్యి.
బా: బాబోయ్! ఎంత భయంకరమైన జోడీ! కొంపదీసి నేను నరకంలో లేనుగదా!
మొ: సరే! నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వుకూడా నేను చెప్పినట్టు వినాలి.
సు: ఊఁహూఁ!
మొ: ఈ కుర్రాడంటే ద్వేషంలేదు గదా, నీకు?
సు: లేదు. నిజానికి కత్తిపట్టేవాడంటే ఇష్టం. ఎందుకంటే, నేను కత్తిని నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని.
మొ: అలాంటప్పుడు, అలాంటి, అష్టావక్రుడిలాంటి- కురూపి ఐన ఒక గూని వాడ్ని సంతృప్తి పరచడానికి ఒక అందమైన యువకుడిని ఎందుకూ హతమార్చడం?
సు: అసలు విషయమేమిటంటే, ఆ గూనివాడే- ఈ అందమైన యువకుడిని చంపడానికి డబ్బులిచ్చేడు. ఎవరైతే నాకేం? పది బంగారు నాణేలు ముందు, పని పూర్తయిన తర్వాత పదీ. అంచేత అతను చావక తప్పదు.
మొ: అలాంటప్పుడు, మిగతా డబ్బులివ్వడానికి వచ్చినపుడు, ఆ గూని వాడిని నువ్వే చంపెయ్యకూడదూ? ఆ రకంగా మన పని కూడా నెరవేరుతుంది.
బా: అమ్మో! మా తండ్రినా?
సు: (కోపంతో) నీ పురాణం పూర్తయిందా? ఇక నేనెంతమాత్రం ఇలాంటి సలహాలు వినదలుచుకోలేదు. నేను దొంగనీ, బందిపోటునీ, పీకలుత్తరించేవాడినీ అనుకున్నావా లేకపోతే మోసగాడిననుకున్నావా, నా పనికోరి వచ్చిన వాడినే చంపడానికి? థూ…
మొ: పోనీ. ఇందులో ఏదైనా ఒక కర్ర దుంగ కుక్కెయ్యకూడదూ? అతను దాన్ని శవంగా పొరబడే అవకాశం ఉంది గద!
సు: హ్హ!..హ్హ!..హ్హ!..హ్హ! నీ పాచిక గుడ్డివాడిని కూడా మోసగించలేదే. చచ్చిపోయిన వాడి శరీరానికి “ఇదీ” అని చెప్పలేని చల్లదనముంటుందే. దాన్ని అనుకరించడం కుదరదు.
మొ: అతన్ని ప్రాణాలతో ఎలాగయినా సరే, విడిచిపెట్టు.
సు: వీల్లేదు. అతను చావాల్సిందే!
మొ: అలా అయితే అతన్ని నిద్రలోంచి లేపేస్తా! కాపాడి రక్షిస్తా!
బా: చాలా దయాళువైన పిల్ల!
సు: మరి నా ఇరవై నాణేల మాటో?
మొ: అదీ నిజమే ననుకో!
సు: అందుకే! మంచి పిల్లవు గదూ! అన్ని విషయాలూ నాకు విడిచిపెట్టు.
మొ: నేను చెబుతున్నాను, విను. అతను చావడానికి వీలు లేదు.
(మొదటి మెట్టు మీద ఏదో నిర్ణయించుకున్న దానిలా భీష్మించుకుని కూచుంటుంది. రాజు మేలుకుంటాడేమోనన్న భయంతో సుల్తాన్ ఆగుతాడు. ఈ వ్యవహారాన్ని సామరస్యంగా ఎలా పరిష్కరించడమా అని ఆలోచిస్తుంటాడు)
(రాత్రి పదకొండుగంటల సమయం అయిందని సూచిస్తూ దూరం నుండి గంటలు వినిపిస్తాయి)
సు: అయితే విను. నన్ను నియోగించిన వ్యక్తి సరిగ్గా అర్థరాత్రికి వస్తాడు. రాత్రి పన్నెండు గంటలు కొట్టే లోపున ఈ దారిని ఎవడైనా వచ్చి ఈ రాత్రికి మనల్ని ఆశ్రయమిమ్మనికోరితే, అతడ్ని చంపి, లుమ్మలుచుట్టిన అతని శరీరాన్ని, నీ ముద్దుల బొమ్మకు బదులుగా అతనికి మార్పిడి చేస్తాను. అతను నదిలోకి శవాన్ని ఎలాగూ తొసేస్తాడు కాబట్టి, అతనికి తేడా ఎంతమాత్రం తెలీదు. కానీ, నీకోసం నేనింతవరకే చెయ్యగలను. ఇంతకుమించి నావల్ల కాదు.
మొ: చాలన్నా! చాలు. కృతజ్ఞతలు. కానీ, ఇంతరాత్రపుడు, ఏ దైవోపహతుడు ఇక్కడకు వస్తాడు?
సు: అలా తప్ప, అతని ప్రాణం ఇంకెలాగూ కాపాడటానికి వీలవదు.
మొ: ఇటువంటి సమయంలోనా?
బా: అయ్యో, భగవంతుడా! నువ్వు నన్ను పురికొల్పుతున్నావు…ఒక బాస తప్పిన వ్యక్తి ప్రాణాలు రక్షించడానికి!. లాభంలేదు. నేనింకా చిన్నదాన్ని. హృదయమా! నన్ను ప్రేరేపించకు. ముందుకు తొయ్యకు.
(ఒక దొంతర ఉరుములు ఉరుముతాయి)
అయ్యో! ఏమిటీ బాధ! వెళ్ళి కాపలాదారుని కేకేద్దునా? కాని, అంతా నిశ్సబ్దంగా ఉంది. చీకటి రాజ్యం చేస్తోంది. అదిగాక ఈ రాక్షసులు నా తండ్రి దూషిస్తున్నారు. నాన్నా! ముసురుకుంటున్న వార్థక్యంలో, నీ జీవిత చరమాంకంలో- నువ్వు నామీద చూపిన అభిమానానికి కృతజ్ఞతలతో, నీకు ఆసరాగా ఉండడానికి నేను బ్రతికే ఉండాలి. నాకింకా పదహారేళ్ళే! ఇంత చిన్న వయసులో చావుకొనితెచ్చుకోవడం కష్టం. పదునైన కత్తి గుండెల్లోదిగి, కోస్తున్నప్పుడు ఆ బాధ సహించడం కష్టం. అయ్య బాబోయ్! ఈ వర్షం చినుకుల జల్లులు ఎంత చల్లగా ఉన్నాయ్! నా మనసు ఆలోచనలతో వేగిపోతుంటే, శరీరం మాత్రం చచ్చుపడిపోయింది.
(దూరం నుండి గడియారం 11.15 సూచిస్తూ ఒక గంట కొడుతుంది)
సు: అదిగో! సమయం అయిపోవచ్చింది.